Share News

టీ20 ప్రపంచకప్ ఫైనల్.. ఫస్ట్ టైమ్ ఆడనున్న ప్లేయర్స్ వీరే.!

ABN , Publish Date - Mar 06 , 2026 | 01:54 PM

ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లండ్‌పై గెలిచే కివీస్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది భారత్. ఈ క్రమంలో కొందరు ఆటగాళ్లు తొలిసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆడబోతున్నారు. ఆ క్రికెటర్లు ఎవరంటే.?

టీ20 ప్రపంచకప్ ఫైనల్.. ఫస్ట్ టైమ్ ఆడనున్న ప్లేయర్స్ వీరే.!
Team India first time finalists

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో కివీస్‌తో తలపడేందుకు టీమ్ఇండియా సిద్ధమవుతోంది. మార్చి 8న జరిగే ఈ తుదిపోరుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. ఫైనల్ పోరుకు ముందు.. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను 7 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. మరోవైపు.. తొలి సెమీఫైనల్లో మిచెల్ శాంట్నర్ సారథ్యంలో న్యూజిలాండ్ టీమ్ దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్ చేరింది. అయితే.. పలువురు భారత ఆటగాళ్లకు ఇదే తొలి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కానుంది. భారత స్క్వాడ్‌లో మొత్తం ఆరుగురు క్రికెటర్లు తొలిసారి ఈ పొట్టి ప్రపంచకప్ ఫైనల్లో పాల్గొంటున్నారు.


ప్రస్తుతం.. భారత జట్టులో ఉన్న ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తులు మొదటిసారి ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లోకి అడుగుపెట్టనున్నారు. వీరిలో రింకూ 2024 ఎడిషన్‌లో రిజర్వ్ స్క్వాడ్‌లో భాగంగా జట్టుతో ఉన్నాడు. అయితే.. కివీస్‌తో తలపడే భారత తుది జట్టులో నలుగురు ఆటగాళ్లకు మాత్రమే అవకాశం దక్కనుందని పలువురు క్రీడాకారులు విశ్లేషిస్తున్నారు. వీరిలో ఇషాన్, అభిషేక్, తిలక్ వర్మల స్థానాలకు దాదాపు ఎలాంటి ఢోకా లేదు. రింకూ సింగ్, వాషింగ్టన్‌ సుందర్‌లు ఇప్పటికే బెంచ్‌కు పరిమితమయ్యారు. వరుణ్ చక్రవర్తి స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు. అయితే.. ఫైనల్ మ్యాచ్ జరగడానికి ముందు పిచ్, వాతావరణాన్ని బట్టి ఎవరు తుది జట్టులో ఉంటారనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.


అయితే.. ఆ ఆరుగురిలో సూపర్ 8లో వెస్టిండీస్‌పై 97*, సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌పై 89 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంజూ శామ్సన్ ఓపెనర్‌గా ఆడటం ఖాయం. ఇక ఇటీవల వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న అభిషేక్ శర్మ మరోసారి తన స్థానాన్ని నిలుపుకునే అవకాశముంది. సెమీఫైనల్లో దారుణంగా విఫలమైన వరుణ్ చక్రవర్తి టీ20 ప్రపంచ కప్‌నకు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో రాణించారు. ఫైనల్లోనూ అదే టీమ్‌తో ఆడబోతున్నారు కాబట్టి ప్లేయింగ్ ఎలెవెన్‌లో అతడు కొనసాగుతాడని పలువురు అంటున్నారు. అతడిపై వేటువేసి కుల్‌దీప్ యాదవ్‌కు చోటు కల్పించాలని మరికొందరు చెబుతున్నారు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి విశేషంగా రాణిస్తున్న తిలక్ వర్మ కూడా ఆడే అవకాశముంది. రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్‌లకు తుదిజట్టులో స్థానం దక్కడం దాదాపు కష్టమే. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కివీస్‌ను ఓడించిన భారత జట్టులో వరుణ్, వాషింగ్టన్ ఉన్నారు. ఇషాన్ భారత వన్డే ప్రపంచకప్ 2023 జట్టులో సభ్యునిగా ఉన్నాడు. ఇక ఆరుగురు క్రికెటర్లలో ఒక్క తిలక్ వర్మ మినహా మిగిలిన వారంతా ఐపీఎల్‌లో ఆయా జట్ల తరఫున ఫైనల్ ఆడిన అనుభవముంది.


2024లో ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ గెలిపొందిన భారత జట్టు.. వరుసగా రెండోసారి ఫైనల్ ఆడేందుకు రెడీ అవుతోంది. ఆదివారం కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని టీమ్ఇండియా అభిమానులు ఆశిస్తున్నారు. టైటిల్‌ అందుకునేందుకు ఒక్క అడుగు దూరంలో ఉన్న భారత్.. కివీస్‌పైనా గెలిచి టైటిల్ నిలబెట్టుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇదే జరిగితే వరుస ఎడిషన్లలో టీ20 వరల్డ్ కప్‌ సాధించిన మొదటి జట్టుగా మెన్ ఇన్ బ్లూ అవతరిస్తుంది. అలాగే స్వదేశంలో టీ20 టోర్నమెంట్ గెలిచిన మొదటి జట్టుగా కూడా నిలుస్తుంది.


ఇవీ చదవండి:

టీ20 ప్రపంచకప్ ఫైనల్లోకి భారత్.. వరల్డ్ రికార్డ్ బ్రేక్

ఔట్ అనుకుని సాక్షి సెలబ్రేషన్.. ధోని రియాక్షన్ ఇదే..

Updated Date - Mar 06 , 2026 | 02:01 PM