Share News

టీ20 ప్రపంచకప్ ఫైనల్లోకి భారత్.. వరల్డ్ రికార్డ్ బ్రేక్

ABN , Publish Date - Mar 06 , 2026 | 12:14 PM

పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి భారత్ తుది పోరుకు అర్హత సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా.. పలు రికార్డులను బద్దలుకొట్టింది. ఇంతకీ ఆ రికార్డులు ఏమిటంటే...

టీ20 ప్రపంచకప్ ఫైనల్లోకి భారత్.. వరల్డ్ రికార్డ్ బ్రేక్
Team India Break Australia Record

ఇంటర్నెట్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్‌లో భారత జట్టు ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ జట్టుపై 7 పరుగుల తేడాతో గెలుపొంది న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ గెలుపుతో వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరిన భారత్.. ఆస్ట్రేలియా రికార్డును బద్దలుకొట్టింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్‌కు చేరిన జట్టుగా భారత్ నిలిచింది. టీమ్ఇండియా ఇప్పటివరకు 15 ఐసీసీ టోర్నీల్లో తుదిపోరుకు చేరింది. గతంలో ఈ రికార్డు ఆసీస్ పేరిట ఉండేది. ఆ జట్టు 14 సార్లు ఫైనల్స్ ఆడింది. ఇప్పుడా రికార్డును భారత్ తిరగరాసింది.


ఇక.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో సంజూ శాంసన్ 89 పరుగులు, శివం దూబె 43 పరుగులతో కీలక పాత్ర పోషించారు. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు.. జాకబ్ బెథెల్ అద్భుత సెంచరీ(105; 48 బంతుల్లో) చేసినప్పటికీ మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో 246 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో భారత్ వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో డిఫెండింగ్ ఛాంపియన్ ఫైనల్‌కు చేరుకోవడమిదే మొదటిసారి. 2024లో దక్షిణాఫ్రికాను ఓడించి సగర్వంగా టైటిల్ గెలిచిన భారత్.. ఇప్పుడు మరోసారి ట్రోఫీని నిలబెట్టుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది.


టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో భారత జట్టు న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ గుజరాత్- అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ ద్వారా కివీస్ 8వ సారి ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్ ఆడబోతోంది. అయితే.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడలేదు కివీస్. మరి.. మార్చి 8న జరగబోయే తుదిపోరులో అటు కివీస్ ఇటు భారత్.. ఏ జట్టు టైటిల్ గెలిచినా రికార్డే అవుతుంది. ఈ ట్రోఫీని టీమ్ఇండియా నిలబెట్టుకుంటే వరుసగా రెండుసార్లు గెలుపొందిన జట్టుగా మరో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఒకవేళ కివీస్ టైటిల్ గెలిస్తే.. తొలిసారి ట్రోఫీని ఎగరేసుకుపోయిన జట్టుగా గుర్తింపు పొందుతుంది.


ఇవీ చదవండి:

బెథెల్‌ భయపెట్టినా.. వాంఖడేలో హోరెత్తించారు

ఘనంగా అర్జున్ టెండూల్కర్ వివాహం.. హాజరైన మాజీ క్రికెటర్లు

Updated Date - Mar 06 , 2026 | 12:37 PM