'హర్ ఘర్ తిరంగా' అభియాన్‌లో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి: బండి సంజయ్
ABN , Publish Date - Aug 10 , 2026 | 11:46 AM
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచించారు.
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) సూచించారు. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'హర్ ఘర్ తిరంగా' అభియాన్ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా బీజేపీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని బండి సంజయ్ హైదరాబాద్‌లోని తన నివాసం వద్ద జాతీయ జెండాను ఈరోజు (సోమవారం) ఎగురవేశారు. అనంతరం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాకు బండి సంజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

'తిరంగా యాత్ర'లను విజయవంతంగా నిర్వహించాలి..
దేశవ్యాప్తంగా 'హర్ ఘర్ తిరంగా' అభియాన్ కార్యక్రమాలను చేపడుతున్నట్లు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈరోజు నుంచి ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో 'తిరంగా యాత్ర'లను విజయవంతంగా నిర్వహించాలని బీజేపీ శ్రేణులను బండి సంజయ్ కోరారు. కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రతి భారతీయుడు, విద్యార్థులు పెద్దఎత్తున భాగస్వామ్యమై స్వచ్ఛందంగా తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశంపై తమకున్న భక్తిభావాన్ని చాటుకోవడానికి ఇది సువర్ణావకాశమని పేర్కొన్నారు.
స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలను శుద్ధి చేయాలి..
స్వాతంత్య్ర దినోత్సవానికి ముందుగా, ఆగస్టు 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మహాపురుషులు, స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలను శుద్ధి చేసి, స్మారక చిహ్నాల చుట్టూ ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ శ్రేణులను బండి సంజయ్ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి కూడలిలో తిరంగా ర్యాలీలు, దేశభక్తి ప్రదర్శనలు, ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రతి పౌరుడిని మానసికంగా దేశంతో అనుసంధానించే ఒక గొప్ప సామాజిక ఉద్యమంగా ఈ కార్యక్రమం రూపాంతరం చెందిందని తెలిపారు. ప్రతి ఏడాది ఇది ఘనంగా జరుగుతోందని గుర్తుచేశారు. ‘మన జాతీయ త్రివర్ణ పతాకం దేశ ప్రజలందరి ఐక్యతకు, సమైక్యతకు, అఖండతకు ప్రతీక అని వెల్లడించారు. ప్రతి ఇంటా దేశభక్తి వాతావరణం పరిమళించేలా ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా చూసి 'హర్ ఘర్ తిరంగా' అభియాన్‌ను విజయవంతం చేయాలని బండి సంజయ్ కోరారు.
వార్తలు కూడా చదవండి...
కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలి: మంత్రి సీతక్క
తెలంగాణలో నక్సలిజం పూర్తిగా అంతమైంది: డీజీపీ సీవీ ఆనంద్
సీనియర్ సిటిజన్లే టార్గెట్‌గా సైబర్ కేటుగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు: సీపీ సజ్జనార్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News