'కోహ్లీ, నాకు కాల్ చేయ్'.. ఛాలెంజ్ విసిరిన యూట్యూబర్
ABN , Publish Date - May 05 , 2026 | 12:30 PM
ప్రపంచవ్యాప్తంగా ఐషోస్పీడ్‌గా పాపులర్ అయిన ఇంటర్నెట్ సెన్సేషన్ డారెన్ జాసన్ తాజాగా క్రికెట్ పిచ్‌పై తనదైన శైలిలో సందడి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతేకాక క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి సవాల్ విసిరాడు.
స్పోర్ట్స్ డెస్క్: కొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు సెలబ్రిటీలను టార్గెట్‌గా చేసుకొని పలు రకాల వీడియోలు చేస్తుంటారు. ప్రముఖలపై ఆరోపణలు చేయడం, సవాళ్లు విసరడం వంటివి చేస్తుంటారు. అయితే ఇంకొందరు తాము అభిమానించే సెలబ్రిటీ దృష్టిలో పడేందుకు విచిత్రమైన వీడియోలు చేస్తుంటారు. తాజాగా ఓ యూట్యూబర్ టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దృష్టిలో పడేందుకు ఓ వీడియో చేశాడు. అంతేకాక అందులో 'కాల్ చేయ్ కోహ్లీ' అంటూ సవాల్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ప్రపంచవ్యాప్తంగా ఐషో స్పీడ్(IShowSpeed)గా పాపులరైన డారెన్ జాసన్ తాజాగా క్రికెట్ పిచ్‌పై తనదైన శైలిలో సందడి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. కరేబియన్ దీవుల్లో తీసిన ఒక వైరల్ వీడియోలో జాసన్ చాలా విచిత్రమైన బౌలింగ్ యాక్షన్‌తో వికెట్ తీయడం ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. నిజానికి జాసన్ వేసిన బాల్ క్రికెట్ రూల్స్‌కు అనుగుణంగా లేకపోయినప్పటికీ అతను నేరుగా స్టంప్‌లను పడగొట్టిన తీరు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వికెట్ తీసిన ఆనందంలో జాసన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకే సవాల్ విసిరాడు.
'కోహ్లీ, నాకు కాల్ చేయి. ఐసీసీ, ముంబై క్రికెట్ టీమ్‌తో పాటు నువ్వు నాకు ఖచ్చితంగా కాల్ చేయాల్సిందే' అంటూ కేకలు వేస్తూ సందడి చేశాడు. నిజానికి కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడుతున్నప్పటికీ, జాసన్ పొరపాటున ముంబై జట్టు పేరును ప్రస్తావించాడు. క్రికెట్‌పై పూర్తి అవగాహన లేకపోయినా, ఎలాగైనా కోహ్లీ దృష్టిలో పడాలనే లక్ష్యంతో అతను చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నిజానికి అతడు విరాట్ కోహ్లీ విరాభిమాని. 2024 టీ20 ప్రపంచ కప్‌లో కోహ్లీ ఔటైనప్పుడు కన్నీరు పెట్టుకోవడం చూస్తే అతని విరాట్ అంటే ఎంత అభిమానమో అర్థమవుతుంది.
ఇవి కూడా చదవండి:
ముంబై చేతిలో ఓటమిపై స్పందించిన పంత్..
జస్ప్రీత్ బుమ్రాపై సునీల్ గావస్కర్ ఆగ్రహం.. ఎందుకంటే?