Share News

కమలం విజయం

ABN , Publish Date - May 05 , 2026 | 07:03 AM

పశ్చిమ బెంగాల్‌ నుంచి తమిళనాడు వరకు భారతదేశానికి తూర్పుతీరం.. ఇందులో కింద తమిళనాట కొత్త ‘తార’ ఆవిర్భవిస్తే.. పైన పశ్చిమ బెంగాల్లో కొత్త శకం మొదలైంది! ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు...

కమలం విజయం

  • బెంగాల్‌ కంచుకోటలో..కమలం తమిళ జననాయగన్‌..విజయం

  • అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పెను సంచలనాలు

  • జెన్‌జీ యువత, మహిళలు రచించిన విజయాలు

  • తమిళనాట అతి పెద్ద పార్టీగా విజయ్‌ టీవీకే

  • డీఎంకేకు పరాభవం.. అన్నాడీఎంకేకు 3వ స్థానం

  • ద్రవిడ సిద్ధాంతం స్థానంలోకి ప్రజాకర్షక మంత్రం

  • బెంగాల్లో మమతా బెనర్జీని చిత్తు చేసిన బీజేపీ

  • హిందూ ఏకత, ముస్లిముల్లో చీలిక వ్యూహం సక్సెస్‌

  • దక్షిణ బెంగాల్లో కొన్నిచోట్ల బీజేపీకి ముస్లింల మద్దతు

  • ఉచిత వరాలతో కమలానికి ఓటెత్తిన మహిళలు

  • ఎమ్మెల్యే సీట్లలోనూ స్టాలిన్‌, మమత పరాజయం

  • వంద చోట్ల ఓట్‌ చోరీ.. ఇది అనైతిక విజయం: దీదీ

  • కేరళంలో ఎల్డీఎఫ్‌కు దెబ్బ.. యూడీఎఫ్‌దే గెలుపు

  • అసోంలో హిమంత బిశ్వ శర్మ హ్యాట్రిక్‌

  • పుదుచ్చేరిలో మళ్లీ ఎన్డీయేదే అధికారం

  • మూడు ప్రధాన రాష్ట్రాల్లో అధికార పార్టీల ఓటమి

సైలెంట్‌ సెల్యూట్‌

టీవీకే సంచలన విజయంపై ఆ పార్టీ అధినేత విజయ్‌ స్పందించలేదు. ఓట్ల లెక్కింపు జరుగుతున్నప్పుడు గానీ.. ఫలితాలు వెలువడ్డాక గానీ ఆయన మీడియాతో మాట్లాడలేదు. ఆయన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ మాత్రమే మాట్లాడారు. పోటీచేసిన 2 స్థానాల్లోనూ గెలిచిన విజయ్‌.. ఎమ్మెల్యేగా ఎన్నికైన ధ్రువపత్రం తీసుకోవడానికి పెరంబూర్‌ కౌంటింగ్‌ కేంద్రానికి వచ్చారు. అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ లోపలకు వెళ్లారు. ఆ తర్వాత తన తండ్రి ఇంటికి చేరుకుని.. బాల్కనీ నుంచి కింద ఉన్న టీవీకే కార్యకర్తలకు అభివాదం చేశారు.

గంగోత్రి నుంచి గంగాసాగర్‌ దాకా దేశంలో ప్రతిచోటా కమలం వికసిస్తోంది. గంగామాత ప్రవహిస్తున్న ప్రతిచోటా బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీ సుపరిపాలన రాజకీయాలు ఘనవిజయం సాధించాయి. ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. వారి కలల్ని, ఆకాంక్షలను నెరవేరుస్తాం. ఈ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తమిళనాడు, కేరళలో విజయం సాధించిన పార్టీలకు అభినందనలు. ఆ రాష్ట్రాల అభివృద్ధికి మా సహకారం కొనసాగుతుంది.

