‘డిజిటల్’... కళ్లు జిగేల్!
ABN , Publish Date - May 17 , 2026 | 08:56 AM
ఆభరణాలు కేవలం ఆకట్టుకునేలా ఉంటే సరిపోదు... వాటిలో టెక్నాలజీ మిళితమై ఉండాలి. ఈతరం కోరుకుంటున్న ‘డిజిటల్’ జువెలరీ ఇది.
ఆభరణాలు కేవలం ఆకట్టుకునేలా ఉంటే సరిపోదు... వాటిలో టెక్నాలజీ మిళితమై ఉండాలి. ఈతరం కోరుకుంటున్న ‘డిజిటల్’ జువెలరీ ఇది. వారి ఆశలకు తగ్గట్టుగానే మార్కెట్లో ‘స్మార్ట్’ ఆభరణాలు సందడి చేస్తున్నాయి. నెక్లెస్‌లు, ఉంగరాలు, బ్రేస్‌లెట్‌లు, లాకెట్‌లు... ఇలా ప్రతీ ఆభరణం ‘స్మార్ట్’గానే కనిపిస్తోంది. వాటి సొగసుల ఊసులే ఇవి...
కొంతకాలం క్రితం వరకు ‘స్మార్ట్ వేరబుల్స్’ అంటే ‘ఫిట్‌నెస్ ట్రాకర్’ ఒక్కటే గుర్తుకు వచ్చేది. అడుగులను లెక్కించడం, నిద్రను మానిటర్ చేయడం, హార్ట్‌రేట్‌ను ట్రాక్ చేయడం... ఇలాంటి పనులన్నీ ఫిట్‌నెస్ ట్రాకర్‌తో జరిగేవి. కానీ ఇప్పుడు ఆభరణాలు సైతం కూసింత ‘స్మార్ట్’గా మారుతున్నాయి. అది వేలుకు పెట్టుకునే రింగు కావొచ్చు. మెడలో ధరించే నెక్లెస్ కావొచ్చు. కళ్లద్దాలు, లాకెట్లు, బ్రేస్‌లెట్... ఇవన్నీ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ‘స్మార్ట్ జువెలరీ’గా అందర్నీ ఆకట్టుకునేందుకు వచ్చేశాయి. ఇవి హెల్త్ స్టేటస్‌ను రికార్డు చేయడం మాత్రమే కాదు... సంభాషణల్ని రికార్డు చేస్తాయి. ఏఐ సమ్మరీలను జనరేట్ చేస్తాయి. డ్రాఫ్ట్ చేసి పెడతాయి. ఇంకాస్త అర్థమయ్యేలా చెప్పాలంటే... మీ ఉంగరం డేటాను ట్రాక్ చేస్తుంది. కళ్లద్దాలు మీకు కొత్త లోకాన్ని చూపిస్తాయి. మీ లాకెట్ అన్నీ గుర్తుపెట్టుకుంటుంది. మీరు ధరించిన కళ్లద్దాలలోనే వాట్సాప్ మెసేజ్‌లు చూడొచ్చు. లైవ్ రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇలా... అన్నింటిలో ఈ నవతరం ఆభరణాలు సహాయంగా ఉంటాయి.
ఫ్యాషన్, ఫంక్షనింగ్...
ఈ రోజుల్లో నగలు ఆకట్టుకునేలా ఉంటే సరిపోదు. ఫ్యాషన్‌తో పాటు ఫంక్షనింగ్ కూడా ముఖ్యమని ఈతరం భావిస్తోంది. గ్యాడ్జెట్స్‌తోనే కాకుండా, స్మార్ట్ జువెలరీతో నిత్యం కనెక్ట్ అయి ఉండాలని ఆశిస్తున్నారు. స్మార్ట్ రింగ్స్, బ్రేస్‌లెట్లు, నెక్లెస్‌లు, ఇయర్ రింగ్స్... ఇలా జువెలరీ ఏదైనా ఆకర్షణీయంగా కనిపించడంతో పాటు టెక్నాలజీ మిళితం అయి ఉండాలని కోరుకుంటున్నారు. కొంతకాలం క్రితం వరకు ఫ్యాషన్, టెక్నాలజీలను వేర్వేరు రంగాలుగా చూసేవారు. కానీ ఇప్పుడు ఆ రెండు రంగాలు కలిసిపోతున్నాయి. ఆకర్షణీయంగా ఉన్నది ధరించాలా? లేక ఉపయోగపడేది ధరించాలా? అని ఆలోచిస్తూ కూర్చోవాల్సిన పనిలేదు. ‘స్మార్ట్ జువెలరీ’ ఈ రెండింటినీ మిక్స్ చేస్తోంది. ఆకర్షణీయంగా కనిపించడంతో పాటు టెక్‌ప్రియులకు బాగా పనికొచ్చే స్మార్ట్ జువెలరీ అంతటా లభిస్తోంది. చాలా ఆభరణాలలో అడుగులను లెక్కించడం, నిద్రను విశ్లేషించడం, హార్ట్ రేటును చెక్ చేయడం వంటి ఫీచర్లు ఉంటున్నాయి. కొన్ని డిజైన్లు ఇన్‌కమింగ్ కాల్ అలర్ట్, టెక్ట్స్, యాప్ అలర్ట్స్ వంటి ఫీచర్లు కలిగి ఉంటున్నాయి. వీటివల్ల ప్రతీసారి ఫోన్ చూడాల్సిన అవసరం లేకుండా పోతుంది. మరికొన్ని స్మార్ట్ జువెలరీలు జీపీఎస్ ఫీచర్‌ను కలిగి ఉంటున్నాయి.
