బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. రామచందర్ రావు అరెస్ట్
ABN , Publish Date - Jul 22 , 2026 | 01:26 PM
గాంధీభవన్ ముట్టడికి బీజేపీ పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు, ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్, జులై 22 (ఆంధ్రజ్యోతి): గాంధీభవన్ ముట్టడికి బీజేపీ పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు, ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో బీజేపీ నేతలు పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. నేతల అరెస్టుల సందర్భంగా పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో భద్రతను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. బీజేపీ నాయకుల అరెస్టుపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాగా, ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాసం ఎదుట నిన్న (మంగళవారం) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన చేశారు. దీనికి నిరసనగా బీజేపీ అగ్రనేతలు గాంధీభవన్‌ను ముట్టడించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో హై టెన్షన్ నెలకొంది.
కరీంనగర్‌లో బండి సంజయ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
ఇక, కరీంనగర్‌లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయం వద్ద కూడా ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు బండి సంజయ్ కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ నేతలను అడ్డుకునే క్రమంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు బండి సంజయ్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో ఆఫీసు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగింది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలో ఒకే రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయం, కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పోలీసులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి నష్టం జరగనివ్వబోం: ప్రధాని మోదీ
ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలి: ఎంపీ చామల
ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ పోలీసులకు నయా రూల్స్ .!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News