Share News

వైభవ్‌.. థండర్‌

ABN , Publish Date - May 28 , 2026 | 02:26 AM

ఏంటా బాదుడు.. ఏమా తెగింపు! బంతి పడిందంటే.. రివ్వున ఎగురుతూ బౌండ్రీ ఆవల పడాల్సిందే!! ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్‌ అయినా.. డోంట్‌ కేర్‌ అన్నట్టుగా.. కసిగా విధ్వంసం...

వైభవ్‌.. థండర్‌

నేడు మహిళల తొలి టీ20

భారత్‌ X ఇంగ్లండ్‌

వేదిక: చెమ్స్‌ఫోర్డ్‌ (రాత్రి 11 గం. నుంచి)

వైభవ్‌.. థండర్‌

29 బంతుల్లో 97 త్రుటిలో రికార్డు శతకం మిస్‌

  • కూల్చేసిన ఆర్చర్‌

  • ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌ గెలుపు

సన్‌రైజర్స్‌ అవుట్‌

ఏంటా బాదుడు.. ఏమా తెగింపు! బంతి పడిందంటే.. రివ్వున ఎగురుతూ బౌండ్రీ ఆవల పడాల్సిందే!! ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్‌ అయినా.. డోంట్‌ కేర్‌ అన్నట్టుగా.. కసిగా విధ్వంసం సృష్టించాడు వండర్‌ బాయ్‌ వైభవ్‌. మ్యాచ్‌ ముందు మా ప్లాన్లు మాకున్నాయన్న సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ కమిన్స్‌నైతే.. కనికరం లేకుండా ఉతికి ఆరేశాడు. త్రుటిలో రికార్డు శతకం చేజారినా.. వైభవ్‌ పరుగుల తుఫాన్‌తో రాజస్థాన్‌కు భారీ స్కోరు అందించాడు. బంతితో ఆర్చర్‌ నిప్పులు చెరగడంతో.. సన్‌రైజర్స్‌ను నాకౌట్‌ చేసిన రాజస్థాన్‌.. క్వాలిఫయర్‌-2కు దూసుకెళ్లింది.

ముల్లన్‌పూర్‌: టీనేజ్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ (29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్స్‌లతో 97) విధ్వంసక ఇన్నింగ్స్‌కుతోడు పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ (3/58) నిప్పులు చెరగడంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ నాకౌట్‌ చేసింది. బుధవారం ఏకపక్షంగా సాగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ 47 పరుగులతో గెలిచింది. శుక్రవారం జరిగే ఐపీఎల్‌ క్వాలిఫయర్‌-2లో గుజరాత్‌ టైటాన్స్‌తో రాజస్థాన్‌ అమీతుమీ తేల్చుకోనుంది. తొలుత రాజస్థాన్‌ 20 ఓవర్లలో 243/8 స్కోరు చేసింది. ధ్రువ్‌ జురెల్‌ (21 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) అర్ధ శతకం సాధించాడు. ప్రఫుల్‌ హింగే 3 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో హైదరాబాద్‌ 19.2 ఓవర్లలో 196 పరుగులకే కుప్పకూలింది. నితీశ్‌ కుమార్‌ (38), సలీల్‌ అరోరా (35), ఇషాన్‌ కిషన్‌ (33) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. జడేజా, సుశాంత్‌ మిశ్రా, బర్గర్‌ తలో రెండు వికెట్లు తీశారు. సన్‌రైజర్స్‌ పనిబట్టిన వైభవ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.