కోట్లలో అమ్మకాలు
ఫ్యాషన్‌తో టెక్నాలజీ జత కట్టడం వల్ల అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2025లో ‘స్మార్ట్ వేరబుల్స్’ అమ్మకాలు అత్యంత జోరుగా జరిగినట్టు అంచనా. వేగంగా విస్తరిస్తున్న యాక్సెసరీ సెగ్మెంట్ ఇదేనని నిపుణులు అంటున్నారు. శాంసంగ్, ఆరా వంటి బ్రాండ్లు ‘స్మార్ట్ వేరబుల్స్’ను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు పోటీపడుతున్నాయి. ఆరా గత మూడేళ్లుగా తన వ్యాపారాన్ని రెట్టింపు చేస్తూ 55 లక్షలకు పైగా ‘స్మార్ట్ రింగు’లను అమ్మింది. 2025లో 3963 కోట్లుగా ఉన్న స్మార్ట్ రింగ్ మార్కెట్ 2033కల్లా 16వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.
స్మార్ట్ రింగ్స్...
ఆరా రింగ్ 4
ఈమధ్య కాలంలో సెలబ్రిటీలు ఎక్కువగా ధరిస్తున్న స్మార్ట్ రింగ్ ఇది. ఇతర స్మార్ట్ రింగ్‌లతో పోలిస్తే ఇది హెల్త్ ట్రాకింగ్‌లో అగ్రస్థానంలో ఉంది. స్మార్ట్ రింగ్ లోపలి వైపు ఉండే సెన్సర్లు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని లెక్కిస్తాయి.
గార్నెట్ రింగ్
ఈ రింగ్‌లో మైక్రోప్రాసెసర్ ఉంటుంది. ఫోన్‌కి సందేశం వచ్చినప్పుడు వైబ్రేట్ కావడం ద్వారా మీకు తెలియజేస్తుంది.
జావా రింగ్
డివైజ్ ఏదైనా పాస్‌వర్డ్‌తో రక్షణ కల్పించుకోవాల్సిందే. ఆ మాటకొస్తే ఏది యాక్సెస్ చేయాలన్నా పాస్‌వర్డ్ ఉండాల్సిందే. కంప్యూటర్ ఓపెన్ చేయాలనుకున్న ప్రతీసారి పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సిందే. పాస్‌వర్డ్ మరిచిపోతే అంతేసంగతులు. ఈ ఇబ్బందిని తొలగించేందుకు డల్లాస్ సెమికండక్టర్ జావా బేస్డ్ కంప్యూటరైజ్డ్ రింగ్‌ను అభివృద్ధి చేసింది. ఈ రింగ్ ఆటోమెటిక్‌గా ఓపెన్ చేసి కంప్యూటర్‌లోకి లాగిన్ అయ్యేలా చేస్తుంది. స్టీలుతో తయారయ్యే జావా రింగులో 1 మిలియన్ ట్రాన్సిస్టర్ ప్రాసెసర్ ఉంటుంది. దీన్ని ‘ఐ బటన్’ అని పిలుస్తారు. రియల్ టైమ్ క్లాక్, 134 కేబీ ర్యామ్, 32 కేబీ రామ్ ఉంటాయి. సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉండే జావా వర్చువల్ మెషీన్ జావా లాంగ్వేజ్‌ను గుర్తించి యూజర్ కంప్యూటర్ కోసం అనువదిస్తుంది.
కంఠాభరణాల కళ...
