Share News

ఔట్ అనుకుని సాక్షి సెలబ్రేషన్.. ధోని రియాక్షన్ ఇదే..

ABN , Publish Date - Mar 06 , 2026 | 12:59 PM

టీ20 ప్రపంచకప్ సెమీఫైన‌ల్ మ్యాచ్‌ చూసేందుకు ముంబై వాంఖడే స్టేడియానికి టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ, భార్య సాక్షితో క‌లిసి వ‌చ్చాడు. ప్రత్యేక గ్యాలరీ నుంచి వీరు మ్యాచ్‌ను వీక్షించారు. అయితే.. బుమ్రా క్యాచ్ పట్టడంతో సాక్షి ఎగిరి గంతేయగా.. ధోనీ స్పందించి ఆమెను నిలువరించాడు. ఈ ఘటన నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఔట్ అనుకుని సాక్షి సెలబ్రేషన్.. ధోని రియాక్షన్ ఇదే..
Sakshi Dhoni celebration

ఇంటర్నెట్ డెస్క్: ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2026 సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఓ సరదా ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, సతీమణి సాక్షి స్టాండ్స్‌లో కనిపించారు. ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తుండగా.. బుమ్రా బౌలింగ్‌లో సామ్‌కరన్ ఓ షాట్ ఆడగా బంతి నేలను తాకి బుమ్రా చేతికి వచ్చింది. దీంతో బుమ్రా క్యాచ్ పట్టేశాడనుకున్న సాక్షి.. వెంటనే ఎగిరి గంతేయసాగింది. వెంటనే మిస్టర్ కూల్ ధోనీ.. అది ఔట్ కాదని చెబుతూ ప్రశాంతంగా ఉండమన్నట్టుగా సంకేతాలిచ్చాడు.


ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్ సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో ఇంగ్లండ్ జట్టు భారత్ నిర్దేశించిన 254 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో అతి దగ్గరకు చేరుకుంది. ఈ క్రమంలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన బంతిని ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్‌కరన్ షాట్‌ ఆడాడు. అప్పటికే నేలనుతాకి పైకి లేచిన బంతిని ఆపే క్రమంలో బుమ్రా క్యాచ్ పట్టాడు. దీంతో స్టాండ్స్‌లో కూర్చున్న సాక్షి.. ఆ క్షణంలో బుమ్రా క్యాచ్ పట్టేశాడని, వికెట్ పడిందని భావించి వెంటనే ఆనందంతో లేచి సెలబ్రేట్ చేయడం ప్రారంభించింది. సాక్షి ఇలా వికెట్ పడకముందే సెలబ్రేట్ చేయడం చూసిన ధోనీ.. 'వికెట్ పడలేదు.. కాస్త ఆగు' అన్నట్టుగా సంకేతమిచ్చాడు. ధోనీ ఇచ్చిన ఆ సైలెంట్ రియాక్షన్ అక్కడున్న వారందరినీ నవ్వించింది. కామెంటేటర్లు కూడా ఈ సరదా ఘటన చూసి తెగ నవ్వేసుకున్నారు.


ఈ మ్యాచ్‌కు హాజరై సమీపంలోనే కూర్చున్న భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, అతడి భార్య రితికాతో పాటు అక్కడ ఉన్నవారు కూడా ఈ సంఘటనను చూసి నవ్వుకున్నారు. ఈ సరదా క్షణాలకు సంబంధించిన వీడియో బయటకు రాగా.. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. సాక్షి చేసుకున్న సెలబ్రేషన్ వీడియో వ్యూవర్స్‌లోనూ నవ్వులు పూయిస్తోంది.


ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన సెమీస్‌లో టీమ్ఇండియా విజయం సాధించి తుదిపోరుకు చేరింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ కీలక పోరును చూసేందుకు క్రికెట్ ప్రముఖులు, సినీ తారలు స్టేడియానికి తరలివచ్చారు. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, భార్య సాక్షితో కలిసి స్టేడియానికి రావడం అభిమానులను ఆకట్టుకుంది.


ఇవీ చదవండి:

టీ20 ప్రపంచకప్ ఫైనల్లోకి భారత్.. వరల్డ్ రికార్డ్ బ్రేక్

ఘనంగా అర్జున్ టెండూల్కర్ వివాహం.. హాజరైన మాజీ క్రికెటర్లు

Updated Date - Mar 06 , 2026 | 01:07 PM