- ప్రధాని నరేంద్రమోదీ

సినిమాల్లో ఆయన ‘మాస్టర్‌’! అభిమానులను ‘ఖుషీ’ చేశారు! తన నటనతో ‘అదిరింది’ గురూ అనిపించుకున్నారు! రాజకీయాల్లోకి అడుగు పెడుతూనే ‘విజిల్‌’ వేశారు! అరంగేట్రంతోనే ద్రవిడ పార్టీలను మట్టి కరిపించి ‘బీస్ట్‌’ అనిపించుకున్నారు! అభిమానులకే కాదు.. తమిళ ప్రజలకే ‘జన నాయగన్‌’గా మారారు! తమిళనాట కొత్త చరిత్ర లిఖిస్తూ రేపో మాపో ‘సర్కార్‌’ ఏర్పాటు చేయనున్నారు! ఆయనే.. తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి దళపతి విజయ్‌!

అది ఒకప్పుడు కమ్యూనిస్టుల కోట! దశాబ్దాలపాటు వాళ్లే అప్రతిహతంగా రాజ్యమేలారు! దశాబ్దంన్నరగా మమతా బెనర్జీకి కంచుకోటగా మారింది! ఆ సమయంలో పంచాయతీలోనైనా కాషాయ జెండా ఇక్కడ ఎగరడమే గగనమని అనుకున్నారంతా! కానీ, కమ్యూనిస్టుల పతనం ఇక్కడ కాషాయానికి ఊపిరిపోసింది! 2016లో కేవలం మూడు సీట్లతో ప్రారంభమైన బీజేపీ.. ఇప్పుడు ఏకంగా 206 సీట్లతో సర్కారు ఏర్పాటుకు సిద్ధమైంది! తూర్పున కూడా కాషాయోదయంతో కమలం విరిసింది!!

భారతదేశ రాజకీయ, ఎన్నికల చరిత్రలో నిలిచిపోయే రెండు సందర్భాలివి!


పశ్చిమ బెంగాల్‌ నుంచి తమిళనాడు వరకు భారతదేశానికి తూర్పుతీరం.. ఇందులో కింద తమిళనాట కొత్త ‘తార’ ఆవిర్భవిస్తే.. పైన పశ్చిమ బెంగాల్లో కొత్త శకం మొదలైంది! ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించారు! 4 దశాబ్దాల కిందటి టీడీపీ విజయాన్ని తలపించేలా.. సినీ నటుడు విజయ్‌ నేతృత్వంలోని ‘తమిళిగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ ప్రారంభమైన రెండేళ్లలోనే అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం సృష్టించింది! తమిళనాడు అసెంబ్లీ (234 సీట్లు) ఎన్నికల్లో 107 స్థానాలతో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది! టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు చిన్న పార్టీలు సుముఖత చూపుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు జోసెఫ్‌ విజయ్‌ సీఎం కావడం లాంఛనమే! ఇక, పశ్చిమ బెంగాల్లో అధికార పగ్గాలు చేపట్టాలన్న కలను బీజేపీ ఎట్టకేలకు నెరవేర్చుకుంది! ఇక్కడి అసెంబ్లీలో 294 స్థానాలు ఉండగా.. బీజేపీ ఏకంగా 206 సీట్లలో విజయ దుందుభి మోగించింది. మమతా బెనర్జీని మట్టి కరిపించిన సువేందు అధికారి ఇక్కడ సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నారు! అర్ధ శతాబ్దంపాటు వామపక్షాలు, టీఎంసీ ఏలిన బెంగాల్లో తొలిసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది! ఇక, కేరళంలో వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ అధికారం కోల్పోయింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (యూడీఎఫ్‌) ఘన విజయం సాధించింది. ఇక్కడి అసెంబ్లీలోని 140 సీట్లలో యూడీఎఫ్‌ ఏకంగా 102 సీట్లను చేజిక్కించుకుంది! తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఊరట అంటూ ఏదైనా ఉందంటే అది కేరళంలో విజయమే! అలాగే, అసోంలో హిమంత బిశ్వ శర్మ హ్యాట్రిక్‌ సాధిస్తే.. పుదుచ్చేరిలో ఎన్డీయే మరోసారి పాగా వేసింది! ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో మూడు బీజేపీ ఖాతాలోనే పడడం విశేషం!!


