Share News

అసెంబ్లీలో అందరూ ఉంటేనే మసాలా: స్పీకర్ అయ్యన్న పాత్రుడు

ABN , Publish Date - Mar 05 , 2026 | 02:53 PM

ప్రజా సమస్యల కోసమే ఎమ్మెల్యేలు ఎన్నికవుతారని.. అలాంటిది అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరవడం సబబు కాదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. వైసీపీలో జగన్ మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా జీతాలు తీసుకుంటున్నారని తెలిపారు.

అసెంబ్లీలో అందరూ ఉంటేనే మసాలా: స్పీకర్ అయ్యన్న పాత్రుడు
Ayyanna Patrudu

అమరావతి, మార్చి 5: అసెంబ్లీలో అందరూ ఉంటేనే మసాలా ఉంటుందని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు(AP Speaker Ayyanna patrudu) అన్నారు. గురువారం తన ఛాంబర్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో స్పీకర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల కోసమే ఎమ్మెల్యేలు ఎన్నికవుతారని... అలాంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన అసెంబ్లీకి గైర్హాజరు సబబు కాదని అన్నారు. వైసీపీలో జగన్ మోహన్ రెడ్డి మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా జీతాలు తీసుకుంటున్నారని స్పీకర్ గుర్తు చేశారు. వైసీపీ సభ్యులకు నోటీసులు ఇవ్వాలంటే తగిన సమయం రావాలన్నారు.


అనర్హత వేటు అంశం ఆంధ్రప్రదేశ్‌లో సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా సక్సెస్ అవుతుందని స్పీకర్ అన్నారు. గవర్నర్ ప్రసంగం రోజు అసెంబ్లీకి వచ్చినా అది హాజరుగా పరిగణించాలనే నిబంధన ఎక్కడ ఉందో ‘నెంబర్ వన్ స్టూడెంట్’ అని చెప్పుకునేవాళ్లు చూపించాలని సవాల్ విసిరారు. గవర్నర్ ప్రసంగం రోజు అసెంబ్లీకి వస్తే.. అది హాజరుగా పరిగణించబడదని స్పష్టం చేశారు. అడ్డగోలు వాదనలు చేసే వారిని ఏమనాలని స్పీకర్ ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డికి దక్కాల్సిన అన్ని గౌరవ మర్యాదలు లభిస్తున్నాయని అయ్యన్నపాత్రుడు చెప్పారు.


జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీలకు అతీతంగా అందరు ఎమ్మెల్యేలతో సరదాగా ఉండేవారని గుర్తు చేశారు స్పీకర్. విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో ప్రారంభోత్సవానికి సీఎంగా వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అప్పటి ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన తనను స్టేజ్‌పైకి ఆహ్వానించి, ప్రోటోకాల్ పాటించలేదని కలెక్టర్‌ను అక్కడే మందలించారని ఆనాటి అనుభవాన్ని స్పీకర్ మీడియాతో పంచుకున్నారు. అప్పట్లో అధికార-ప్రతిపక్ష సభ్యులు సభలో ప్రజా సమస్యలపై పోరాడినా బయట స్నేహంగా ఉండేవారని గుర్తు చేశారు. రాను రాను ఆ సంస్కృతి పోయి విరోధుల్లా తయారవుతున్నారని స్పీకర్ అన్నారు. శాసనమండలి అంటే పెద్దల సభగా.. పెద్ద ఆలోచనలు ఉన్నవారితో నిండి ఉండేదని.. ఇప్పుడు పెద్ద ఆలోచనలు లేని వారు ఉండటం వల్ల ఎలా ఉంటుందో చూస్తున్నామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి...

మనమిత్ర ద్వారా పదో తరగతి హాల్ టికెట్స్

లేట్‌ నైట్ రివ్యూలు తగ్గించండి.. మంత్రికి ఎమ్మెల్యే సూచన

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 05 , 2026 | 03:05 PM