కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. కీలక నిబంధనలివే..
ABN , Publish Date - Jan 29 , 2026 | 02:01 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద, కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని సిట్ అధికారులు సూచించారు..
హైదరాబాద్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) విచారణలో భాగంగా మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) కు చెందిన నందినగర్‌లోని నివాసానికి సిట్ అధికారులు గురువారం వెళ్లి నోటీసులు అందజేశారు. ఇందులో ప్రధానంగా సీఆర్పీసీ 160 సెక్షన్ కింద పలు అంశాలను పొందుపరిచారు. శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని నోటీసులో స్పష్టం చేశారు.
నివాసంలోనే విచారించేలా..
కేసీఆర్ వయస్సు 65 ఏళ్ల పైబడి ఉన్నందున, చట్టపరమైన నిబంధనల (సెక్షన్ 160 సీఆర్పీసీ) ప్రకారం ఆయనను పోలీస్ స్టేషన్‌కు పిలవకుండా, ఆయన నివాసంలోనే విచారించేందుకు సిట్ సుముఖత వ్యక్తం చేసింది.
స్థలం ఎంపిక..
కేసీఆర్ తన ఇంట్లోనే విచారణకు హాజరుకావచ్చు. ఒకవేళ ఆయన స్వచ్ఛందంగా రావాలనుకుంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు రావొచ్చు. లేదా హైదరాబాద్ నగర పరిధిలో తనకు అనుకూలమైన మరో ప్రదేశాన్ని సూచిస్తే, అక్కడికే సిట్ బృందం వస్తుంది. విచారణ ఎక్కడ జరగాలనే విషయాన్ని కేసీఆర్ ముందుగానే సిట్ అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది.
సిట్ కసరత్తు..
కేసీఆర్‌ను ప్రశ్నించడానికి సిట్ అధికారులు ఇప్పటికే పలు ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని సిద్ధం చేసినట్లు సమాచారం. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ అధికారులకు అందిన ఆదేశాలు, ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారం ఎవరికి చేరింది..? అనే కోణంలో విచారణ జరగనుంది.
సెక్షన్ 160 సీఆర్పీసీ అంటే ఏమిటి?
సాధారణంగా 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు, మహిళలు లేదా మానసిక, శారీరక వికలాంగులను విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు పిలవకూడదు. వారు ఉన్న చోటికే వెళ్లి సాక్ష్యాలను సేకరించాలని ఈ సెక్షన్ చెబుతోంది. దీన్ని అనుసరించే సిట్ అధికారులు కేసీఆర్‌కు ఈ వెసులుబాటు కల్పించారు. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు కేసీఆర్ ఎక్కడ విచారణకు హాజరవుతారు..? ఆయన ఎలాంటి సమాధానాలు ఇస్తారు..? అన్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే కేటీఆర్, హరీశ్‌రావు, సంతోశ్‌రావులను సిట్ విచారించిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి...
హార్వర్డ్ విద్యార్థులు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు కావాలి: సీఎం రేవంత్
నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. అతివేగంతో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు
Read Latest Telangana News And Telugu News