Share News

రాతి కొండలపై రాచనగరం

ABN , Publish Date - May 17 , 2026 | 09:36 AM

నిర్మల్‌... ఒక భౌగోళిక ప్రదేశం కాదు... కాలగర్భంలో చెక్కబడిన ఒక జ్ఞాపకగాథ. సహ్యాద్రి శ్రేణుల నిశ్శబ్ద వీణలో, గోదావరి పరవళ్లలో, దక్కన్‌ పీఠభూమి రాతిగుట్టల ఎత్తుపల్లాల ఊపిరిలో... ఈ నేల శతాబ్దాల సంచారాన్ని మోస్తోంది.

రాతి కొండలపై రాచనగరం
Nirmal history, Telangana

నిర్మల్‌... ఒక భౌగోళిక ప్రదేశం కాదు... కాలగర్భంలో చెక్కబడిన ఒక జ్ఞాపకగాథ. సహ్యాద్రి శ్రేణుల నిశ్శబ్ద వీణలో, గోదావరి పరవళ్లలో, దక్కన్‌ పీఠభూమి రాతిగుట్టల ఎత్తుపల్లాల ఊపిరిలో... ఈ నేల శతాబ్దాల సంచారాన్ని మోస్తోంది. రాతి కోటలు ఇక్కడ కేవలం గోడలు కావు... వీరత్వం చెక్కిన శిలాగాథలు. బురుజులు పహారాదారుల్లా నిలిచి యుగాల్ని కాపాడుతున్న నిశ్శబ్ద సాక్షులు. గుమ్మటాలు గాలిలో తేలే కాలగీతాల మోగింపు. నిర్మల్‌ అంటే... జీవించిన నాగరికత, పలికిన సంస్కృతి, స్పందించిన చరిత్ర.

దక్కన్‌ పీఠభూమిలో సముద్రమట్టానికి సుమారు 350మీటర్ల ఎత్తులో ఉండే నిర్మల్‌ రాతిగుట్టలు ఎత్తు పల్లాలతో కూడుకుని ఉంటాయి. నిర్మల్‌ పట్టణ కేంద్రానికి గోదావరి నది కేవలం 16కి.మీ దూరంలో ఉండటం వల్ల నది ప్రవహించినంత మేర గొప్ప నాగరికత, సంస్కృతి విలసిల్లింది. ఆదిమానవులు నివసించిన గుహలు నిర్మల్‌ గుట్టలోని గండిరామన్న, గోదావరికి దక్షిణాన బాల్కొండ, ఆర్మూర్‌లలో గుహలు వెలుగులోకి వచ్చాయి. గోదావరి ప్రాంతంలో సుమారు 6వేల నుంచి 8 వేల ఏళ్లనాటి సూక్ష్మ రాతి ఆయుధాలు ఈ మధ్యనే వెలుగులోకి వచ్చాయి. గోదావరి నదిపై శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో (1967) ముంపునకు గురైన గ్రామాల్లో తవ్వకాలు జరిగినప్పుడు దాల్మిన్‌ సిస్త్‌ సమాధులు వెలుగులోకి వచ్చాయి. శిలాయుగపు గండ శిలలు (గుండురాళ్లు)అనేక గ్రామాల్లో వెలుగు చూశాయి. ఇనుప ఈటెలు, బాణం, మొనలు, కత్తులు, గుర్రపు కళ్లెం కనిపించాయి. ఈ ప్రాంతంలో ఆదిమానవులు సంచరించడమే గాక ఇనుప యుగపు అవశేషాలు దొరకడంతో వేల ఏళ్ల నుంచి నాగరికత వికాసం చెందినట్లు తెలుస్తోంది.


రాజవంశాల ఏలుబడిలో...

షోడశ జనపదాల్లో అస్మక జనపదానికి చెందిన నిర్మల్‌... శాతవాహనుల ఏలుబడిలో ఉన్నట్లు లభించిన మట్టిపాత్రలు, కుండ పెంకులు, మట్టికోటలు, ఇటుకలు, బౌద్ధస్తూపాల వల్ల తెలుస్తోంది. నిర్మల్‌ జిల్లాలోనే బావరీ నివసించిన బాధన్‌కుర్తి గ్రామం ఉంది. బౌద్ధం దక్షిణపథాన ఇక్కడినుంచే మొదలైంది. మహిషకులు, రాష్ట్ర కూటులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, పద్మనాయక వంశస్తులు, కుతుబ్‌షాహీలు, నిజాం వంశస్తులు... అదేవిధంగా స్థానిక ఖిల్లాదారుల ఏలుబడిలో నిర్మల్‌ వైభవంగా వెలిగింది. పట్టణ కేంద్రంలో అనేక మతాలకు చెందిన విగ్రహాలున్నాయి. బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన విగ్రహాలు, ఇటుకలు నిర్మల్‌ పరిసర గ్రామాల్లో ఇప్పటికీ వెలుగుచూస్తున్నాయి.