చరిత్ర సృష్టించిన జెన్‌జీ, మహిళలు

శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ జన్మభూమి పశ్చిమ బెంగాల్లో అధికారం.. బీజేపీ రెండు దశాబ్దాల కల! అందుకే, ఈసారి ఇక్కడ అధికారం చేజిక్కించుకోవడానికి ఆ పార్టీ తన శక్తినంతా ధారపోసింది! ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రతి దశలోనూ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది! ఫిరాయింపుదార్లకు టికెట్లు ఇవ్వలేదు. క్షేత్రస్థాయిలో పట్టున్న వారిని మాత్రమే అభ్యర్థులుగా నిలిపింది! గత ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో స్వల్ప తేడాలతోనే ఓటమి పాలైంది. అందుకే, ఈసారి ఆయా నియోజకవర్గాలను మూడు (బలమైనవి, దృష్టి సారించాల్సినవి, బలహీనం) క్యాటగిరీలుగా వర్గీకరించింది. అన్ని నియోజక వర్గాల్లోనూ పన్నా ప్రముఖ్‌లు కీలక పాత్ర పోషించారు. శక్తి కేంద్రాల ఏర్పాటుతో ఓటర్లను పెద్దఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు! పశ్చిమ బెంగాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్‌ కావడానికి ఇదే ప్రధాన కారణంగా చెబుతున్నారు! కొన్నేళ్ల కిందటి నుంచే ఆరెస్సెస్‌ ఇక్కడ క్షేత్రస్థాయిలో క్రియాశీలంగా మారింది! అంతేనా.. ఇక్కడ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అమిత్‌ షా పూర్తిస్థాయిలో పర్యవేక్షించారు! రాష్ట్రంలోని 44,000 పోలింగ్‌ కేంద్రాల పరిధిలోని సమావేశాలను ఆయన స్వయంగా పర్యవేక్షించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! ఇక, ప్రచారంలోనూ బీజేపీ వినూత్న పంథానే అనుసరించింది! ముఖ్యమంత్రి మమతా బెనర్జీని పెద్దగా విమర్శించకుండా ఎమ్మెల్యేలను టార్గెట్‌ చేసింది! ప్రతి ఎమ్మెల్యే అవినీతిపైనా చార్జిషీట్లు విడుదల చేసింది. వీటన్నిటికీతోడు ప్రజలను ఆకర్షించడానికి చేతికి ఎముకే లేనట్టుగా ఉచిత హామీలను గుప్పించింది! గెలుపే లక్ష్యంగా ఓవైపు హిందూ ఓటర్ల ఏకీకరణ చేపడుతూనే.. మరోవైపు, మమతా బెనర్జీకి గుండెకాయ వంటి ముస్లిముల్లో చీలిక తీసుకొచ్చింది! కేవలం మహిళలే లక్ష్యంగా బీజేపీ ప్రకటించిన ఉచిత హామీలకు తోడు ట్రిపుల్‌ తలాక్‌ వంటి విధానాలతో ముస్లిం మహిళల్లో కొందరు బీజేపీకి ఓటేశారని విశ్లేషకులు వివరిస్తున్నారు. దక్షిణ బెంగాల్లోని నియోజకవర్గాల్లోనూ బీజేపీ విజయ దుందుభిని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. అక్కడ 38మహిళా ప్రాబల్య నియోజకవర్గాలుంటే 30కిపైగా సెగ్మెంట్లలో బీజేపీ హవానే నడిచిందని విశ్లేషిస్తున్నారు.


