బెథెల్ భయపెట్టినా.. వాంఖడేలో హోరెత్తించారు
ABN , Publish Date - Mar 06 , 2026 | 03:35 AM
గ్రూప్ దశలో.. సూపర్ 8లో.. చివరకు సెమీ్‌సలోనూ భారత్‌కు గట్టి పోటీ ఎదురైంది. కానీ పట్టువదలని ప్రదర్శనతో ఎలాగైతేనేం టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో అడుగుపెట్టి అభిమానులను మురిపించింది. గురువారం ఇంగ్లండ్‌తో...
సెమీస్ లొ భారత్ ఉత్కంఠ విజయం
కివీస్ తో టైటిల్ పోరుకు సిద్ధం
శాంసన్ మెరుపు ఇన్నింగ్స్
పోరాడి ఓడిన ఇంగ్లండ్
బెథెల్ శతకం వృధా
టీ20 వరల్డ్‌కప్
ఇది కదా అసలు సిసలైన సమరమంటే.. సంజూ శాంసన్ మరోసారి వీరోచిత ఇన్నింగ్స్‌కు భారత్ 253 పరుగుల స్కోరుతో తిరుగులేని స్థాయిలో నిలిచింది. అయినా విజయంపై భరోసా లేని పరిస్థితి. ఎందుకంటే ఇంగ్లండ్ జట్టు పోరాటం ఆ స్థాయిలో ఉంది మరి.. వరుసగా వికెట్లు కోల్పోయినా ఏమాత్రం బెదరకుండా జాకబ్ బెథెల్ సాగించిన విధ్వంసం అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. 45 బంతుల్లోనే శతకం బాదేసిన తను, ఆఖరి ఓవర్ తొలి బంతికి వెనుదిరిగాకే కోట్లాది ఫ్యాన్స్‌తో పాటు ప్లేయర్లు కూడా హమ్మయ్య అని ఊపిరిపీల్చుకోగలిగారు. చివర్లో ఆర్చర్ బాదుడుకు తేడా ఏడు పరుగులకు మారినా.. టీమిండియా టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
ముంబై: గ్రూప్ దశలో.. సూపర్ 8లో.. చివరకు సెమీ్‌సలోనూ భారత్‌కు గట్టి పోటీ ఎదురైంది. కానీ పట్టువదలని ప్రదర్శనతో ఎలాగైతేనేం టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో అడుగుపెట్టి అభిమానులను మురిపించింది. గురువారం ఇంగ్లండ్‌తో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీఫైనల్లో భారత్ ఏడు పరుగుల తేడాతో గట్టెక్కింది. దీంతో ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్లో టైటిల్ కోసం తలపడనుంది. 2024 టోర్నీ సెమీ్‌సలోనూ ఇంగ్లండ్‌పైనే టీమిండియా గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. శాంసన్ (42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89), దూబే (25 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 43), ఇషాన్ (18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 39), హార్దిక్ (12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 27) వేగంగా ఆడారు. జాక్స్, రషీద్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 246/7 స్కోరు చేసి ఓడింది. బెథెల్ (48 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 105), జాక్స్ (35) రాణించారు. హార్దిక్‌కు రెండు వికెట్లు లభించాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా శాంసన్ నిలిచాడు.
వామ్మో.. బెథెల్
క్లిష్టమైన ఛేదనను ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసంతో ఆరంభించింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా సాధించాల్సిన రన్‌రేట్‌ను తగ్గకుండా చూసుకుంది. బెథెల్ ఇన్నింగ్స్ జట్టును విజయంవైపు నడిపించేలా కనిపించింది. అతడి ధాటికి చివరి ఓవర్ వరకు కూడా ఇంగ్లండ్ పోటీలోనే ఉండడం గమనార్హం. కానీ పట్టు వీడని భారత బౌలర్లు మ్యాచ్‌ను భారత్ వశం చేశారు. ఓపెనర్ సాల్ట్ (5), కెప్టెన్ బ్రూక్ (7) ఈ మ్యాచ్‌లోనూ విఫలం కాగా బట్లర్ కాస్త ఫర్వాలేదనిపించాడు. కానీ బెథెల్ రాకతో భారత్‌లో గుబులు రేగింది. ఎవరినీ వదలకుండా బౌండరీ వరద పారించడంతో స్కోరు కేవలం 49 బంతుల్లోనే వంద పరుగులకు చేరింది. అటు జాక్స్ తనకు చక్కగా సహకరించడంతో ఇంగ్లండ్ స్కోరు ఎక్కడా తగ్గలేదు. ఐదో వికెట్‌కు ఈ జోడీ మధ్య 77 పరుగులు సమకూరాయి. 14వ ఓవర్‌లో జాక్స్ వెనుదిరగడం మలుపు తిప్పింది. అటు కర్రాన్ 17వ ఓవర్‌లో 6,4తో 16 రన్స్ రాబట్టగా స్కోరు 200 దాటేసింది. కానీ 18వ ఓవర్‌లో బుమ్రా కేవలం ఆరు పరుగులే ఇవ్వడంతో ఇంగ్లండ్ లయ తప్పింది. మరోవైపు బెథెల్ ఓ సిక్సర్‌తో 45 బంతుల్లోనే సెంచరీ పూర్తయింది. 19వ ఓవర్‌లో కర్రాన్ (18) వెనుదిరగ్గా.. ఆరు బంతుల్లో 30 రన్స్ కావాల్సిన వేళ బెథెల్ తొలి బంతికే రనౌట్ కావడంతో వాంఖడే హోరెత్తిపోయింది. ఆర్చర్ (19 నాటౌట్) సిక్సర్ల జోరుకు ఇంగ్లండ్ ఓటమి తేడా తగ్గింది.