book4.3.jpgకళ్యాణి చాళుక్యుల కాలంలో ‘నకరములు’ అనే వాణిజ్య కేంద్రం ఇక్కడ ఉండేది. దానికి సాక్ష్యంగా నకరేశ్వర వాడ కాలక్రమంలో ‘నగరేశ్వర వాడ’గా మారింది. కళ్యాణి చాళుక్యుల కాలంలో నిర్మించిన శివాలయం ఇప్పటికీ ఈ వాడలో ఉంది. కాకతీయుల కాలంలో నిర్మించిన ఓంకారేశ్వరాలయం ఖజానా చెరువు వద్ద ఉంది. పద్మనాయక వంశానికి చెందిన శ్రీనివాసరావు నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయం, పద్మాక్షి ఆలయం దేవరకోట ప్రాంతంలో ఉన్నాయి. అదేవిధంగా నిర్మల్‌ గుట్టల పైన అనేకచోట్ల ఉమామహేశ్వర విగ్రహాలు, వీరగల్లుల విగ్రహాలు కనిపిస్తాయి. గోదావరి పరిక్రమణలో భాగంగా రాముడు గండి రామన్న క్షేత్రంలో కొంతకాలం నివసించినట్లు పురాణ కథనం. రామునికి ఇక్కడి సహ్యాద్రి పర్వతాలే ఆశ్రయమిచ్చాయని స్థానికుల కథనం.


ఏడు ప్రధాన ద్వారాలు...

నిర్మల్‌ అనేక రాతిగుట్టలతో కూడుకున్న పట్టణం. ఆయా రాజ వంశాలకు చెందిన రాజులు గుట్టలనే తమ పరిపాలన కేంద్రాలుగా నివాసాలుగా మలుచుకున్నారు. పట్టణంలోకి ఇతర గ్రామాల నుంచి రావటానికి ఏడు ప్రధానమైన ద్వారాలను బలమైన రాళ్లతో నిర్మించారు. ఉత్తర- దక్షిణ వైపునకు వెళ్ళడానికి గొలుసుల దర్వాజ అతి పెద్దది. పట్టణం మధ్యలో పాలపిట్ట దర్వజా అంతర్గతంగా రాకపోకలు చేయడానికి వాడేవారు. సుమారు పది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ రాచనగరాన్ని అద్భుతమైన నిర్మాణ కౌశలంతో నిర్మించారు. పట్టణ నడిబొడ్డున ఖిల్లా గుట్ట సుమారుగా 20 ఎకరాల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఖిల్లాగుట్ట పైన రాణివాసం ఉండే గదులు, రాజు పరిపాలన నిర్వహించే సభా మండపము, లలిత కళలు ప్రదర్శించే నాట్యమందిరం, అక్కాచెల్లెళ్ల బావులు, ఒక ఆలయం, ఆయుధాలు దాచుకునే గదులు, రాజు రాణి సాయంత్రం వేళ కూర్చునే సింహాసనాలు, సైనికుల కోసం అతిపెద్ద రాతి నీటి తొట్టె, కోట లోపల రహస్య మార్గాలున్నాయి.


book4.4.jpgపట్టణానికి దక్షిణాన ఉన్న ‘శ్యామ్‌ఘడ్‌’ బలిష్టమైన రాతితో నిర్మించిన కోట. ఇందులో పశ్చిమానికి పెద్ద ద్వారం, ఉత్తరాన ఒక రహస్య ద్వారం ఉంటుంది. దక్షిణం వైపు నుంచి శత్రువులు నగరంపై దండయాత్రకు వచ్చినప్పుడు... ముందుగా ‘సోన్‌ఘడ్‌’ మీద ఉన్నటువంటి సైనికులకు సమాచారం అందుతుంది. తర్వాత ‘శ్యామ్‌ఘడ్‌’ సైనికులకు చేరుతుంది. ఇప్పటికీ కోట లోపల ఫిరంగులున్నాయి. ‘బత్తిస్‌ఘడ్‌’ నిర్మల్‌ పట్టణానికి తూర్పు వైపున ఉన్న బలమైన కోట. ఈ కోటలో 32 గదులు ఉండటంవల్ల దీనిని ‘బత్తిస్‌ఘడ్‌’ గా పేర్కొంటారు. సుమారు రెండు వేల మంది సైనికులు ఈ ఘడ్‌లో ఉండేవారట.


ఈ కోటలో ఒక రహస్య బావిని తవ్వించారు. ఈ మెట్ల బావిని చేరుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అడుగు భాగంలో రహస్య ద్వారం ఉంటుంది. అక్కడి నుంచి మిగతా కోటలకు చేరవచ్చునని అంటారు. దీని పక్కనే ‘వెంకటేశ్వరఘడ్‌’ అనే మరొక కోట కనిపిస్తుంది. రాజోద్యోగులు ఇక్కడ ఉండేవారట.

కాలక్రమంలో ఈ చారిత్రక కోటలన్నీ అన్యాక్రాంతమవుతున్నాయి. ఆక్రమణలకు గుర వుతున్నాయి. పర్యాటక శాఖ, పురావస్తు శాఖ ఈ రాజనగరాన్ని టూరిస్టు కేంద్రంగా తీర్చి దిద్దాలి. అలనాటి ఆనవాళ్లను ేసకరించి, స్థాని కంగా ఒక ప్రదర్శనశాల ఏర్పాటు చేస్తే, కొన్ని వేల ఏళ్ల చరిత్రకు జీవం పోసినట్టు అవుతుంది.

  • డా.తుమ్మల దేవరావ్‌, చరిత్ర పరిశోధకుడు 89857 42274


ఈ వార్తలు కూడా చదవండి:

నేడు ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల

శ్రీవారి ‘మెడికల్‌ దర్శనం’ కోటాను విస్తరించండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 17 , 2026 | 09:59 AM