ఐపీఎల్ ఫైనల్ వేదికపై అనిశ్చితి.. బెంగళూరుకు ఛాన్స్ లేనట్టేనా!
ABN , Publish Date - May 06 , 2026 | 08:09 AM
ఐపీఎల్ తుది దశకు చేరుతున్నా.. ఫైనల్ వేదికపై అనిశ్చితి కొనసాగుతోంది. ఆనవాయితీ ప్రకారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. అక్కడి రాజకీయ పరిణామాలు ఆటంకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ తుది దశకు సమీపిస్తున్న తరుణంలో ప్లేఆఫ్స్, ఫైనల్ వేదికలపై ఉత్కంఠ నెలకొంది. ఫైనల్ మ్యాచ్ వేదికపై బీసీసీఐ త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నప్పటికీ.. అది బెంగళూరులో జరుగుతుందా లేదా అన్నదానిపై అనిశ్చితి నెలకొంది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. ఈసారి ప్లేఆఫ్ మ్యాచ్‌లను పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లో నిర్వహించే అవకాశముంది. వాస్తవానికి డిఫెండింగ్ ఛాంపియన్ హోమ్‌గ్రౌండ్‌లోనే ఫైనల్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ లెక్కన గత సీజన్‌లో ఆర్సీబీ విజేతగా నిలవడంతో ఈ ఏడాది ఫైనల్ మ్యాచ్‌కు చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ.. అక్కడి రాజకీయ పరిణామాలు దీనిపై ప్రభావం చూపేలా ఉన్నాయి.
ఎమ్మెల్యేలకు ఐపీఎల్ టికెట్ల కేటాయింపుపై ఇటీవల అక్కడ వివాదం చెలరేగింది. తాము ప్రజా ప్రతినిధులం కావున తమకు కనీసం 5 టికెట్లు కేటాయించాలని ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దీనిపై డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ స్పందిస్తూ.. ఎమ్మెల్యేలు, ఎంపీలకు మూడేసి టికెట్లు ఇస్తామని తెలిపారు. మరోవైపు.. ఎమ్మెల్యేలు టికెట్లను దుర్వినియోగం చేశారనే ఆరోపణలను ఆ రాష్ట్ర హోం మంత్రి ఖండించారు. టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ అవుతున్నాయని, అవి బదిలీ చేయలేనివని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదం ఇలాగే కొనసాగితే ఫైనల్ వేదికను మరోచోటుకు మార్చే అవకాశముందని బీసీసీఐ సంకేతాలిస్తోంది. ఈ నేపథ్యంలో ఫైనల్ వేదికపై తుది నిర్ణయం కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక.. ఐపీఎల్ మ్యాచ్‌ల విషయానికొస్తే ఈ సీజన్ లీగ్ దశలో తీవ్ర పోటీ నెలకొంది. పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు 12 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి. 10 పాయింట్లతో చెన్నై సూపర్ కింగ్స్ 6వ స్థానంలో కొనసాగుతుండగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఉన్నాయి. 9, 10 స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు ప్లేఆఫ్ ఆశలను నిలబెట్టుకునేందుకు శ్రమిస్తున్నాయి.
ఇవీ చదవండి: