తెలుగుదేశం మహానాడు.. దద్దరిల్లిన దమ్మాం
ABN , Publish Date - May 15 , 2026 | 08:17 PM
శుక్రవారం సౌదీ అరేబియాలోని దమ్మాంలో ఎన్నారై తెలుగుదేశం పార్టీ సౌదీ శాఖ అట్టహాసంగా నిర్వహించిన మహానాడుకు దేశంలోని సుదూర ఎడారి ప్రాంతాల నుంచి పార్టీ అభిమానులు ఉత్సాహంతో కదం తొక్కుతూ చేరుకున్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదిలి రా.. అంటూ ఎడారినాట సౌదీ అరేబియాలో తెలుగుదేశం గల్ఫ్ కౌన్సిల్ ఇచ్చిన పిలుపునకు తెలుగు ప్రవాసీ లోకం కదిలి వచ్చింది. శుక్రవారం సౌదీ అరేబియాలోని దమ్మాంలో ఎన్నారై తెలుగుదేశం పార్టీ సౌదీ శాఖ అట్టహాసంగా నిర్వహించిన మహానాడుకు దేశంలోని సుదూర ఎడారి ప్రాంతాల నుంచి పార్టీ అభిమానులు ఉత్సాహంతో కదం తొక్కుతూ చేరుకున్నారు. 1700 కిలోమీటర్ల దూర ప్రాంతాల నుంచి కూడా పార్టీ అభిమానులు వచ్చారు.
గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రావి రాధాకృష్ణా నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం పార్టీ కార్యక్రమం కంటే ఎక్కువగా తెలుగు కుటుంబాల ఆత్మీయ కలయికగా జరిగింది. విజయవాడ నుంచి ప్రత్యేకంగా వచ్చిన పెనమలూరు శాసనసభ సభ్యుడు బోడె ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకుడు మహాసేన రాజేశ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాహ్య అభిప్రాయానికి విభిన్నంగా సౌదీ అరేబియా ఉందని బోడె ప్రసాద్ అన్నారు. ప్రవాసీయులు చేసిన డిమాండ్లన్నీ సమంజసమని ఆయన అన్నారు.

టీటీడీలో దర్శనానికి భారీ డిమాండ్ ఉంటుందని, వారంలో ఒక రోజు తాను ప్రవాసీయులకు దర్శనానికి కేటాయిస్తున్నానని బోడె ప్రసాద్ అన్నారు. విభిన్న దేశాల ప్రవాసీయుల మధ్య తెలుగు వారి విలక్షణత ప్రశంసనీయమని మహాసేన రాజేష్ అన్నారు. ముఖ్యమంత్రి యన్. చంద్రబాబు నాయుడు, యువనాయకుడు లోకేష్ తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారికి వీలైనంతగా సహాయం చేస్తారని, ఈ గుణం వారిని విదేశాల్లోనూ ఆదరణీయులుగా చేసిందని అన్నారు.
గాయకులు రఘు కుంచె, మాళవిక తమ మధుర గేయాలతో మైమరపించారు. తెలుగుదేశం పార్టీకీ బలమైన కంచుకోటగా భావించే రియాధ్ నగరం నుంచి ప్రత్యేక బస్సుల్లో మహిళలు, చిన్నారులు సైతం 500 కిలోమీటర్ల దూరంలోని దమ్మాంలోని సభావేదిక వద్దకు చేరుకున్నారు. పార్టీ నాయకుడు వడ్లమూడి సారథినాయుడు ఆధ్వర్యంలో సుప్రభాతం పూజకు లేచినట్లుగా తెల్లవారుజామున 4 గంటలకు లేచి దమ్మాంకు బయలుదేరారు. పారిశ్రామిక నగరం జుబైల్ నుంచి పార్టీ అభిమానులు కూడా చురుగ్గా పాల్గొన్నారు.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా విడియో కాల్ ద్వారా మాట్లాడుతూ సౌదీ అరేబియాలోని తెలుగు దేశం బృందాన్ని ప్రశంసించారు. చిత్తూరు జిల్లా పలమనేరు శాసనసభ్యుడు యన్. అమర్నాథ్ రెడ్డి, పార్టీ నాయకుడు సుఖవాసిలు కూడా వీడియో కాల్ ద్వారా మాట్లాడారు.