7-Sports.jpg

టాప్‌ ఢమాల్‌: భారీ హిట్టర్లున్న సన్‌రైజర్స్‌.. ఛేదనలో ఘోరంగా తడబడింది. ప్రత్యర్థి బ్యాటర్లు చెలరేగిన చోట.. పెవిలియన్‌కు క్యూ కట్టింది. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (0), హెడ్‌ (17)తోపాటు ఇషాన్‌ను కూడా అవుట్‌ చేసిన ఆర్చర్‌.. సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ వెన్నువిరిచాడు. ఇన్నింగ్స్‌ రెండో బంతికే అభిషేక్‌ డకౌటైనా.. వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్‌ ఎడాపెడా షాట్లతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. అయితే, మూడో ఓవర్‌లో రెండు సిక్స్‌లు, బౌండ్రీతో చెలరేగుతున్న కిషన్‌ను కూడా జోఫ్రా వెనక్కిపంపాడు. స్మరణ్‌ (1)ను బర్గర్‌ అవుట్‌ చేయగా.. ఐదో ఓవర్‌లో హెడ్‌ను ఆర్చర్‌ బౌల్డ్‌ చేయడంతో హైదరాబాద్‌ 57/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆదుకొంటాడనుకొన్న క్లాసెన్‌ (18)ను యశ్‌ ఎల్బీగా వెనక్కిపంపాడు. ఈ దశలో నితీశ్‌, సలీల్‌ ఐదో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యంతో ఆశలు రేపారు. కానీ, నితీశ్‌ను జడేజా.. కమిన్స్‌ (1)ను సుశాంత్‌ వెనక్కిపంపడంతో సన్‌రైజన్స్‌ 139/7తో ఓటమి అంచున నిలిచింది. సలీల్‌ను కూడా జడ్డూ అవుట్‌ చేయగా.. శివాంగ్‌ (27) ఓటమి అంతరాన్ని తగ్గించేందుకు యత్నించాడు.

సిక్సర్ల పిడుగు: చిచ్చర పిడుగు వైభవ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగగా.. జురెల్‌ దూకుడు కనబర్చడంతో.. రాజస్థాన్‌ సవాల్‌ విసరగలిగే స్కోరు చేసింది. సూర్యవంశీ సిక్సర్ల హోరుతో ఒకదశలో రాజస్థాన్‌ 300 పరుగులు చేసేలా కనిపించినా.. డెత్‌ ఓవర్లలో 36 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టిన సన్‌రైజర్స్‌.. ప్రత్యర్థి స్కోరును 250 మార్క్‌ చేరకుండా అడ్డుకోగలిగింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్లు జైస్వాల్‌ (29), వైభవ్‌ అదిరే ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 49 బంతుల్లో 125 పరుగుల భాగస్వామ్యంతో పటిష్ట పునాది వేశారు. ముఖ్యంగా సూర్యవంశీ పవర్‌ప్లేలో సిక్స్‌లతో హోరెత్తించగా.. జైస్వాల్‌ అతడికి సహకారం అందించాడు. తొలి రెండు ఓవర్లలో రెండు సిక్స్‌లు బాదిన వైభవ్‌.. మూడో ఓవర్‌లో కమిన్స్‌ బౌలింగ్‌లో బౌండ్రీ, హ్యాట్రిక్‌ సిక్స్‌లతో మొత్తం 25 పరుగులు పిండుకొన్నాడు. ఆ తర్వాతి ఓవర్‌లో సకీబ్‌ బౌలింగ్‌లో మరో మూడు సిక్స్‌లు బాదిన సూర్యవంశీ.. కేవలం 16 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకొన్నాడు. మరోవైపు జైస్వాల్‌ కూడా రెండు ఫోర్లు సాధించడంతో.. ఆరు ఓవర్లకు రాజస్థాన్‌ 80/0తో నిలిచింది.


మధ్య ఓవర్లలో వైభవ్‌ అవుటైనా.. జురెల్‌ జోరుతో స్కోరు బోర్డు దూసుకెళ్లింది. ఏడో ఓవర్‌లో 6,4 బాదిన సూర్యవంశీ.. ఆ తర్వాతి ఓవర్‌లో ప్రఫుల్‌ బౌలింగ్‌లో 6,4,4,6,6తో చెలరేగి 29 పరుగులు రాబట్టాడు. కానీ, ఆఖరి బంతికి మరో భారీ షాట్‌ ఆడే క్రమంలో స్మరణ్‌కు క్యాచివ్వడంతో.. త్రుటిలో రికార్డు శతకాన్ని చేజార్చుకొన్నాడు. జైస్వాల్‌ను శివాంగ్‌ క్యాచవుట్‌ చేశాడు. కానీ, కెప్టెన్‌ పరాగ్‌ (26) క్రీజులోకి వస్తూనే రెండు సిక్స్‌లతో రెచ్చిపోవడంతో.. 11వ ఓవర్‌లోనే స్కోరు 150 దాటింది. మరో ఎండ్‌లో జురెల్‌ కూడా కమిన్స్‌ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, సిక్స్‌తో జోరు చూపాడు. అయితే, 14వ ఓవర్‌లో ప్రఫుల్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో ఫిఫ్టీ సాధించిన జురెల్‌.. ఆ తర్వాతి బంతికి వెనుదిరిగాడు. దీంతో మూడో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే, చివరి ఓవర్లలో పరాగ్‌, షనక (5), ఫెరీరా (12), ఆర్చర్‌ (4), బర్గర్‌ (1)ను అవుట్‌ చేసిన సన్‌రైజర్స్‌.. రాజస్థాన్‌కు కళ్లెం వేసింది.

