ఆఖరాటకు టైటాన్స్
ABN , Publish Date - May 30 , 2026 | 02:17 AM
ఐపీఎల్-19వ సీజన్ ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (53 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 104) అద్భుత శతకంతో ఆకట్టుకోగా..
శతక్కొట్టిన శుభ్‌మన్
క్వాలిఫయర్-2లో రాజస్థాన్ ఓటమి
పోరాడిన వైభవ్
ఫైనల్లో గుజరాత్ టైటాన్స్
ముల్లన్‌పూర్: ఐపీఎల్-19వ సీజన్ ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (53 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 104) అద్భుత శతకంతో ఆకట్టుకోగా.. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్2లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్లతో నెగ్గింది. దీంతో మూడోసారి ఫైనల్లోకి అడుగుపెట్టిన గుజరాత్ ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే ఆఖరిపోరులో ఆర్‌సీబీతో తలపడనుంది. గత బుధవారం జరిగిన క్వాలిఫయర్స్ 1లోనూ ఈ రెండు జట్లే తలపడిన విషయం తెలిసిందే. ముందుగా రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ(47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 96), జడేజా (35 బంతుల్లో 45 నాటౌట్), ఫెరీరా (11 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 38 నాటౌట్) రాణించారు. హోల్డర్, రబాడలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో గుజరాత్ 18.4 ఓవర్లలో 219/3 చేసి గెలిచింది. సాయి సుదర్శన్ (32 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 58) రాణించాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా గిల్ నిలిచాడు.
ఓపెనర్ల జోరు: భారీ ఛేదనలో గుజరాత్ తొలి ఓవర్ నుంచే అదరగొట్టింది. ఓపెనర్లు గిల్-సాయి సుదర్శన్ ఎదురుదాడికి రాజస్థాన్ బౌలర్ల దగ్గర సమాధానం లేకపోయింది. వీరి ధాటికి తొలి ఓవర్‌లోనే 19 రన్స్, ఆనక పవర్‌ప్లేలో జట్టు 69 పరుగులతో నిలిచింది. 26 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న సుదర్శన్ కాసేపటికే 13వ ఓవర్‌లో హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ తరహాలో అవుటవడం సాయికిది వరుసగా రెండోసారి. దీంతో తొలి వికెట్‌కు 167 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. తర్వాతి ఓవర్‌లోనే ఫోర్‌తో గిల్ 47 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. ఆర్చర్ అతడిని ఎక్కువసేపు నిలువనీయలేదు. 15వ ఓవర్‌లో ఎల్బీగా వెనక్కిపంపాడు. అప్పటికి గుజరాత్‌కు 30 బంతుల్లో 33 రన్స్ అవసరమవడంతో ఇబ్బంది లేకపోయింది. సుందర్ (16) వేగంగా ఆడి 18వ ఓవర్‌లో వెనుదిరగాడు. అనంతరం తెవాటియా (17 నాటౌట్), బట్లర్ (9 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశారు.

