Share News

ఐపీఎల్‌లో ఏవీ.. ఆ యార్కర్లు?

ABN , Publish Date - May 06 , 2026 | 01:42 AM

ఒకప్పుడు టీ20 క్రికెట్‌లో డెత్‌ ఓవర్లు అంటే.. యార్కర్లతో బ్యాటర్లను బెంబేలెత్తించేవారు. అందుకోసం స్పెషలిస్ట్‌ బౌలర్‌వైపే కెప్టెన్‌ చూసేవాడు. కానీ, ఐపీఎల్‌లో మాత్రం...

 ఐపీఎల్‌లో ఏవీ.. ఆ యార్కర్లు?

ఒకప్పుడు టీ20 క్రికెట్‌లో డెత్‌ ఓవర్లు అంటే.. యార్కర్లతో బ్యాటర్లను బెంబేలెత్తించేవారు. అందుకోసం స్పెషలిస్ట్‌ బౌలర్‌వైపే కెప్టెన్‌ చూసేవాడు. కానీ, ఐపీఎల్‌లో మాత్రం యార్కర్‌కు కఠిన సవాలే ఎదురవుతోంది. పక్కా బ్యాటింగ్‌ పిచ్‌లు సిద్ధంచేస్తున్న పరిస్థితుల్లో ర్యాంప్‌ షాట్లు, రివర్స్‌ స్కూప్‌లతో చెలరేగుతుండడంతో అంతిమ ఓవర్లలో ప్రధానాస్త్రంగా భావించే యార్కర్‌కు కాలం చెల్లిందనే టాక్‌ వినిపిస్తోంది. ఒకప్పుడు బ్యాటర్లను బెంబేలెత్తించిన యార్కర్‌.. ఇటీవలి కాలంలో హైరిస్క్‌ డెలివరీగా మారింది. బ్యాటింగ్‌ విప్లవంలో యార్కర్‌ కనుమరుగవు తుందా? అనే అనుమానం ఐపీఎల్‌ మ్యాచ్‌లను చూస్తుంటే కలుగుతోంది.

విన్యాసాలు చేస్తుండడంతో..

క్రీజులో కదలకుండా నిలబడే సమయంలో యార్కర్లు భయపెట్టాయని.. కానీ, ఇప్పుడు బ్యాటర్లు విన్యాసాలు చేస్తుండడంతో సరికొత్తగా ఆలోచించాల్సి వస్తోందని భారత మాజీ వికెట్‌ కీపర్‌ దీప్‌దాస్‌ గుప్తా చెప్పాడు. అందుకే ప్రముఖ బౌలర్లు మూస ధోరణిని వీడి.. వైవిధ్యంతో కూడిన స్లో బంతులు, స్వింగ్‌తోపాటు బ్యాటర్లను బోల్తా కొట్టించే యాంగిల్స్‌లో వేస్తూ ప్రయోగాలు చేస్తున్నారు. బ్యాటర్‌ను ఆశ్చర్యపరచే విధంగా అప్పుడప్పుడు యార్కర్లు సంధిస్తున్నారు. కాగా, భారత యువ బౌలర్లు అన్షుల్‌ కాంబోజ్‌ (సీఎ్‌సకే), వైశాక్‌ విజయ్‌ కుమార్‌ (పంజాబ్‌), కార్తీక్‌ త్యాగి (కోల్‌కతా) వైడ్‌ యార్కర్లతో బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. ‘రివర్స్‌ స్వింగ్‌ లభిస్తుంటే యార్కర్‌ కంటే మంచి బాల్‌ మరోటి ఉండదు. నా దృష్టిలో వైడ్‌ యార్కర్లు వేయడంపై పట్టుసాధించడం చాలా కష్టం’ అని టీమిండియా మాజీ స్పిన్నర్‌ శరణ్‌దీప్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

లోపాలు బహిర్గతం..

లసిత్‌ మలింగ, బుమ్రాలాంటి వారు యార్కర్లు వేయడంలో తమదైన ప్రతిభను ప్రదర్శించారు. కానీ, మెగా లీగ్‌లో బుమ్రా ధారాళంగా పరుగులు సమర్పించుకొంటున్నాడు. అతడి పదునైన యార్కర్‌లను కూడా బ్యాటర్లు అలవోకగా బౌండ్రీ ఆవలకు తరలిస్తున్నారు. అయితే, యార్కర్‌ను సంధించే సమయంలో ఖచ్చితత్వం ఎంతో అవసరమని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ మదన్‌లాల్‌ అన్నాడు. ఏ చిన్నతేడా జరిగినా.. లో ఫుల్‌టాస్‌ పడుతుందని చెప్పాడు. కాగా, ఐపీఎల్‌ అనేది యార్కర్లను చంపేయలేదని, అందులోని లోపాలను మాత్రమే బహిర్గతం చేసిందని క్రీడా పండితులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్

ఆటకు డబ్బుతో సంబంధమే లేదు.. పంత్ ఆటతీరుపై ఎల్ఎస్‌జీ కోచ్ రియాక్షన్

Updated Date - May 06 , 2026 | 01:42 AM