Share News

వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్

ABN , Publish Date - May 28 , 2026 | 08:40 AM

ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 47 పరుగుల తేడాతో ఓడిన ఎస్ఆర్‌హెచ్.. టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జట్టు ఓటమిపై స్పందించాడు.

వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్
Pat Cummins

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మరోసారి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. 47 పరుగుల తేడాతో ఓడిన ఎస్ఆర్‌హెచ్.. టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జట్టు ఓటమిపై స్పందించాడు. అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


‘వైభవ్ అద్భుతంగా ఆడాడు. అతడికి బౌలింగ్ చేయడానికి పెద్దగా ఆప్షన్లు కనిపించలేదు. అతడిని ఔట్ చేసేందుకు ఎన్ని వ్యూహాలు సిద్ధం చేసినా.. లాభం లేకపోయింది. ఇది బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్.. బౌలర్ యార్కర్ వేయడంలో కాస్త పొరపాటు చేసినా వైభవ్ దాన్ని వదిలిపెట్టడు. ప్రతి బంతిని భారీ షాట్‌గా మలిచేందుకే ప్రయత్నిస్తాడు. వైభవ్ ఆటతీరుని మెచ్చుకోకుండా ఉండలేం’ అని కమిన్స్ వెల్లడించాడు.


మా జట్టు పట్ల గర్వంగా ఉంది..

‘టోర్నీ నుంచి నిష్క్రమించినా ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఈ సీజన్‌లో కుర్రాళ్ల ప్రతిభను వెలికితీశాం. ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ అద్భుతంగా రాణించారు. 240 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే అదృష్టం కూడా కలిసి రావాలి. కానీ కీలక సమయంలో వికెట్లు కోల్పోయాం. అదే మా విజయావకాశాలను దెబ్బతీసింది. అయినప్పటికీ ఆఖరి వరకు పోరాడాం. గత మూడేళ్లలో మేం రెండుసార్లు ప్లే ఆఫ్స్‌కు చేరాం. కొద్ది తేడాతోనే టాప్ 2 ప్లేస్‌ను కోల్పోయాం. ఈ సీజన్‌లో మా జట్టు ఆటతీరు పట్ల గర్వంగా ఉంది. మా కుర్రాళ్లు ఆటను ఆస్వాదించారు’ అని కమిన్స్ తెలిపాడు.


ఇవి కూడా చదవండి:

యూనివర్సల్ బేబీ బాస్ తాండవం.. క్రిస్ గేల్ రికార్డు బద్దలు

గేల్ సెంచరీ రికార్డు ఎందుకు మిస్ అయ్యానంటే..: వైభవ్ సూర్యవంశీ

Updated Date - May 28 , 2026 | 08:40 AM