‘స్మార్ట్ నెక్లెస్’లు అద్భుతమైన ఫ్యాషన్ ఆభరణాలుగానూ, ఆధునిక సాంకేతికత కలిగిన జువెలరీగానూ ఆకట్టుకుంటున్నాయి. వీటిలో వ్యక్తిగత భద్రత, హెల్త్‌ట్రాకింగ్, డిజిటల్ కనెక్టివిటీ వంటి సదుపాయాలు ఉంటున్నాయి. పైగా సాధారణ గ్యాడ్జెట్లలా కనిపించవు. బంగారం, వెండితో తయారుచేసినవి కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్నింటిలో ఎస్‌ఓఎస్ బటన్ వంటి ఫీచర్లు ఉంటున్నాయి.
ఇన్విసావేర్ స్మార్ట్ జువెలరీ : సేఫ్టీ విషయంలో ఇది సూపర్ స్మార్ట్ జువెలరీ అని చెప్పొచ్చు. ఈ నెక్లెస్ ప్రత్యేకత ఏమిటంటే ‘హిడెన్ ప్యానిక్ బటన్’ ఉంటుంది. అత్యవసర సమయంలో ఈ బటన్‌పై రెండుసార్లు క్లిక్ చేస్తే ఎంచుకున్న కాంటాక్ట్స్‌కి అలర్ట్ సందేశం వెళుతుంది.
మొమెంటో స్మార్ట్ నెక్లెస్: టెక్నాలజీ విషయంలో అద్భుతమైన జువెలరీ ఇది. ఈ డిజిటల్ లాకెట్‌లో ఎన్‌ఎఫ్‌సీ చిప్ అమర్చబడి ఉంటుంది. ఈ సాంకేతికతతో లాకెట్ స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ అవుతుంది. లాకెట్‌లో ఫొటోలు, వీడియోలు, మెసేజ్‌లు స్టోర్ చేసుకోవచ్చు. ఇన్‌స్టంట్‌గా యాక్సెస్ చేసుకోవచ్చు.
టొట్‌వూ కనెక్ట్ నెక్లెస్: జంటల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆభరణం ఇది. ఉద్యోగరీత్యా దూరప్రాంతాల్లో నివసిస్తున్న జంటలు తమ బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. నెక్లెస్‌ను టచ్ చేయగానే వైబ్రేట్ అవుతుంది. వెంటనే ‘లవ్ సిగ్నల్స్’ వెళతాయి. ఇప్పుడు నీ గురించే ఆలోచిస్తున్నాను అని సంకేతం పంపడానికి ఉపకరిస్తుంది. టొట్‌వూ యాప్ సహాయంతో పనిచేస్తుంది.
టెంపరేచర్ మానిటర్ నెక్లెస్: ఈ స్మార్ట్ ఆభరణం శరీర ఉష్ణోగ్రతను నిరంతరం మానిటర్ చేస్తుంది. రంగులు మారే డిస్‌ప్లే స్టయిలిష్‌గా కనిపించేలా చేస్తుంది. స్మార్ట్ సెన్సింగ్ యాక్సెసరీగా చెప్పుకోవచ్చు.
స్మార్ట్ అద్దాలు
‘మిషన్ ఇంపాజిబుల్’లో టామ్ క్రూయిజ్ స్మార్ట్ అద్దాలు వాడటం చూసే ఉంటారు. ఇప్పుడు అలాంటి అద్దాలు టెక్ ప్రియులకు అందుబాటులోకి వచ్చాయి. కెమెరాలు, సెన్సర్లు, వాయిస్ కంట్రోల్, నావిగేషన్... ఇలా బోలెడు ఫీచర్లతో పాటు ఏఐ ఆధారిత అద్దాలు కూడా ఉన్నాయి. ఈ కళ్లజోడు సహాయంతో వీడియో రికార్డింగ్, లైవ్ స్ట్రీమింగ్ చేయొచ్చు. వాయిస్ కమాండ్స్‌తో పనిచేస్తుంది. వస్తువులను చూసి వాటి గురించి సమాచారం కావాలి అని అడిగితే చాలు... ఐవేర్ డిస్‌ప్లేలోనే సమాచారం చూడొచ్చు.
