Share News

MLA Rakesh Reddy: హిందువుల సొమ్మును ముస్లింలకు దోచి పెడుతున్నారు.. రేవంత్ సర్కార్‌పై రాకేశ్‌రెడ్డి ఫైర్

ABN , Publish Date - Jan 02 , 2026 | 04:11 PM

అత్యధిక పన్ను కడుతున్న హిందువుల సొమ్మును ముస్లింలకు దోచి పెడుతున్నారని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి ఆరోపణలు చేశారు. మూసీ ప్రాజెక్టుకు డీపీఆర్ లేదని.. తోక లేదని ఎద్దేవా చేశారు. దోచుకోవడానికి అప్పుడు కాళేశ్వరం.. ఇప్పుడు మూసీని తెరమీదకు తెచ్చారని దెప్పిపొడిచారు.

MLA Rakesh Reddy: హిందువుల సొమ్మును ముస్లింలకు దోచి పెడుతున్నారు.. రేవంత్ సర్కార్‌పై రాకేశ్‌రెడ్డి ఫైర్
BJP MLA Paidi Rakesh Reddy

హైదరాబాద్, జనవరి2 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో కాంగ్రెస్, మజ్లీస్ కుమ్మక్కు అయ్యాయని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి (BJP Armor MLA Paidi Rakesh Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో గంటల తరబడి మైక్‌ను మజ్లీస్‌కు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఓవైసీ కోసమే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీ పెట్టిందా అని ఎద్దేవా చేశారు. ఇవాళ(శుక్రవారం) అసెంబ్లీ మీడియా పాయింట్‌లో రాకేశ్‌రెడ్డి చిట్‌చాట్ చేశారు. కాంగ్రెస్ సెక్యులర్ పదాన్ని మరిచిపోయిందని విమర్శించారు. హిందూ ఎమ్మెల్యేలను విస్మరిస్తుందని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ విషయాన్ని సరిదిద్దుతామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ సర్కార్‌లో హిందూ ఎమ్మెల్యేలకు అవమానం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ ఎమ్మెల్యేలు ఉన్న చోట అభివృద్ధి ఎందుకు జరగడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి.


తమ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ.500 కోట్లు ఇచ్చిందని ఓవైసీ అసెంబ్లీ సాక్షిగా చెప్పారని ప్రస్తావించారు. అత్యధిక పన్ను కడుతున్న హిందువుల సొమ్మును ముస్లింలకు దోచి పెడుతున్నారని ఆరోపణలు చేశారు. మూసీ ప్రాజెక్టుకు డీపీఆర్ లేదని.. తోక లేదని ఎద్దేవా చేశారు. దోచుకోవడానికి అప్పుడు కాళేశ్వరం.. ఇప్పుడు మూసీని తెరమీదకు తెచ్చారని దెప్పిపొడిచారు. గ్రామీణ తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని ఆరోపణలు చేశారు. భూముల ధరలు పెంచుకునేందుకే.. గ్రామాలను పట్టణీకరణ చేస్తోందని అన్నారు ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి.


కాళేశ్వరం, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులతో నిజామాబాద్ జిల్లాకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. నిజామాబాద్ జిల్లాకు నష్టం చేయొద్దని హితవు పలికారు. నిజాంసాగర్ పునరుద్ధరణకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పుణ్యకాలం గడిచిపోయిందని ఎద్దేవా చేశారు. ఐదేళ్ల కాంగ్రెస్ పాలన డీపీఆర్‌లకే సరిపోతుందని విమర్శించారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు పూర్తికావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల నిమిత్తం ఒక్కో నియోజకవర్గానికి రూ. 25కోట్లు ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అడుగుతున్నారని చెప్పుకొచ్చారు. ప్రజలను మభ్యపెట్టేందుకే అసెంబ్లీ సమావేశాలు పెట్టారని విమర్శించారు ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి.


బీఆర్ఎస్ అవినీతి ఎక్కడ బయట పడుతుందోనని అసెంబ్లీ నుంచి ఆ పార్టీ నేతలు వాకౌట్ చేశారని ఎద్దేవా చేశారు. చిన్న అంశంపైన భయపడి వాకౌట్ చేస్తే ఎలా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా కల్పిస్తామని స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలకు హరీశ్‌రావు, కవితలపై ఫిర్యాదు చేయాలని సూచించారు. కవిత సరైన ఆధారాలతో హరీశ్‌రావుపై ఫిర్యాదు చేస్తానంటే తాను సపోర్టు చేస్తానని స్పష్టం చేశారు. మండలి చైర్మన్ తక్షణమే కవిత రాజీనామాను ఆమోదించాలని డిమాండ్ చేశారు. కవిత రాజీనామా ఆమోదించకపోవడంతో శాసన వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుందని చెప్పుకొచ్చారు. మండలి చైర్మన్‌ను తాను కలిసి కవిత రాజీనామా ఆమోదించాలని కోరుతానని పైడి రాకేశ్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసీఆర్ హయాంలో తెలంగాణకు తీరని అన్యాయం.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్

ఆ బిల్లులు వెంటనే విడుదల చేయాలి: ఎంపీ రఘునందన్

For More TG News And Telugu News

Updated Date - Jan 02 , 2026 | 04:19 PM