Share News

చారిత్రక సిరీస్‌లో పసికూనపై పాకిస్థాన్‌ ప్రతాపం

ABN , Publish Date - May 05 , 2026 | 08:57 AM

జింబాబ్వే మహిళల క్రికెట్‌ జట్టు తొలిసారి పాకిస్థాన్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు పసికూన జింబాబ్వేపై ప్రతాపం చూపింది.

చారిత్రక సిరీస్‌లో పసికూనపై పాకిస్థాన్‌ ప్రతాపం
Pakistan Women dominated

స్పోర్ట్స్ డెస్క్: జింబాబ్వే మహిళల క్రికెట్‌ జట్టు తొలిసారి పాకిస్థాన్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు పసికూన జింబాబ్వేపై ప్రతాపం చూపింది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా కరాచీ వేదికగా నిన్న (సోమవారం) జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 168 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.


ఓపెనర్‌ సదాఫ్‌ షమాస్‌ (98) తృటిలో శతకం చేజారగా... మరో ఓపెనర్‌ గుల్‌ ఫిరోజా (50), వన్‌డౌన్‌ బ్యాటర్‌ సిద్రా అమీన్‌ (67) అర్ధ సెంచరీలతో రాణించారు. అలానే మిడిలార్డర్‌ బ్యాటర్‌ నజిహా అల్వి (56 నాటౌట్‌) దూకుడుగా ఆడింది. మిగతా బ్యాటర్లలో అయేషా జాఫర్‌ 3, ఆలియా రియాజ్‌ 2, కెప్టెన్‌ ఫాతిమా సనా 11 (నాటౌట్‌) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ప్రెసియస్‌ మరంగే 3 వికెట్లు తీయగా.. కుద్జాయ్‌ చిగోరా, కెప్టెన్‌ నోమ్వెలో సిబండ తలో వికెట్‌ తీశారు.


అనంతరం భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే చేతులెత్తేసింది. బిలవ్డ్‌ బిజా (53) మినహా ఎవరూ రాణించలేకపోయారు. ఓపెనర్‌ కెలిస్‌ (31)కాసేపు పోరాడింది. మిగతా ప్లేయర్లలో కెల్లీ (11), మెలిండ (10), సిబండ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. పాక్‌ బౌలర్లలో ఫాతిమా సనా, తస్మియా రుబాబ్‌, సయ్యదా ఆరూబ్‌ షా తలో 2 వికెట్లు పడగొట్టగాడు. మొమినా రియాసత్‌, నష్రా సంధు చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఈ సిరీస్‌లోని రెండో వన్డే ఇదే కరాచీ వేదికగా మే 6న(బుధవారం) జరుగనుంది.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: 'జై శ్రీరామ్' నోట్ చూపిన ముంబై స్పిన్నర్

రోహిత్‌ రికెల్టన్‌ షో

Updated Date - May 05 , 2026 | 09:56 AM