ఏఐ పెండెంట్
ముఖ్యమైన సంభాషణ రికార్డు కోసం ఫోన్ వాడాల్సిన అవసరం లేదు. ‘ఏఐ పెండెంట్’ చాలు. ఈ స్మార్ట్ ఆభరణం సంభాషణల్ని రికార్డు చేస్తుంది. ముఖ్యమైన నోట్స్‌ను రికార్డు చేసుకోవచ్చు. కనెక్టివిటీ కోసం వైఫై, బ్లూటూత్ వంటి ఫీచర్లున్నాయి. యూఎస్‌బీ ఛార్జింగ్ సదుపాయం ఉంది. బ్యాటరీలైఫ్ 100 గంటలు ఉంటుంది. రికార్డింగ్ సమయంలో లెడ్ లైట్ వెలుగుతుంది. ఈ వేరబుల్ డివైజ్‌లో రికార్డింగ్ కోసం మైక్రోఫోన్స్ అమర్చబడి ఉంటాయి. యాప్‌తో డేటా సింక్రనైజ్ అవుతుంది.
రిస్ట్ బ్యాండ్
ఇటీవల క్రికెటర్ కోహ్లీ చేతికి ఒక బ్యాండ్ ధరించి మైదానంలోకి దిగడం చూసి అభిమానులు అదేమిటా? అని నెట్‌లో తెగ వెతికారు. అది ‘వూఫ్’ రిస్ట్ బ్యాండ్. ఈ బ్యాండ్ సాధారణమైనది కాదు. వ్యక్తిగత కోచ్‌గా పనిచేస్తుంది. హెల్తీ అలవాట్లు బిల్డ్ అయ్యేలా చేస్తుంది. అలవాట్లు మార్చుకునేందుకు సాయపడుతుంది. దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇంకా చెప్పాలంటే రోజూ గైడ్ చేస్తుంది. నిద్ర, ఒత్తిడి... ఇలా ప్రతీదీ ట్రాక్ చేస్తుంది.
బ్రేస్‌లెట్
టెక్నాలజీతో పాటు మంచి లుక్‌ని అందించే బ్రేస్‌లెట్‌లు ఇప్పుడు మార్కెట్‌లో ఉన్నాయి. వీడియోగ్రాఫిక్ అర్రే(వీజీఏ) డిస్‌ప్లేతో వచ్చే బ్రేస్‌లెట్‌లు స్మార్ట్ వేరబుల్స్‌లో ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఫోన్‌తో సింక్రనైజ్ అయి ఫోన్ చేస్తున్న వారి పేరు, నంబరు బ్రేస్‌లెట్ డిస్‌ప్లేపై కనిపిస్తుంది. బ్రేస్‌లెట్‌లో బిల్టిన్‌గా రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. ఫోన్ కాల్ వచ్చినప్పుడు వైబ్రేట్ కావడంతో పాటు లైట్ ఫ్లాష్ అవుతుంది.
ఈ ట్రెండ్‌ను గమనిస్తుంటే రాను రాను రెగ్యులర్ ఆభరణాల స్థానంలో ‘డిజిటల్’ ఆభరణాల మెరుపులే జిగేల్‌మనిపించేలా ఉన్నాయి.
కొనేముందు చూడాల్సినవి...
స్మార్ట్ రింగ్ ఎంచుకునే ముందు కంఫర్ట్, ఫిట్, సాఫ్ట్‌వేర్, సబ్‌స్ర్కిప్షన్ ధర, బ్యాటరీ లైఫ్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఒక స్మార్ట్ రింగ్ కొనుగోలు చేస్తున్నప్పుడు మొదట కంఫర్ట్‌గా ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ రింగ్ వేలికి కంఫర్టబుల్‌గా లేకపోతే ఎక్కువ రోజులు ధరించలేరు. కాబట్టి సరైన సైజు ఉన్న రింగ్‌ను మాత్రమే తీసుకోవాలి. మరో ముఖ్యమైన ఫీచర్ సాఫ్ట్‌వేర్. కొన్ని మోడల్స్‌లో ఫీచర్‌ను, డేటాను ఉపయోగించుకోవాలంటే సబ్‌స్ర్కిప్షన్ అవసరమవుతుంది. ‘ఆరా రింగ్ 4’ మోడల్ రింగ్‌ను వాడుతున్న వారు హెల్త్ డేటాను యాక్సెస్ చేసుకోవాలంటే నెలవారీ సబ్‌స్ర్కిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సామ్‌సంగ్ గెలాక్సీ రింగ్ ఉపయోగిస్తున్నట్టయితే ఎలాంటి సబ్‌స్ర్కిప్షన్లు అవసరం లేదు. ఆ తరువాత బ్యాటరీ లైఫ్ ఎంత ఉంటుందనే విషయం చెక్ చేసుకోవాలి. సాధారణంగా ఒకసారి ఛార్జ్ చేస్తే వారం,పది రోజుల పాటు బ్యాటరీ లైఫ్ ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీవారి ‘మెడికల్ దర్శనం’ కోటాను విస్తరించండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News