రూ1.10 కోట్ల పెట్టుబడికి రూ.34 కోట్లకు పైగా ఫలితం!
ABN , Publish Date - May 30 , 2026 | 03:07 PM
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా చేస్తోంది. కేవలం రూ.1.1 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ జట్టులో కొనసాగిన ఈ యువ ఆటగాడు.. తన బ్యాటింగ్‌తో జట్టుకు అపారమైన విలువను అందించినట్టు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: అత్యద్భుతమైన బ్యాటింగ్‌తో ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ.. రాజస్థాన్ రాయల్స్‌కు భారీ విలువను చేకూర్చాడు. గతేడాది రూ.1.1 కోట్లు చెల్లించి వైభవ్‌ను సొంతం చేసుకున్న ఆర్ఆర్.. ఈ సీజన్‌లో అతడి ఆట ద్వారా రూ.34.97 కోట్లు పొందినట్టు విశ్లేషకులు అంచనా వేశారు. అంటే అతడికి చెల్లించిన మొత్తం పోనూ.. రూ.33.87 కోట్లు అన్నమాట. బాల్-బై-బాల్ డేటా ఆధారంగా ప్రత్యేక ప్లేయర్ ఇంపాక్ట్ మోడల్ ప్రకారం ఈ గణాంకాలను రూపొందించినట్టు తెలుస్తోంది.
వైభవ్ తన ఆటతీరుతో ప్రతి రూపాయికి రూ.31.79 విలువను ఆర్ఆర్ జట్టుకు అందించినట్లు ఈ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. అత్యధిక లాభం అందించిన ఆటగాళ్ల జాబితాలో వైభవ్ మూడో స్థానంలో నిలిచాడు. అతని కంటే ముందున్న శుభ్‌మన్ గిల్(రూ.16.5 కోట్లు), రజత్ పాటిదార్(రూ.11 కోట్లు)కు ఆయా ఫ్రాంచైజీలు భారీ ధరలు వెచ్చించినప్పటికీ.. వైభవ్ మాత్రం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందించాడు. ఇక జీటీ కెప్టెన్ శుభ్‌మన్ రూ.35.14 కోట్లు తెచ్చిపెట్టగా, ఆర్సీబీ సారథి పాటిదార్ రూ.35.06 కోట్లు సాధించేలా చేశాడు. మరోవైపు.. రిషబ్ పంత్(రూ.27 కోట్లు), నికోలస్ పూరన్ (రూ.21 కోట్లు), యుజ్వేంద్ర చాహల్ (రూ.18 కోట్లు), జస్ప్రీత్ బుమ్రా (రూ.18 కోట్లు) ఈ సీజన్‌లో తమ ఫ్రాంచైజీలకు నష్టాలను మిగిల్చారు.
ఇక.. 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసిన సూర్యవంశీ.. అందులో 521 పరుగులను పవర్‌ప్లే ఓవర్లలోనే సాధించడం విశేషం. ప్రత్యర్థి బౌలర్లపై ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించడం ఈ బుడ్డోడి ప్రత్యేకత. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 36 బంతుల్లో శతకం సాధించి ఐపీఎల్ చరిత్రలో మూడో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. అదే జట్టుపై ఎలిమినేటర్‌లో 29 బంతుల్లో 97 పరుగులతో చెలరేగి.. తమ జట్టు క్వాలిఫయర్‌కు అర్హత సాధించేలా చేశాడు. ఇక.. ఈ సీజన్‌లో వైభవ్ పుల్‌షాట్ ప్రత్యేకాకర్షణగా నిలిచిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ షాట్‌తో 20 సిక్సర్లు బాదిన ఈ చిచ్చర పిడుగు.. ఒక్కసారి మాత్రమే అలాంటి షాట్‌కు ఔటయ్యాడు. అతడు ఎదుర్కొన్న 44 మంది బౌలర్లలో 31 మందిని సిక్సర్లతో శిక్షించడం, వారిలో ఎనిమిది మంది బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ బాదడం అతడి దూకుడుకు నిదర్శనం.
కాగా.. 13 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ఈ యువ సంచలనం.. భవిష్యత్తులో జరిగే మెగా వేలంలో రూ.15-18 కోట్లకు పైగా ధర పలికే అవకాశముందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి:
వైభవ్ అతి త్వరలో జాతీయ జట్టుకు ఎంపికవుతాడు: సంగక్కర
రెండోసారి హిట్ వికెట్.. సాయి సుదర్శన్ స్పందనిదే..