Share News

లేట్‌ నైట్ రివ్యూలు తగ్గించండి.. మంత్రికి ఎమ్మెల్యే సూచన

ABN , Publish Date - Mar 05 , 2026 | 02:02 PM

మంత్రి నారాయణ రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం పర్యటిస్తూ కష్టపడుతున్నారని ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆరోగ్య దృష్ట్యా రాత్రి లేట్ రివ్యూలు తగ్గించాలని సూచించారు.

లేట్‌ నైట్ రివ్యూలు తగ్గించండి.. మంత్రికి ఎమ్మెల్యే సూచన
MLA Vishnukumar Raju

అమరావతి, మార్చి 5: మంత్రి నారాయణ రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం పర్యటిస్తూ కష్టపడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..రోజుకు పలు మున్సిపాలిటీల్లో రివ్యూలు నిర్వహిస్తూ రాత్రి 11 గంటల వరకు మంత్రి పని చేస్తున్నారని, ఆరోగ్య దృష్ట్యా రాత్రి లేట్ రివ్యూలు తగ్గించాలని సూచించారు. మున్సిపల్ శాఖకు రూ.14,538 కోట్ల బడ్జెట్ కేటాయించడం అభినందనీయమని ఆయన అన్నారు.


ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన పీఎమ్‌ఏవై(PMAY) అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద ఇళ్ల నిర్మాణంపై ఎమ్మెల్యే ప్రస్తావిస్తూ.. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 7.1 లక్షల ఇళ్లు మంజూరు చేశారని, 2014–2019 మధ్య సుమారు 5 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం 2.39 లక్షల టిడ్కో ఇళ్లను రద్దు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. ఇళ్ల కోసం డబ్బులు కట్టిన 2.39 లక్షల మంది లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. విశాఖ నార్త్ నియోజకవర్గంలో ట్రై జంక్షన్‌లో 1296 ఇళ్లు, చీమలపల్లి 1 & 2లో 288 ఇళ్లు మొత్తం 1596 ఇళ్ల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.


లబ్ధిదారులు రూ.3.65 లక్షల బ్యాంకు లోన్ తీసుకుని ఈఎమ్‌ఐలు చెల్లిస్తున్నా ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ.. వెంటనే టెండర్లు పిలిచి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. వీఎమ్‌ఆర్‌డీఏ(VMRDA) మాస్టర్ ప్లాన్ 2041లో అనకాపల్లి – రాజకాలవ రోడ్డును 100 మీటర్ల వెడల్పుగా నిర్ణయించడంపై అభ్యంతరం తెలిపారు. ప్రస్తుతం రోడ్డుకు 60 మీటర్లు సరిపోతుందని, అదనంగా 40 మీటర్లు అవసరం లేదని చెప్పారు. రోడ్డు విస్తరణ కోసం 700 ఎకరాల భూసేకరణ అవసరమవుతుందని, రైతులకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్యే తెలిపారు.


ఎన్‌ఏఎల్‌ఏ(NALA) కన్వర్షన్ చార్జీల మార్పులు రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. మున్సిపల్ పనుల్లో రూ.3000 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రస్తుత ప్రభుత్వం రూ.1300 కోట్లు క్లియర్ చేసినందుకు మంత్రికి అభినందనలు తెలిపారు. చిన్న కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు కూడా త్వరగా చెల్లించాలని కోరారు. పాత జీవో 35 అమలు చేయాలని, జీవో 62 సరైనది కాదని అభిప్రాయపడ్డారు. పూర్తి అయిన భవనాల పనులకు పేమెంట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కోరారు.


ఇవి కూడా చదవండి...

రహదారుల పక్కన ఉండే వృక్షాల కోసం ప్రత్యేక పాలసీ: పవన్ కల్యాణ్

మనమిత్ర ద్వారా పదో తరగతి హాల్ టికెట్స్

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 05 , 2026 | 02:07 PM