సంజూ మెరుపు ఆరంభం: వాంఖడే ఫ్లాట్ వికెట్‌పై టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. పరుగుల వరద పారించింది. ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి మెరుపు ఆరంభాన్ని అందించాడు. అనంతరం ఇషాన్, దూబే, హార్దిక్‌ల దూకుడుకు జట్టు స్కోరు 250 దాటేసింది. అయితే పునాది వేసింది మాత్రం శాంసన్ ఆటతీరే. అభిషేక్ (9) వైఫల్యం ఎప్పటిలాగే కొనసాగినా సంజూ మాత్రం ఎదురుదాడిని ఆపలేదు. తనకు ఆరంభంలో ఇషాన్ సహకారం అందించడంతో స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. తొలి ఓవర్‌లోనే శాంసన్ 4,6తో భారీ స్కోరుకు రంగం సిద్ధం చేశాడు. ఇక అభిషేక్‌ను లక్ష్యంగా చేసుకుని రెండో ఓవర్‌లోనే స్పిన్నర్ జాక్ బంతిని తీసుకున్నాడు. అప్పటికి తన ఓవర్‌లో అభి రెండు ఫోర్లు బాదినా చివరి బంతికి మరో షాట్‌కు వెళ్లి సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చాడు. కానీ ఇంగ్లండ్ సంతోషాన్ని ఆవిరి చేస్తూ ఆర్చర్ ఓవర్‌లో శాంసన్ 4,6,4తో చెలరేగాడు. అయితే ఇదే ఓవర్‌లో తను 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు మిడాన్‌లో ఇచ్చిన తేలికైన క్యాచ్‌ను బ్రూక్ వదిలేశాడు. ఆ తర్వాత సంజూ మరో చాన్స్ ఇవ్వలేదు.
అటు ఇషాన్ కూడా బౌండరీలు బాదేయడంతో పవర్‌ప్లేలో జట్టు 67/1 స్కోరుతో నిలిచింది. ఎనిమిదో ఓవర్‌లో చెరో సిక్సర్‌తో 19 రన్స్.. తొమ్మిదో ఓవర్‌లో శాంసన్ 6,4 ఇషాన్ 6తో స్కోరు వంద దాటేసింది. 26 బంతుల్లో సంజూ హాఫ్ సెంచరీ పూర్తయ్యింది. అయితే ఈ జోరుకు స్పిన్నర్ రషీద్ బ్రేక్ వేశాడు. తను ఇషాన్‌ను అవుట్ చేయడంతో రెండో వికెట్‌కు 45 బంతుల్లోనే 97 పరుగుల తుఫాన్ భాగస్వామ్యం ముగిసింది. స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకునేందుకు బ్యాటింగ్ ఆర్డర్‌లో దూబేను ముందుకు పంపగా, రషీద్ ఓవర్‌లో రెండు సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. అటు ఆర్చర్ ఓవర్‌లో శాంసన్ మరో రెండు సిక్సర్లతో సెంచరీ ఖాయమనిపించాడు. కానీ స్పిన్నర్ జాక్స్ తన రెండో స్పెల్‌లో శాంసన్ వికెట్‌తో ఝలక్ ఇచ్చాడు. కాసేపటికే కెప్టెన్ సూర్య (11) స్వీప్ షాట్‌కు వెళ్లి రషీద్‌కు చిక్కాడు. కానీ హార్దిక్ (27) వచ్చీ రాగానే మూడు ఫోర్లతో 17వ ఓవర్‌లోనే స్కోరు 200 దాటేసింది. ఆ తర్వాత సమన్వయ లోపంతో దూబే రనౌట్ అయ్యాడు. ఇక తిలక్ (21) ఏడు బంతులాడి వెనుదిరిగినా.. మూడు సిక్సర్లతో హోరెత్తించాడు. చివరి ఓవర్‌లో హార్దిక్ మరో రెండు సిక్సర్లు బాది రనౌట్‌గా వెనుదిరిగినా, అప్పటికే భారత్ అత్యంత పటిష్ఠ స్థితిలో నిలిచింది.
