డిగ్రీ లేకున్నా గూగుల్‌లో ఉద్యోగం.. ఏడాదికి రూ.10.6 కోట్ల వరకు జీతం.!
ABN , Publish Date - Oct 11 , 2026 | 10:17 AM
డిగ్రీ ఉంటేనే మంచి ఉద్యోగోలొస్తాయ్.. అలాగైతేనే భారీ జీతం వస్తుందనే రోజులు పోయాయ్! టాలెంట్‌తో పాటు స్కిల్స్ ఉంటే చాలు.. ప్రముఖ టెక్ సంస్థల్లోనూ కొలువు సాధించవచ్చని గూగుల్ డీప్‌మైండ్ నిరూపిస్తోంది. ఏఐ రంగంలో పనిచేసేందుకు డిగ్రీతో పనిలేకుండా ఇంజినీర్ల నియామకానికి సిద్ధమైంది. ఏడాదికి సుమారు రూ.11 కోట్ల వేతనం అందిస్తానంటోంది. వివరాల్లోకెళితే..
ఇంటర్నెట్ డెస్క్: సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నత వేతనంతో కొలువు సాధించాలంటే సాధారణంగా డిగ్రీలు తప్పనిసరి! కానీ దీనికి పూర్తి భిన్నంగా గూగుల్ డీప్‌మైండ్ ఓ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో పనిచేసే ఇంజినీర్ల కోసం గూగుల్ డీప్‌మైండ్ కొత్తగా ఏర్పాటుచేసిన పోలారిస్ బృందంలో నియామకాలు చేపడుతోంది. దీనికి ఎలాంటి అధికారిక డిగ్రీ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. అభ్యర్థుల్లో సమస్యలను పరిష్కరించే అసాధారణ సామర్థ్యం, సాంకేతిక నైపుణ్యాలకే ప్రాధాన్యమిస్తోంది. ఈ ఉద్యోగానికి ఏడాదికి 5.5 లక్షల నుంచి 11 లక్షల డాలర్ల వరకు(భారత కరెన్సీలో సుమారు రూ.5.3 కోట్ల నుంచి రూ.10.6 కోట్ల వరకు) ఉండొచ్చని డీప్‌మైండ్ పరిశోధకులు తమై బెసిరోగ్లు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అసలేంటీ పోలారిస్ టీమ్?
ఏఐ బేస్‌డ్ కోడింగ్ ఏజెంట్ల పనితీరును అంచనా వేసేందుకు అవసరమైన ప్రమాణాలు, పరీక్షా విధానాలను రూపొందించడమే పోలారిస్ టీమ్ టార్గెట్. గూగుల్ అభివృద్ధి చేస్తున్న జెమిని ఏఐ దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ పనులను ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తుందో పరీక్షించే టాస్క్‌లను రూపొందించాల్సి ఉంటుంది. అలాగే జెమిని శిక్షణకు ఉపయోగించే డేటా, ఎవల్యూషన్ ప్రాసెస్‌లను మెరుగుపరిచే కొత్త ప్రాజెక్టులపైనా పనిచేయాల్సి ఉంటుంది. నూతన సాంకేతిక నమూనాల తయారీ, ప్రయోగాలు చేయడం, పరిశోధన ఫలితాలను ప్రచురించడం వంటివి ఇందులో ఉంటాయి.
నైపుణ్యానికే ప్రాధాన్యం
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్ లేదా ప్రోగ్రామింగ్‌లో అనుభవం తప్పనిసరి. ఏఐ సాయంతో కోడింగ్ చేసే సాధనాలు, డెవలపర్ ఏజెంట్లు, ఎల్‌ఎల్‌ఎం(లార్జ్ లాంగ్వేజ్ మోడల్) బేస్‌డ్ వర్క్‌ఫ్లోలతో పని చేయగలగాలి. క్లిష్టమైన సాంకేతిక సమస్యలను విశ్లేషించి పరిష్కరించే సామర్థ్యం కూడా తప్పనిసరి.
ప్రోగ్రామింగ్ కాంపిటీషన్స్‌లో పాల్గొన్న అనుభవం, మ్యాథమాటిక్స్ కాంపిటీషన్స్(అంటే హ్యాకథాన్‌లలో ప్రతిభ, మెషిన్ లెర్నింగ్ మోడల్స్ కోసం రూబ్రిక్స్ పనితీరును అంచనా వేసే ప్రమాణాలు రూపొందించిన అనుభవం ఉంటే అదనపు అర్హతగా పరిగణనలోకి తీసుకుంటారు.
కొత్త ప్రోగ్రామింగ్ విధానాలు, సాంకేతిక వ్యవస్థను త్వరగా అలవర్చుకునే నైపుణ్యానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది.
డిగ్రీ తప్పనిసరి కాకుండా ప్రతిభ, సమస్య పరిష్కార నైపుణ్యాల ఆధారంగా నియామకాలు చేపట్టాలని నిర్ణయించుకున్న గూగుల్ తీరుపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. ఇతర సంస్థలు కూడా విద్యార్హతల కంటే నైపుణ్యాలకే ఇంపార్టెన్స్ ఇవ్వాలని పలువురు అంటున్నారు. ఏఐ కోడింగ్ రంగంపై ఆసక్తి, లోతైన విశ్లేషణ సామర్థ్యం ఉన్నవారికి ఇదో చక్కటి అవకాశమని మరికొందరు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ఆసక్తి, నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులు గూగుల్ డీప్‌మైండ్ అధికారిక ఉద్యోగ ప్రకటనలో పూర్తి అర్హతలు, దరఖాస్తు వివరాలను పరిశీలించాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి:
కెనరా బ్యాంకులో భారీగా అప్రెంటిస్ పోస్టులు.. నెలకు రూ.16,650 స్టైపెండ్!
ఏపీ అసెంబ్లీలో రిపోర్టర్ పోస్టులు.. రూ.1,47,760 వరకు జీతం