Share News

‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్

ABN , Publish Date - May 05 , 2026 | 03:11 PM

ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతున్నాడు. తాజాగా జియో హాట్‌స్టార్ నిర్వహించిన ‘సూపర్ స్టార్స్’ కార్యక్రమంలో రాహుల్ పాల్గొని మాట్లాడాడు. ఒకప్పుడు తనను టీ20 ప్లేయర్‌గానే చూడలేదని, టెస్టు క్రికెటర్‌గా ముద్ర వేశారని పేర్కొన్నాడు.

‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్
KL Rahul

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో 9 మ్యాచుల్లో 433 పరుగులు చేసి.. టోర్నీలో సెకండ్ లీడింగ్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. పంజాబ్ కింగ్స్‌పై 67 బంతుల్లో 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మొత్తంగా ఈ సీజన్‌లో రెండు హాఫ్ సెంచరీలు, ఒక భారీ శతకంతో కేఎల్ రాహుల్ సత్తా చాటాడు. తాజాగా జియో హాట్‌స్టార్ నిర్వహించిన ‘సూపర్ స్టార్స్’ కార్యక్రమంలో రాహుల్ పాల్గొని మాట్లాడాడు. ఒకప్పుడు తనను టీ20 ప్లేయర్‌గానే చూడలేదని, టెస్టు క్రికెటర్‌గా ముద్ర వేశారని పేర్కొన్నాడు.


‘పదేళ్ల క్రితం నేను టీ20 జట్టులో భాగం కావడానికి అన్ని విధాలుగా కష్టపడ్డా. నన్ను ఎప్పుడూ ఒక టీ20 ప్లేయర్‌గా పరిగణించలేదు. కనీసం ఒక మంచి వైట్ బాల్ క్రికెటర్‌గా కూడా గుర్తించలేదు. కేవలం టెస్టు ఆటగాడిగా ముద్ర వేశారు. దాని నుంచి బయటకు వచ్చి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నా ఆటను మెరుగుపరుచుకుని ఈ స్థాయికి చేరుకోవడం నిజంగా గర్వకారణం. ఈ ప్రయాణంలో కొన్ని తప్పులు చేశాను. అలాగే ఇంకా కొన్ని విషయాల్లో మెరుగవ్వాలి. కానీ, నేను గర్వపడే విషయం ఏంటంటే.. ఆడిన ప్రతి మ్యాచులోనూ నా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాను. టీ20 క్రికెట్ గత మూడేళ్లలో చాలా మారింది. ముఖ్యంగా పవర్ ప్లేలోనే మ్యాచ్ దిశ నిర్ణయమవుతోంది. తొలి ఆరు ఓవర్లలో దూకుడుగా ఆడాలని మా జట్టు మేనేజ్‌మెంట్ స్పష్టంగా చెప్పింది. నేను ప్రస్తుతం అదే పాటిస్తున్నా. అయితే క్రీడల్లో ఎల్లప్పుడూ అన్నీ మనకు అనుకూలంగా జరగవు. దాన్ని తేలికగా తీసుకుని ఈ ప్రయాణాన్ని ఆస్వాదించాలి. నేను గెలిచినా, ఓడినా బ్యాలెన్స్‌డ్‌గా ఉండటానికి ప్రయత్నిస్తా. నేను సాధించని వాటి గురించి నిరాశగా అనిపిస్తే సాధించిన వాటిని గుర్తుచేసుకుంటా. నేను మరికొంత కాలం ఆడగలను. కాబట్టి అత్యుత్తమంగా ఆడేందుకు ప్రయత్నిస్తా. ఎన్ని ట్రోఫీలు గెలవగలనో చూస్తాను’ అని కేఎల్ రాహుల్ వివరించాడు.


ఇవి కూడా చదవండి:

ముంబై చేతిలో ఓటమిపై స్పందించిన పంత్..

జస్ప్రీత్ బుమ్రాపై సునీల్ గావస్కర్ ఆగ్రహం.. ఎందుకంటే?

Updated Date - May 05 , 2026 | 03:57 PM