స్కోరు బోర్డు
భారత్: శాంసన్ (సి) సాల్ట్ (బి) జాక్స్ 89, అభిషేక్ (సి) సాల్ట్ (బి) జాక్స్ 9, ఇషాన్ (సి) జాక్స్ (బి) రషీద్ 39, దూబే (రనౌట్) 43, సూర్యకుమార్ (స్టంప్) బట్లర్ (బి) రషీద్ 11, హార్దిక్ (రనౌట్) 27, తిలక్ (బి) ఆర్చర్ 21, అక్షర్ (నాటౌట్) 2, వరుణ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 253/7. వికెట్ల పతనం: 1-20, 2-117, 3-160, 4-190, 5-212, 6-236, 7-251. బౌలింగ్: ఆర్చర్ 4-0-61-1, జాక్స్ 4-0-40-2, ఒవర్టన్ 3-0-36-0, కర్రాన్ 4-0-53-0, రషీద్ 4-0-41-2, డాసన్ 1-0-19-0.
ఇంగ్లండ్: సాల్ట్ (సి) అక్షర్ (బి) హార్దిక్ 5, బట్లర్ (బి) వరుణ్ 25, బ్రూక్ (సి) అక్షర్ (బి) బుమ్రా 7, బెథెల్ (రనౌట్) 105, బాంటన్ (బి) అక్షర్ 17, జాక్స్ (సి) దూబే (బి) అర్ష్‌దీప్ 35, కర్రాన్ (సి) తిలక్ (బి) హార్దిక్ 18, ఒవర్టన్ (నాటౌట్) 2, ఆర్చర్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 20 ఓవర్లలో 246/7. వికెట్ల పతనం: 1-13, 2-38, 3-64, 4-95, 5-172, 6-222, 7-225. బౌలింగ్: అర్ష్‌దీప్ 4-0-51-1, హార్దిక్ 4-0-38-2, బుమ్రా 4-0-33-1, వరుణ్ 4-0-64-1, అక్షర్ 3-0-35-1, దూబే 1-0-22-0.
మ్యాచ్ విన్నర్ బుమ్రానే: సంజూ
శాంసన్ తన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును బుమ్రాకు అంకితమిచ్చి అందరి హృదయాలను గెల్చుకున్నాడు. వాస్తవంగా సంజూ అర్ధ శతకం కంటే.. బుమ్రానే మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. చివరి మూడు ఓవర్లలో ఇంగ్లండ్ విజయానికి 45 పరుగులు కావాలి. బెథెల్ జోరు చూస్తుంటే.. ఏదైనా సాధ్యమే అనేలా ఉంది. కానీ, బుమ్రా ఆపద్బాంధవుడిలా మారాడు. 18వ ఓవర్‌లో తన పదునైన యార్కర్లతో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఆ ఓవర్‌లో కేవలం ఆరు పరుగులే రావడంతో.. ఒత్తిడి అమాంతం పెరిగింది. మ్యాచ్ భారత్‌వైపు మొగ్గింది. ‘డెత్ ఓవర్లలో బుమ్రా అలా బౌల్ చేసి ఉండకపోతే.. నేను పోడియంపై ఉండేవాడిని కానేమో’ అని శాంసన్ అన్నాడు.
వావ్ అక్షర్
ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బ్రూక్ క్యాచ్ అందుకునే క్రమంలో అక్షర్ 23 మీటర్ల దూరం వెనక్కి పరిగెడుతూ డైవ్ చేస్తూ పట్టిన క్యాచ్ హైలైట్‌గా నిలిచింది. ఇక బెథెల్‌తో చక్కగా కుదురుకున్న విల్ జాక్స్ క్యాచ్‌ను కూడా రన్నింగ్‌లో అందుకుంటూనే, రోప్ దాటే ప్రమాదం ఉండడంతో పక్కనే ఉన్న దూబే వైపు బంతిని విసిరాడు. తను వెంటనే పట్టేయడంతో ఈ ప్రమాదకర జోడీకి బ్రేక్ పడినట్టయ్యింది.