స్కోరుబోర్డు

రాజస్థాన్‌: జైస్వాల్‌ (సి) అభిషేక్‌ (బి) శివాంగ్‌ 29, వైభవ్‌ సూర్యవంశీ (సి) స్మరణ్‌ (బి) ప్రఫుల్‌ 97, జురెల్‌ (సి) నితీశ్‌ (బి) ప్రఫుల్‌ 50, పరాగ్‌ (సి) క్లాసెన్‌ (బి) ప్రఫుల్‌ 26, ఫెరీరా (రనౌట్‌) 12, షనక (సి) అభిషేక్‌ (బి) మలింగ 5, జడేజా (నాటౌట్‌) 12, ఆర్చర్‌ (సి) అభిషేక్‌ (బి) నితీశ్‌ 4, బర్గర్‌ (రనౌట్‌) 1, సుశాంత్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 243/8; వికెట్ల పతనం: 1-125, 2-137, 3-192, 4-207, 5-214, 6-234, 7-238, 8-240; బౌలింగ్‌: కమిన్స్‌ 4-0-64-0, మలింగ 4-0-40-1, సకీబ్‌ 4-0-52-0, ప్రఫుల్‌ హింగే 4-0-54-3, శివాంగ్‌ 2-0-19-1, నితీశ్‌ 2-0-12-1.


సన్‌రైజర్స్‌: అభిషేక్‌ (సి) జురెల్‌ (బి) ఆర్చర్‌ 0, హెడ్‌ (బి) ఆర్చర్‌ 17, ఇషాన్‌ (సి) ఫెరీరా (బి) ఆర్చర్‌ 33, స్మరణ్‌ (సి) ఆర్చర్‌ (బి) బర్గర్‌ 1, క్లాసెన్‌ (ఎల్బీ) యశ్‌రాజ్‌ 18, నితీశ్‌ (సి) షనక (బి) జడేజా 38, సలీల్‌ (సి) బర్గర్‌ (బి) జడేజా 35, కమిన్స్‌ (సి) ఆర్చర్‌ (బి) సుశాంత్‌ మిశ్రా 1, శివాంగ్‌ (సి) వైభవ్‌ (బి) సుశాంత్‌ మిశ్రా 27, మలింగ (సి) ఆర్చర్‌ (బి) బర్గర్‌ 5, సకీబ్‌ (నాటౌట్‌) 5, ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 19.2 ఓవర్లలో 196 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-0, 2-51, 3-52, 4-57, 5-81, 6-137, 7-139, 8-163, 9-187, 10-196; బౌలింగ్‌: ఆర్చర్‌ 4-0-58-3, బర్గర్‌ 3-0-26-2, బ్రిజేశ్‌ 3-0-31-0, యశ్‌ రాజ్‌ 4-0-39-1, సుశాంత్‌ మిశ్రా 2.2-0-21-2, జడేజా 3-0-21-2.

1

ఓ సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా వైభవ్‌ (65). గేల్‌ 59 సిక్స్‌ల రికార్డును చిన్నోడు అధిగమించాడు

ఇవి కూడా చదవండి:

రాజస్థాన్‌తో మ్యాచ్.. ఎస్ఆర్‌హెచ్‌లో వారిద్దరిపై వేటు!

సినిమాను మించిన ట్విస్టులతో సాగిన స్టార్ క్రికెటర్ లవ్ స్టోరీ!

Updated Date - May 28 , 2026 | 02:26 AM