Share News

రెండోసారి హిట్ వికెట్.. సాయి సుదర్శన్ స్పందనిదే..

ABN , Publish Date - May 30 , 2026 | 10:59 AM

ఐపీఎల్-2026 తుది అంకానికి చేరుకుంది. రెండో క్వాలిఫయర్‌లో ఆర్ఆర్‌ను ఓడించి జీటీ ఫైనల్ చేరింది. అయితే.. గత మ్యాచ్‌లోలాగే ఈ మ్యాచ్‌లోనూ హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్. మ్యాచ్ అనంతరం అతడు ఈ విషయమై సరదాగా స్పందించాడు.

రెండోసారి హిట్ వికెట్.. సాయి సుదర్శన్ స్పందనిదే..
Sai Sudarshan

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-2026 క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ మరోసారి సత్తాచాటింది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించి, బెంగళూరుతో తుదిపోరుకు అర్హత సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో జీటీ ఓపెనర్ సాయి సుదర్శన్ ఔటైన తీరే చర్చనీయాంశమవుతోంది. బ్రిజేష్ శర్మ బౌలింగ్‌లో థర్డ్‌మ్యాన్ వైపు బౌండరీ కొట్టిన అనంతరం అతడి చేతిలోని బ్యాట్ జారి నేరుగా వికెట్లను తాకడంతో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. అంతకుముందు క్వాలిఫయర్-1లో జరిగిన మ్యాచ్‌లోనూ ఆర్సీబీపై ఇదే తరహాలో ఔటయ్యాడు. దీంతో ఐపీఎల్‌లో వరుసగా 2 ఇన్నింగ్స్‌ల్లో హిట్ వికెట్‌గా వెనుదిరిగిన తొలి బ్యాటర్‌గా కోరుకుని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు సాయి సుదర్శన్.


మ్యాచ్ అనంతరం తాను ఔటైన తీరుపై సాయి సుదర్శన్‌కు ఓ ప్రశ్న ఎదురవగా దానికి అతడు సరదాగా స్పందించాడు. 'ఇకపై బ్యాట్ చేతికి అతుక్కుని ఉండేలా గ్రిప్ టెక్నిక్‌లు ఏవైనా ఉన్నాయేమో ప్రయత్నించాలి' అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన సాయి సుదర్శన్.. తొలి వికెట్‌కు 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధికం. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మైక్ హస్సీ, మురళీ విజయ్ 159 పరుగులు జోడించగా.. ఆ రికార్డును వీరు అధిగమించారు. అంతేకాకుండా గిల్-సుదర్శన్ జోడీ మరో ఘనతనూ సొంతం చేసుకుంది. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధికంగా 100కు పైగా భాగస్వామ్యాలు నెలకొల్పిన జోడీగా అవతరించింది. వీరిరువురూ 11 సెంచరీ భాగస్వామ్యాలతో.. క్రిస్ గేల్-కోహ్లీ, బాబర్ ఆజమ్-మహ్మద్ రిజ్వాన్, డివిలియర్స్-కోహ్లీ జోడీలను వెనక్కి నెట్టారు.


ఇక మ్యాచ్ విషయానికొస్తే.. 215 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గిల్(53 బంతుల్లో 104) అద్భుత శతకంతో మెరిశాడు. మరోవైపు సాయి సుదర్శన్ 32 బంతుల్లో 58 పరుగులతో చెలరేగాడు. వీరి దూకుడుకు రాజస్థాన్ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. జీటీ చరిత్రలో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన కావడం విశేషం. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్ఆర్ 20 ఓవర్లలో 214/6 పరుగులు చేసింది. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 47 బంతుల్లో 96 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆకట్టుకోగా.. రవీంద్ర జడేజా 45 పరుగులతో రాణించాడు.


ఇవీ చదవండి:

ఫైనల్ చేరలేకపోయిన రాజస్థాన్ రాయల్స్.. కన్నీళ్లు పెట్టుకున్న వైభవ్

జైస్వాల్‌కు క్షమాపణ చెప్పాలి.. రోహిత్ ఎంపికపై మంజ్రేకర్ తీవ్ర ఆగ్రహం

Updated Date - May 30 , 2026 | 11:09 AM