‘ఫ్రీ’ వికెట్ శర్మ..
వరుస వైఫల్యాలు ఎదురవుతున్నా అభిషేక్ శర్మ తీరు మారడం లేదు. అతడి బలహీనతను పసిగట్టిన ప్రత్యర్థులు.. ఆరంభంలోనే స్పిన్నర్లను రంగంలోకి దించడం.. అభిషేక్ గుడ్డిగా షాట్ ఆడి అవుట్ కావడం పరిపాటిగా మారింది. కీలక నాకౌట్ మ్యాచ్‌లో కూడా విల్స్ జాక్స్ బౌలింగ్‌లో అభిషేక్ మరోసారి ఇలాగే క్యాచిచ్చాడు. సింగిల్ డిజిట్‌కే వెనుదిరగడంతో.. అభిమానులు ఘోరంగా ట్రోల్ చేశారు. అతడు తనకు ఇచ్చిన అవకాశాలకు ఏమాత్రమైనా న్యాయం చేశాడా? అని కొందరు విమర్శిస్తే.. నాకౌట్ ‘చోకర్’ అని మరొకరు ఎద్దేవా చేశారు. ‘బాబూ ఇక నీవల్ల కాదు’, ‘ఫ్రీ వికెట్ శర్మ’ అని కొందరు నెటిజన్స్ మీమ్స్‌తో హోరెత్తించారు.
భారీ
మూల్యం...
తొలి ఓవర్‌లోనే 4,6తో ధాటిగా ఆరంభించిన శాంసన్ ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. అయితే, మూడో ఓవర్‌లో 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆర్చర్ బౌలింగ్‌లో సంజూ ఇచ్చిన క్యాచ్‌ను బ్రూక్ నేలపాలు చేశాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్న శాంసన్ పవర్‌ప్లేలో ఎడాపెడా షాట్ల తో చెలరేగాడు. ఈ క్రమంలో 26 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకొన్నాడు. భారీ సిక్స్‌తో ఈ మార్క్‌కు చేరాడు.
1
ఈ టీ20 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో ఎక్కువ సిక్సర్లు (16) బాదిన భారత ప్లేయర్‌గా శాంసన్. రోహిత్, దూబే (15)లను అధిగమించాడు. అలాగే భారత జట్టు నుంచి 88 సిక్సర్లు రావడం కూడా రికార్డే. ఇక ఒకే ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్సర్లు (19) బాదిన జట్టుగా నెదర్లాండ్స్, విండీస్ సరసన భారత్ నిలిచింది.
1
టీ20 వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ నుంచి అత్యధిక భాగస్వామ్యం (97) నమోదు చేసిన జోడీగా శాంసన్-ఇషాన్. 2007 టోర్నీలో యువరాజ్-ఊతప్ప (84) రికార్డును అధిగమించారు.
1
పురుషుల టీ20ల్లో ఎక్కువసార్లు (6) 250+ స్కోర్లు సాధించిన జట్టుగా భారత్
2
ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో 8.2 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసింది. మెగా టోర్నీ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఇది రెండో ఫాస్టెస్ట్. తొలి సెమీ్‌సలో సఫారీలపై కివీస్ 7.5 ఓవర్లలో ఈ ఫీట్ సాధించి టాప్‌లో ఉంది.
టీ20 వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో వేగంగా (19 బంతుల్లో) ఫిఫ్టీ పూర్తి చేసిన బ్యాటర్‌గా అలెన్‌తో సమంగా నిలిచిన బెథెల్. అలాగే ఈ మెగా టోర్నీల్లో రెండో వేగవంతమైన శతకం (45 బంతుల్లో) పూర్తి చేశాడు. అలెన్ (33) ముందున్నాడు.
ఓ టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఎక్కువ సిక్సర్లు (34) నమోదు కావడం ఇదే మొదటిసారి.
పురుషుల టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోరు (499) నమోదవవడం ఇది రెండోసారి. గతంలో సౌతాఫ్రికా-వెస్టిండీస్ మధ్య 517 నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి...
లేట్ నైట్ రివ్యూలు తగ్గించండి.. మంత్రికి ఎమ్మెల్యే సూచన
అసెంబ్లీలో అందరూ ఉంటేనే మసాలా: స్పీకర్ అయ్యన్న పాత్రుడు
Read Latest AP News And Telugu News