వెరసి, 15 ఏళ్లపాటు పట్టువిడువని పక్కా వ్యూహంతో పశ్చిమ బెంగాల్‌లో అద్వితీయ విజయాన్ని బీజేపీ దక్కించుకుంది! అదే సమయంలో, తమిళనాట పెను సంచలనం సృష్టించిన విజయ్‌దీ సుదీర్ఘ వ్యూహమే! సినిమాల్లో సూపర్‌ హిట్‌ అయిన ఆయన 2009లోనే ఆ రాష్ట్రవ్యాప్తంగా ‘విజయ్‌ మక్కళ్‌ ఇయక్కం’ (వీఎంఐ) పేరిట 85 వేల ఫ్యాన్‌ క్లబ్‌లను ఏర్పాటు చేశారు. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేకు మద్దతు ఇచ్చారు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వీఎంఐ తరఫున ఆయన అభిమానులు ఎన్నికల బరిలో నిలిచారు. అప్పటి నుంచే విజయ్‌ పార్టీ ఏర్పాటుపై ఊహాగానాలు మొదలయ్యాయి. చివరకు, రెండేళ్ల కిందట 2024 ఫిబ్రవరిలో టీవీకే పేరిట విజయ్‌ పార్టీ ఏర్పాటు చేశారు! నిజం చెప్పాలంటే, పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచీ ఆయనకు అన్నీ ఎదురు దెబ్బలే. కరూర్‌ సభలో తొక్కిసలాటతో 41 మంది దుర్మరణం పాలయ్యారు. సరిగ్గా ఎన్నికలు దగ్గరకు వచ్చినప్పుడు భార్య విడాకులకు దరఖాస్తు చేశారు. ఆయన నటించిన జన నాయగన్‌ సినిమా విడుదల ఆగిపోయింది. వీటన్నిటి నేపథ్యంలో ఆయన పెద్దగా ప్రచారమూ చేయలేదు. కానీ, ఎన్నికల ప్రచారం మొత్తాన్ని ఆయన అభిమానులే నడిపించారు. ఆయన ప్రకటించిన ఉచిత పథకాలకుతోడు జెన్‌జీ యువత, మహిళలు విజయ్‌ను అక్కున చేర్చుకున్నారు.


అందుకే, సినిమా నటులపై ఆకర్షణ తారస్థాయిలో ఉండే తమిళనాట ఎంజీఆర్‌, అన్నాదురై, జయలలిత తర్వాత అరంగేట్రంలోనే విజయ్‌ అదుర్స్‌ అనిపించారు! అటు ద్రవిడ సిద్ధాంతమూ కాకుండా ఇటు ద్రవిడ వ్యతిరేక సిద్ధాంతమూ కాకుండా కేవలం ప్రజాకర్షక మంత్రంతో విజయ్‌ ఈ ఎన్నికల్లో విజయం సాధించడం తమిళనాట మారిన వైఖరికి నిదర్శనం! విజయ్‌ సునామీలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్టాలిన్‌తోపాటు 14 మంది మంత్రులు కూడా ఇంటి బాట పట్టడం ఒక విశేషమైతే.. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించినప్పుడు రాజకీయాల్లోకి కొత్త తరం వచ్చినట్లే.. ఇప్పుడు తమిళనాట కూడా కొత్త శకం ప్రారంభం కావడం మరో విశేషం! ఆటో డ్రైవర్ల వంటి సామాన్యులకు విజయ్‌ టికెట్లు ఇచ్చినా.. వారంతా జెయింట్‌కిల్లర్లుగా మారడం ఈ ఎన్నికల్లో మరో అద్భుతం!! ఇక, కేరళంలో కూడా అధికారాన్ని పోగొట్టుకున్న వామపక్షాలు ఇప్పుడు ప్రాంతీయ పార్టీ స్థాయిలో కూడా మిగల్లేదు. బెంగాల్లో టీఎంసీ, తమిళనాట డీఎంకే పరాజయంతో ప్రతిపక్ష ఇండి కూటమికి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది!


Updated Date - May 05 , 2026 | 07:20 AM