Share News

బీసీసీఐకి గంభీర్‌ హెచ్చరిక.. పిచ్‌లు మారకపోతే భారత క్రికెట్‌కు నష్టమే!

ABN , Publish Date - Oct 11 , 2026 | 12:21 PM

భారత్‌లో బ్యాటర్లకు అతిగా అనుకూలించే పిచ్‌లపై టీమ్‌ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బ్యాట్‌, బంతి మధ్య సమతూకం లేకపోతే యువ బౌలర్ల కెరీర్లు ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేశాడు.

బీసీసీఐకి గంభీర్‌ హెచ్చరిక.. పిచ్‌లు మారకపోతే భారత క్రికెట్‌కు నష్టమే!
Gautam Gambhir reacts batting pitches

ఇంటర్నెట్ డెస్క్: భారీ స్కోర్లు.. సిక్సర్ల మోత.. బ్యాటర్ల విధ్వంసం! ఆధునిక క్రికెట్‌లో ఇవే ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రధాన అంశాలు.! ఈ క్రమంలో బౌలర్లకు ప్రాధాన్యం దక్కట్లేదన్న వాదనలు బలపడుతున్నాయి. ముఖ్యంగా స్వదేశంలో బ్యాటర్లకు అతిగా అనుకూలించే పిచ్‌ల తయారీపై టీమ్‌ఇండియా హెడ్ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బ్యాట్‌, బంతి మధ్య సమతూకం లేకపోతే భారత బౌలర్ల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని అతడు హెచ్చరించాడు.


రాంచీలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో గంభీర్‌ ఈ అంశంపై మరోసారి స్పందించాడు. బ్యాటుకు, బంతికి మధ్య సమ పోటీని కోరుకోవడం తప్పా అని ప్రశ్నించిన అతడు.. బౌలర్లు జట్టులో ఎంతో కష్టపడుతున్నారని, అలాంటి వారి కెరీర్‌ను అనతి కాలంలోనే ప్రమాదంలో పడకుండా చూస్కోవాలని పేర్కొన్నాడు. ఇరు జట్లకు సమాన అవకాశాలు కల్పించే పిచ్‌లపై ఆడితే మరింత నాణ్యమైన క్రికెట్‌ను ఆస్వాదించొచ్చని చెప్పుకొచ్చాడు.


భారత్‌లోని పలు మైదానాల్లో ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో బ్యాటర్లకు అనుకూలమైన పిచ్‌లు తయారు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గువాహటిలో ఇటీవల భారత్‌-విండీస్‌ మధ్య జరిగిన రెండో వన్డేలో 800కు పైగా పరుగులు నమోదైన సందర్భంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించాడు గౌతీ. 'ఇలాంటి పిచ్‌లపై భారీ స్కోర్లు సాధించడం రికార్డులకు, ప్రేక్షకులకు, ప్రసార సంస్థలకు ఆకర్షణీయంగా ఉండొచ్చు.. కానీ బ్యాటింగ్‌కే పరిమితమైన ఆటను పూర్తి క్రికెట్‌గా చూడలేం' అని గంభీర్ అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో యువ బౌలర్లు తమ ప్రతిభను నిరూపించుకోవడం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు.


బీసీసీఐ దృష్టి సారించాలి..

ఈ క్రమంలో పిచ్‌ల తయారీ విధానంపై బీసీసీఐ పునరాలోచించాలనే సూచనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి.. పేసర్లు, స్పిన్నర్లు, బ్యాటర్లకు సమాన అవకాశాలు కల్పించే పిచ్‌లను సిద్ధం చేయాల్సిన అవసరముంది. రంజీ, విజయ్‌ హజారే ట్రోఫీల్లాంటి దేశవాళీ పోటీల్లోనూ సమతూకంతో కూడిన పిచ్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి. తద్వారా యువ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కు అవసరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. బౌలర్ల ప్రతిభను కాపాడుతూ, పోటీని ఆసక్తికరంగా మార్చేలా పిచ్‌ల విధానంలో మార్పులు తీసుకురావడంపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


ఇవీ చదవండి:

డిగ్రీ లేకున్నా గూగుల్‌లో ఉద్యోగం.. ఏడాదికి రూ.10.6 కోట్ల వరకు జీతం.!

ఆరు భటూరాల్లో.. గ్లాసు నిండా నూనె! వీడియో వైరల్

Updated Date - Oct 11 , 2026 | 12:28 PM