వైభవ్ నిలకడ: టాస్ గెలిచిన రాజస్థాన్ మరో ఆలోచనలేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ ఎలిమినేటర్ మ్యాచ్ మాదిరి వేగం ఈసారి కనిపించలేదు. పిచ్ మరీ బ్యాటింగ్‌కు అనుకూలించేలా కనిపించలేదు. దీంతో వైభవ్‌ను ఆది నుంచే చెలరేగకుండా గుజరాత్ పేసర్లు కట్టడి చేయగలిగారు. అయితే మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా వైభవ్ మాత్రం 18 ఓవర్లపాటు ఓపిగ్గా క్రీజులో పాతుకుపోయాడు. అతడికి జడేజా సహకరించగా, చివర్లో ఫెరీరా బాదుడుకు జట్టు కోలుకుంది. తొలి రెండు ఓవర్లలోనే ఓపెనర్ జైస్వాల్ (1)ను సిరాజ్.. జురెల్ (7)ను రబాడ అవుట్ చేయడంతో జట్టు 9/2 స్కోరుతో నిలిచింది. ఈ స్థితిలో బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా దిగిన జడేజాతో వైభవ్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ప్రసిద్ధ్ ఓవర్‌లో జడ్డూ 6,4,4తో పవర్‌ప్లేలో ఆర్‌ఆర్ 70/2 స్కోరుతో పటిష్టంగా నిలిచింది. అయితే 8వ ఓవర్ ముగిశాక జడ్డూ మోచేతి గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. పరాగ్ వచ్చీ రాగానే జోరు చూపినా హోల్డర్ తన వరుస ఓవర్లలో పరాగ్ (11)తో పాటు షనక (3)ను అవుట్ చేశాడు. 13వ ఓవర్‌లో ఆర్చర్ (7) వెనుదిరగ్గా.. 31 బంతుల్లో వైభవ్ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఆర్చర్ అవుటయ్యాక తిరిగి జడేజా క్రీజులోకి వచ్చాడు. చివరకు 16వ ఓవర్‌లో వైభవ్ 4,6,4తో 16 రన్స్ సాధించగా, తర్వాత సుందర్ ఓవర్‌లోనూ రెండు సిక్సర్లు బాది సెంచరీ వైపు సాగాడు. కానీ కేవలం 4 పరుగుల దూరంలో వైభవ్ వరుసగా రెండో శతకాన్ని మిస్సయ్యాడు. 18వ ఓవర్‌లో రబాడ ఈ వికెట్ తీశాడు. దీంతో జడ్డూతో కలిసి మొత్తంగా 127 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక రషీద్ విసిరిన చివరి ఓవర్‌లో ఫెరీరా 4 సిక్సర్లతో విరుచుకుపడి 27 రన్స్ అందించగా..స్కోరు 200 దాటింది.
స్కోరుబోర్డు
రాజస్థాన్: జైస్వాల్ (సి) ప్రసిద్ధ్ (బి) సిరాజ్ 1, వైభవ్ సూర్యవంశీ (సి) ప్రసిద్ధ్ (బి) రబాడ 96, జురెల్ (సి) గిల్ (బి) రబాడ 7, జడేజా (నాటౌట్) 45, పరాగ్ (సి) రబాడ (బి) హోల్డర్ 11, షనక (సి) బట్లర్ (బి) హోల్డర్ 3, ఆర్చర్ (సి) బట్లర్ (బి) ప్రసిద్ధ్ 7, ఫెరీరా (నాటౌట్) 38, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 20 ఓవర్లలో 214/6; వికెట్ల పతనం: 1-2, 2-9, 3-101, 4-109, 5-118, 6-172; బౌలింగ్: సిరాజ్ 4-0-42-1, రబాడ 4-0-35-2, ప్రసిద్ధ్ 4-0-42-1, వాషింగ్టన్ 2-0-23-0, హోల్డర్ 4-0-27-2, రషీద్ 2-0-45-0.
గుజరాత్: సాయి సుదర్శన్ (హిట్ వికెట్) (బి) బ్రిజేశ్ 58, గిల్ (ఎల్బీ) ఆర్చర్ 104, బట్లర్ (నాటౌట్) 9, వాషింగ్టన్ (సి) ఫెరీరా (బి) బర్గర్ 16, తెవాటియా (నాటౌట్) 17, ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 18.4 ఓవర్లలో 219/3; వికెట్ల పతనం: 1-167, 2-182, 3-201; బౌలింగ్: ఆర్చర్ 4-0-45-1, బర్గర్ 4-0-35-1, బ్రిజేశ్ 3.4-0-44-1, తుషార్ 3-0-34-0, యశ్‌రాజ్ 2-0-29-0, జడేజా 2-0-28-0.
1
ఐపీఎల్ ప్లేఆ్‌ఫ్సలో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం (167) నమోదు చేసిన జోడీగా గిల్-సాయి సుదర్శన్
1
ఐపీఎల్‌లో 90+స్కోరుపై ఒకే సీజన్‌లో ఎక్కువసార్లు (3) అవుటైన బ్యాటర్‌గా వైభవ్ (2026). ఈ జాబితాలో మ్యాక్స్‌వెల్ (2014) కూడా ఉన్నాడు.
ఇవి కూడా చదవండి:
కేన్ విలియమన్స్ వరల్డ్ రికార్డ్
వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్