Share News

ఘనంగా అర్జున్ టెండూల్కర్ వివాహం.. హాజరైన మాజీ క్రికెటర్లు

ABN , Publish Date - Mar 05 , 2026 | 05:00 PM

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మాజీ క్రికెటర్లు ఈ వేడుకకు హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమం క్రికెట్ వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఘనంగా అర్జున్ టెండూల్కర్ వివాహం.. హాజరైన మాజీ క్రికెటర్లు
Arjun Tendulkar Sanaya Chandok marriage

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడి వివాహం నేడు ఘనంగా జరిగింది. సచిన్ - అంజలి దంపతుల కుమారుడు, క్రికెటర్ అర్జున్ టెండూల్కర్.. తన చిన్ననాటి స్నేహితురాలు సానియా చందోక్‌ మెడలో మూడు ముళ్లు వేశాడు. ముంబైలోని వర్లిలో ఓ గ్రాండ్ ఫైవ్ స్టార్ హోటల్లో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగ్గా.. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా గతేడాది ఆగస్టులో అర్జున్ - సానియాల ఎంగేజ్మెంట్ అత్యంత సన్నిహితుల మధ్య రహస్యంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే.. కొన్నిరోజుల తర్వాత సచిన్ టెండూల్కర్ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాడు.


అర్జున్ - సానియాల వివాహం.. గురువారం తెల్లవారుజామున గం.12:45లకు సంప్రదాయ పద్ధతిలో జరిగినట్టు తెలుస్తోంది. ఈ వేడుక కోసం కొన్ని రోజులుగా జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ఘనంగా జరిగాయి. ముంబైకి చెందిన ప్రముఖ బిజినెస్‌మేన్ రవి ఘాయ్ మనుమరాలే సానియా చందోక్. ఆమె కూడా ఓ ఎంటర్‌ప్రెన్యూర్‌గా కొనసాగుతోంది. సచిన్ కుమార్తె సారా టెండూల్కర్, సానియాలిద్దరూ ప్రాణ స్నేహితులు కావడం విశేషం. సానియా.. అర్జున్ కంటే వయసులో ఓ ఏడాది పెద్ద కూడా. ఇక.. అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం దేశీయ క్రికెట్‌లో తన కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. తండ్రి సచిన్ లాగా క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాడు.


ముంబైలో జరిగిన అర్జున్ - సానియాల వివాహ వేడుక క్రికెట్ వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి టీమ్ఇండియా మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గావస్కర్, అనిల్ కుంబ్లే, అజిత్ అగార్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, ఆశిస్ నెహ్రా, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్ తదితరులు హాజరయ్యారు. వ్యాపార దిగ్గజం ముకేశ్ - నీతా అంబానీ దంపతులు కూడా ఈ వేడుకకు హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు. వీరితో పాటు పలువురు రాజకీయ నాయకులు, బాలీవుడ్ ప్రముఖులూ ఈ వివాహానికి విచ్చేశారు. కొత్త దంపతులకు ఆశీస్సులు అందజేసి.. వారి జీవిత ప్రయాణం సుఖ సంతోషాలతో నిండి ఉండాలని ఆకాంక్షించారు.


ఇవీ చదవండి:

ఇరాన్‌పై అమెరికా దాడులు.. ఆ వ్యాఖ్యలను ఖండించిన భారత్

మరోసారి ఉదారతను చాటుకున్న సోనూసూద్.. ఆ ప్రయాణికులకు భరోసా

Updated Date - Mar 05 , 2026 | 05:22 PM