Share News

జపాన్‌‌లో భారతీయ రెస్టారెంట్ మూసివేత.. యజమాని కన్నీరుమున్నీరు

ABN , Publish Date - May 17 , 2026 | 08:13 AM

జపాన్ వీసా రాక రెస్టారెంట్‌ను మూసివేయాల్సి రావడంతో ఒక భారతీయ వ్యక్తి కన్నీరుపెట్టుకున్నారు. దేశాన్ని వీడాల్సిన పరిస్థితి వచ్చిపడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

జపాన్‌‌లో భారతీయ రెస్టారెంట్ మూసివేత.. యజమాని కన్నీరుమున్నీరు
Indian Restaurant in Japan Forced to Shut down

ఇంటర్నెట్ డెస్క్: జపాన్ వీసా రాక రెస్టారెంట్ మూసివేయాల్సి రావడంతో ఒక భారతీయ వ్యక్తి దిక్కుతోచని స్థతిలో కూరుకుపోయారు. దాదాపు రెండు దశాబ్దాలుగా తాము ఉంటున్న దేశాన్ని వీడాల్సి వస్తోందని కన్నీరుమున్నీరయ్యారు. మనీశ్ కుమార్ అనే వ్యక్తి సైతామా ప్రిఫెక్చర్‌లో ఒక రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. అయితే, జపాన్ వలస సేవల శాఖ వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో ఆయనకు బిజినెస్ మేనేజర్ వీసా దక్కలేదు. పరిస్థితి అకస్మాత్తుగా అగమ్యగోచరంగా మారిపోయింది. తన పిల్లలు జపాన్‌లోనే పుట్టారని, ఇప్పుడు దేశాన్ని వీడాల్సిన స్థితి వచ్చిందని కన్నీరు పెట్టుకున్నారు.

‘రెండు వారాల క్రితం ఐఎస్ఏ నన్ను తిరిగి వెళ్లిపొమ్మని చెప్పింది. నా బిడ్డలు జపాన్‌లోనే పుట్టిపెరిగారు. వారికి జపాన్ భాష మాత్రమే తెలుసు. వారి ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మమ్మల్ని తిరిగి వెళ్లిపొమ్మంటున్నారు. నాకు ఏం చేయాలో బోధపడట్లేదు’ అని మనీశ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.


గతేడాది జపాన్‌లో నిబంధనలను మార్చాక బిజినెస్ మేనేజర్ వీసా దరఖాస్తులు తగ్గిపోయాయి. ఒకప్పుడు నెలకు 1,700 దరఖాస్తులు దాఖలవగా ప్రస్తుతం ఈ సంఖ్య 70కి పడిపోయింది. వీసా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు నిబంధనలను మరింత కఠినతరం చేశామని ప్రభుత్వం చెబుతోంది.

నూతన బిజినెస్ మేనేజర్ వీసా నిబంధనల్లో భాగంగా కనీస పెట్టుబడి మొత్తాన్ని ప్రభుత్వం రూ.30 లక్షల నుంచి రూ.2 కోట్లకు పెంచింది. అంతేకాకుండా, కనీసం ఒక స్థానిక వ్యక్తిని ఫుల్ టైమ్ వర్కర్‌గా నియమించుకోవాలి. గతంలో ఈ రూల్ ఉండేది కాదు. ఈ వీసాకు దరఖాస్తు చేసుకునే వారికి జపనీస్ భాషలో కనీసం ఎన్2 లెవెల్ ప్రావీణ్యం ఉండాలంటూ ప్రభుత్వం కొత్త నిబంధన విధించింది. మేనేజర్‌ల అనుభవం, అర్హతలకు సంబంధించి‌న రూల్స్‌నూ కఠినతరం చేసింది. కొత్త రూల్స్‌తో చిన్న వ్యాపార సంస్థల వారికి వీసా దక్కక దేశాన్ని వీడాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్నేళ్లుగా వ్యాపారం చేస్తున్న వారిపై నిబంధనల ప్రభావం తీవ్రంగా ఉంటోంది.


ఈ వార్తలనూ చదవండి:

యూఎస్ఏ‌లో గ్రేట్ ఇండియన్ ఫుడ్, షాపింగ్ ఫెస్ట్ అండ్ మ్యాంగో ఫెస్టివల్

తెలుగుదేశం మహానాడు.. దద్దరిల్లిన దమ్మాం

Updated Date - May 17 , 2026 | 08:42 AM