జోర్డాన్ సరిహద్దులోని తబూక్ నుండి 1700 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చిన రోహన్ కుమార్, 1200 కిలోమీటర్ల దూరంలోని జెద్ధా నుండి వచ్చిన శివ రామకృష్ణలు తెలుగుదేశం మీద ఉన్న అభిమానానికి తార్కాణంగా నిలిచారు. పెద్ద సంఖ్యలో వచ్చిన పార్టీ కార్యకర్తలకు భోజనాలు వడ్డించడంలో భాగస్వామ్యం కావడం తన అదృష్టమని గాజువాకకు చెందిన నంబూరు హేమ అనే మహిళ వ్యాఖ్యానించారు. రియాధ్ తెలుగుదేశం బృందం సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకట్టుకున్నాయి. అయిదేళ్ల చిన్నారి సిధ్ధూ కుమారా ప్రదర్శించిన అఖండ ప్రదర్శన హృదయాలను గెలుచుకుంది.
గత రెండు రోజులుగా నిద్రాహారాలు లేకుండా కార్యక్రమ నిర్వహణలో నిమగ్నమైనప్పటికీ జానీ బాషా, రాజశేఖర్, ఖాలీద్ సైఫుల్లా, కోగంటి శ్రీనివాస రావు, భరద్వాజ్, చంద్రశేఖర్, భాను ప్రకాశ్, చెన్నుపాటి నరేష్, గడ్డం శిల్పా, మండవ అక్షితలు కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలను అప్యాయతంగా పలకరించి స్వాగతించారు.

అతిథ్య రెస్టారెంట్ వడ్డించిన సంప్రదాయక తెలుగు వంటకాల రుచులను సభికులు ఆస్వాదించారు. పార్టీ ప్రతినిధులు రంజిత్, సత్తిబాబు, ముజ్జమ్మీల్, సతీశ్ తదితరులు భోజనాలను వడ్డించారు. చదువు, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన తెలుగు విద్యార్థులను ఈ సందర్భంగా బోడె ప్రసాద్, రాజేష్ సత్కరించారు. విజయవాడ విమానాశ్రయానికి సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల నుంచి నేరుగా విమాన సౌకర్యం కల్పించాలని, ఇందుకు ప్రతి ఒక్క ప్రవాసాంధ్రుడు తమ బాధ్యతగా గల్ఫ్‌లోని ఎయిర్‌లైన్స్‌లను ఒప్పించాలని తెలుగుదేశం పార్టీ సౌదీ అరేబియా అధ్యక్షుడు ఖాలీద్ సైఫుల్లా చేసిన సూచనను మహానాడు తీర్మానంగా ఆమోదించింది.
అదే విధంగా, నవ్యాంధ్రప్రదేశ్‌లో గల్ఫ్ దేశాల వీసా, వైద్య పరిక్షా కేంద్రాలు లేకపోవడంతో ఉపాధి నిమిత్తం వచ్చే అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వీరి సౌకర్యార్థం విజయవాడ, తిరుపతి, విశాఖపట్టణం నగరాలలో గమ్కా సెంటర్లను నెలకొల్పాలని పార్టీ రియాధ్ ప్రముఖులు జానీ బాషా చేసిన సూచనను కూడా మహానాడు ఆమోదించింది. గల్ఫ్ దేశాలలో మరణించిన ప్రవాసీ కార్మికుల కుటుంబాల పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా వైద్యం, విద్య, వసతి కల్పించాలని మహిళ నాయకురాలు గడ్డం శిల్పా చేసిన విజ్ఞప్తిని కూడా మహానాడు తీర్మానించింది.




ఈ వార్తలనూ చదవండి:
ఆకట్టుకున్న GWTCS వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా అనంత్ శ్రీరామ్
మలేషియా తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