జస్ప్రీత్ బుమ్రాపై సునీల్ గావస్కర్ ఆగ్రహం.. ఎందుకంటే?
ABN , Publish Date - May 05 , 2026 | 09:58 AM
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ముంబై విజయం సాధించినప్పటికీ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న(సోమవారం) జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ముంబై విజయం సాధించినప్పటికీ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కీలక సమయంలో బుమ్రా నోబాల్స్ వేయడంపై లిటిల్ మాస్టర్ మండిపడ్డాడు. బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ నోబాల్స్ వేయడం అమోదయోగ్యం కాదని అసహనం వ్యక్తం చేశాడు.
లఖ్‌నవూ ఇన్నింగ్స్ బుమ్రా వేసిన 14వ ఓవర్‌లో హిమ్మత్ సింగ్ ర్యాన్ రికెల్టన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అయితే, సైరన్ మోగడంతో అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో హిమ్మత్ సింగ్ బతికిపోయి 40 పరుగులు చేశాడు. ఈ క్రమంలో లఖ్‌నవూ 229 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన గావస్కర్.. బుమ్రా నోబాల్స్ వేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 క్రికెట్‌లో అతని స్థాయి వ్యక్తి నో బాల్స్ వేయడం అనేది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇంకాస్త ప్రొఫెషనలిజం చూపాలన్నాడు. 'మరోసారి నాకు చెప్పకండి. బుమ్రా ఒక ప్రొఫెషనల్ క్రికెటర్, అతడి నుంచి నోబాల్స్ ఏ మాత్రం అంగీకరించనంటూ గావస్కర్ తన కామెంట్రీలో అసహనం వ్యక్తం చేశాడు.
బుమ్రా వరుసగా నో బాల్స్ వేయడంపై ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే, బౌలింగ్ కోచ్ లసిత్ మలింగ సైతం ఆశ్చర్యపోయారు. ఈ మ్యాచ్‌లో బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. 4 ఓవర్లలో 45 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా కేవలం 3 వికెట్లు మాత్రమే తీశాడు. గతంలో తన బౌలింగ్‌తో ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన బుమ్రా.. తాజా సీజన్‌లో పూర్తిగా చేతులెత్తేశాడు.
ఇవి కూడా చదవండి:
'జై శ్రీరామ్' నోట్ చూపిన ముంబై స్పిన్నర్
చారిత్రక సిరీస్‌లో పసికూనపై పాకిస్థాన్ ప్రతాపం