స్టార్ ఆటగాళ్ల మధ్య ఆసక్తికర పోరు.. ఎవరిది పైచేయి?
ABN , Publish Date - May 31 , 2026 | 11:57 AM
ఐపీఎల్-2026 ఆఖరి మ్యాచ్ నేడే. బలమైన బ్యాటింగ్, నాణ్యమైన బౌలింగ్ విభాగాలతో కూడిన ఆర్సీబీ, జీటీ జట్ల మధ్య జరిగే తుది పోరు అభిమానులకు క్రికెట్ విందు కానుంది. మరి ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగబోయే కీలక ఆటగాళ్ల బలాబలాలను ఓసారి పరిశీలిస్తే...
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. రెండు నెలలకుపైగా సాగిన ఉత్కంఠభరిత పోరాటాల అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఫైనల్‌కు అర్హత సాధించాయి. లీగ్ దశలో అత్యుత్తమ ఆటతీరు కనబరిచిన ఇరు జట్లూ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలను దక్కించుకుని ఇప్పుడు టైటిల్ కోసం తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనున్న ఆర్సీబీ.. రజత్ పాటిదార్ నాయకత్వంలో సమతూకంగా కనిపిస్తోంది. మరోవైపు 2022లో తొలిసారి కప్పును అందుకున్న గుజరాత్ టైటాన్స్.. మరోసారి ట్రోఫీని సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.
అసలు పోరు వీరి మధ్యే..
అయితే.. తుదిపోరులో కొందరు ఆటగాళ్లు మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశముంది. ముఖ్యంగా ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, గుజరాత్ పేసర్లు కాగిసో రబాడా, జేసన్ హోల్డర్‌ల మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది. గత రికార్డుల ప్రకారం.. రబాడా కోహ్లీని 5 సార్లు, హోల్డర్ 4 సార్లు ఔట్ చేశారు. అయినప్పటికీ ఫైనల్ మ్యాచ్‌ల్లో రాణించడంలో కోహ్లీకి ప్రత్యేక గుర్తింపు ఉండటంతో ఈ పోరు అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.
గుజరాత్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల క్వాలిఫయర్-2లో రాజస్థాన్‌పై 167 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు విజయాన్ని అందించారు. అయితే వీరు ఆర్‌సీబీ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం. భువీ.. గిల్‌ను 6 సార్లు, సుదర్శన్‌ను 7 సార్లు ఔట్ చేశాడు. మరోవైపు.. జీటీ స్పిన్నర్ రషీద్ ఖాన్, ఆర్‌సీబీ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ మధ్య పోటీ కూడా ప్రత్యేకాకర్షణగా నిలవనుంది. ఈ సీజన్‌లో మంచి లయలో ఉన్న రషీద్.. ఇప్పటికే 19 వికెట్లు సాధించాడు. గతంలో పడిక్కల్‌ను 5 సార్లు ఔట్ చేసిన అతడు.. మరోసారి ఆధిపత్యం చాటాలని చూస్తున్నాడు. కాగా.. ప్రతీకారం తీర్చుకోవాలని పడిక్కల్ భావిస్తున్నాడు.
మొత్తంగా చూస్తే బలమైన బ్యాటింగ్, నాణ్యమైన బౌలింగ్ విభాగాలతో ఉన్న ఈ రెండు జట్ల మధ్య జరిగే తుది పోరు అభిమానులకు క్రికెట్ విందు కానుంది. మరి ఈ మ్యాచ్‌లో ఆధిపత్యం కనబరిచి రెండోసారి కప్పు ఎగరేసుకుపోయే జట్టేదో మరికొన్ని గంటల్లో తేలనుంది.
ఇవీ చదవండి:
వైభవ్ సూర్యవంశీ టెస్ట్ క్రికెట్ ఆడగలడా.. సచిన్ టెండూల్కర్ అభిప్రాయం ఏంటంటే..
రూ1.10 కోట్ల పెట్టుబడికి రూ.34 కోట్లకు పైగా ఫలితం!