Share News

గేల్ సెంచరీ రికార్డు ఎందుకు మిస్ అయ్యానంటే..: వైభవ్ సూర్యవంశీ

ABN , Publish Date - May 28 , 2026 | 07:54 AM

ఎస్ఆర్‌హెచ్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 97 పరగులు చేసి ఔటయ్యాడు. దీంతో క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యంత వేగవంతమైన ఐపీఎల్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టే అవకాశాన్ని కేవలం మూడు పరుగుల తేడాతో చేజార్చుకున్నాడు. మ్యాచ్ అనంతరం ఈ విషయంపై వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

గేల్ సెంచరీ రికార్డు ఎందుకు మిస్ అయ్యానంటే..: వైభవ్ సూర్యవంశీ
Vaibhav Sooryavanshi

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 47 పరగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అవ్వగా.. ఆర్ఆర్ క్వాలిఫయర్ 2కి అర్హత సాధించింది. ఈ కీలక మ్యాచ్‌లో ఆర్ఆర్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తుఫాన్ ఇన్నింగ్స్‌తో అభిమానులను ఉర్రూతలూగించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడిన ఈ 15 ఏళ్ల ఓపెనర్.. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యంత వేగవంతమైన ఐపీఎల్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టే అవకాశాన్ని కేవలం మూడు పరుగుల తేడాతో చేజార్చుకున్నాడు. మ్యాచ్ అనంతరం ఈ విషయంపై వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


‘ఈ పోరులో మేము గెలవడమే ముఖ్యం. అయితే బ్యాటింగ్ చేసే సమయంలో గేల్ సెంచరీ రికార్డు గురించి ప్రత్యేకంగా ఆలోచించలేదు. ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును బ్రేక్ చేస్తానా? తొందర లేకుండా సింగిల్స్ తీస్తే సరిపోయేదా? అనే విషయాలేవీ నేను పట్టించుకోలేదు. ఫీల్డర్‌ను చూసి ఆ షాట్ ఆడాను. థర్డ్ మ్యాన్ వైపు కొట్టుంటే బంతి సిక్స్ వెళ్లి ఉండేది. కానీ స్ట్రెయిట్‌గా ఆడేందుకు ప్రయత్నించాను. అందుకే టైమింగ్ మిస్ అయింది. ప్రస్తుతం ఐపీఎల్ ట్రోఫీ గెలవడమే నా ముందున్న లక్ష్యం. సెంచరీలు, రికార్డులు.. ఇవన్నీ భవిష్యత్తులో బ్రేక్ చేయొచ్చు. మైలురాయిల కోసం ఆలోచించడం మొదలుపెడితే.. నా కెరీర్‌లో నేను సక్సెస్ అవ్వలేను. ఒకవేళ 99 మీద బ్యాటింగ్ చేస్తున్నా.. అదే షాట్ కొట్టడానికి ప్రయత్నిస్తా. నాకు సెంచరీలు చేయడం కన్నా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడమే ఇష్టం. కొన్నిసార్లు 100 పరుగుల కంటే 97 పరుగులు కూడా ఆనందాన్ని ఇస్తాయి. ఇలాంటి కీలక పోరులో ఒత్తిడి ఉండటం సహజం. కానీ మా కోచ్‌లు ఫ్రీగా ఆడమని, గేమ్‌ను ఆస్వాదించమని చెప్పారు. అదే పాటించాను’ అని వైభవ్ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు.


ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ ఆరంభం నుంచే సన్‌రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మొదట ప్యాట్ కమిన్స్ డీప్ స్క్వేర్ లెగ్, డీప్ మిడ్‌వికెట్ ఫీల్డర్లను పెట్టి కట్టడి చేయాలని ప్రయత్నించినా.. వైభవ్ దూకుడు ముందు ఆ వ్యూహం ఫలించలేదు. ఈ మ్యాచ్‌లో వైభవ్ కేవలం 16 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో 12 బంతుల్లోనే 97 పరుగులకు చేరుకున్నాడు. సెంచరీ ఖాయమనే సమయంలో ప్రఫుల్ హింగే వేసిన బంతిని అప్పర్‌కట్ ఆడే ప్రయత్నంలో డీప్ థర్డ్‌మ్యాన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికి రాజస్థాన్ స్కోరు 8 ఓవర్లలో 125/1గా ఉంది. వైభవ్ ఔటైన తర్వాత కూడా రాజస్థాన్ దూకుడు తగ్గలేదు. ధ్రువ్ జురెల్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి సన్‌రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. చివర్లో వికెట్లు వరుసగా పడినా.. డొనోవాన్ ఫెరీరా, రవీంద్ర జడేజా వేగంగా పరుగులు జోడించడంతో రాజస్థాన్ 243 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఛేదనలో ఎస్ఆర్‌హెచ్ 196 పరుగులకే కుప్పకూలింది.


ఇవి కూడా చదవండి:

రాజస్థాన్‌తో మ్యాచ్.. ఎస్ఆర్‌హెచ్‌లో వారిద్దరిపై వేటు!

సినిమాను మించిన ట్విస్టులతో సాగిన స్టార్ క్రికెటర్ లవ్ స్టోరీ!

Updated Date - May 28 , 2026 | 08:07 AM