Share News

ఆటకు డబ్బుతో సంబంధమే లేదు.. పంత్ ఆటతీరుపై ఎల్ఎస్‌జీ కోచ్ రియాక్షన్

ABN , Publish Date - May 05 , 2026 | 02:36 PM

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. గతేడాది వేలంలో అతడిని లఖ్‌నవూ ఫ్రాంచైజీ రూ.27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. తాను పొందిన భారీ ధరకు పంత్ ఏమాత్రం న్యాయం చేయట్లేదంటూ సోషల్ మీడియలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎల్ఎస్‌జీ కోచ్ జస్టిన్ లాంగర్ స్పందించాడు.

ఆటకు డబ్బుతో సంబంధమే లేదు.. పంత్ ఆటతీరుపై ఎల్ఎస్‌జీ కోచ్ రియాక్షన్
Justin Langer

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్ చేతిలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. ఎల్ఎస్‌జీ 228 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ.. దానిని డిఫెండ్ చేసుకోవడంలో తీవ్రంగా విఫలమైంది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న లఖ్‌నవూ ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతు అయినట్లే! ఇదిలా ఉంటే, లఖ్‌నవూ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ సీజన్‌లో అటు కెప్టెన్‌గానూ, ఇటు బ్యాటర్‌గానూ అత్యంత పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. బ్యాటర్‌గా 9 ఇన్నింగ్స్‌ల్లో 204 పరుగులు మాత్రమే చేయగా.. అతడి సారథ్యంలో లఖ్‌నవూ తొమ్మిది మ్యాచుల్లో కేవలం రెండింట్లోనే విజయం సాధించింది. గతేడాది వేలంలో పంత్‌ను లఖ్‌నవూ ఫ్రాంచైజీ రూ.27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. తాను పొందిన భారీ ధరకు పంత్ ఏమాత్రం న్యాయం చేయట్లేదంటూ సోషల్ మీడియలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎల్ఎస్‌జీ కోచ్ జస్టిన్ లాంగర్ స్పందించాడు. పంత్‌కు మద్దతుగా నిలిచాడు.


‘రెండు రోజుల క్రితం ప్రాక్టీస్ మ్యాచ్‌లో పంత్ అద్భుతంగా ఆడాడు. సుమారు 30 బంతుల్లో 95 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్ చూసి అతడు తిరిగి పుంజుకున్నాడని అనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు ఆ దూకుడును ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కొనసాగించలేకపోయాడు. నిజాయతీగా చెప్పాలంటే ఆటకు డబ్బుతో ఏమాత్రం సంబంధం లేదు. నాయకత్వం అనేది ఒక కఠినమైన బాధ్యత. దాంతో పాటు ఎంతో ఒత్తిడి ఉంటుంది. జట్టు కోసం పంత్ ఎంతో ఒత్తిడిని భరిస్తున్నాడు. మా అందరిలాగే 98 శాతం సమయం అతడు చిరునవ్వుతోనే తన బాధ్యతను నిర్వర్తిస్తాడు. మిగిలిన 2 శాతం సమయం మాత్రం పరిస్థితి కాస్త కఠినంగానే ఉంటుంది. అయినప్పటికీ పంత్ తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. కఠోరంగా శ్రమిస్తున్నాడు. ఈ సీజన్ ఆరంభంలో జట్టుకు విజయాన్ని అందించే ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడు నవ్వుతూ తనదైన శైలిలో దూకుడుగా ఆడినప్పుడు మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఆ స్థాయి ప్రదర్శనకు అతడు ఎంతో దూరంలో లేడు. అత్యంత త్వరలోనే పంత్ ఫామ్‌లోకి వస్తాడు. ఆ నమ్మకం మాకుంది’ అని జస్టిన్ లాంగర్ పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

ముంబై చేతిలో ఓటమిపై స్పందించిన పంత్..

జస్ప్రీత్ బుమ్రాపై సునీల్ గావస్కర్ ఆగ్రహం.. ఎందుకంటే?

Updated Date - May 05 , 2026 | 03:05 PM