Share News

అభిషేక్‌ సిక్సర్ల సునామీ.. కోహ్లీని దాటేసి.. యువరాజ్‌తో సమంగా.!

ABN , Publish Date - Oct 03 , 2026 | 11:55 AM

ఆసియా క్రీడల్లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న ఫైనల్లో భారత బ్యాటర్ అభిషేక్ శర్మ చెలరేగి ఆడాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించడం సహా పలు రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు.

అభిషేక్‌ సిక్సర్ల సునామీ.. కోహ్లీని దాటేసి.. యువరాజ్‌తో సమంగా.!
Abhishek Sharma

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల్లో భాగంగా గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడుతోంది భారత్. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 61 పరుగులతో విరుచుకుపడిన అతడు.. పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.


పాక్‌పై టీ20ల్లో మొత్తం 14 సిక్సర్లు బాదాడు అభిషేక్. దీంతో ఆ జట్టుపై అత్యధిక సిక్సర్లు బాదిన విరాట్ కోహ్లీ(11)ని అతడు అధిగమించాడు. ఇక.. ఫైనల్లో 7 సిక్సర్లు బాదిన శర్మ.. యువరాజ్ సింగ్(2012లో అహ్మదాబాద్‌లో పాక్‌‌పై 7 సిక్సర్) రికార్డును సమం చేశాడు. ఈ క్రమంలో 2026 క్యాలెండర్‌ ఇయర్‌లో టీ20ల్లో 100 సిక్సర్లు పూర్తి చేసిన అభిషేక్.. 400 సిక్సర్ల మైలురాయిని కూడా అందుకున్నాడు. దీంతో టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న బ్యాటర్ల జాబితాలోనూ రెండో స్థానంలో నిలిచాడు. 3,513 బంతుల్లో అతడీ మార్క్‌ను అందుకోగా.. ఆండ్రీ రసెల్‌(3,027 బంతుల్లో) అతడి కంటే ముందున్నాడు. క్రిస్‌ గేల్‌(3,557), టిమ్‌ డేవిడ్(3,803), కీరన్‌ పొలార్డ్‌(3,944) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.


అంతేకాకుండా.. ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో టీ20ల్లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు బాదిన బ్యాటర్ల జాబితాలో‌ రెండో స్థానానికి ఎగబాకాడు అభిషేక్. అతడు 651 బంతుల్లోనే ఈ ఘనత సాధించగా.. రసెల్‌ 589 బంతులతో శర్మ కంటే ముందున్నాడు. డెవాల్డ్‌ బ్రెవిస్‌(653), క్రిస్‌ గేల్‌ (724) మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.


ఇవీ చదవండి:

ఆసియా క్రీడలు: ప్రణవి శరత్ సంచలనం.. గోల్ఫ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం

క్రిస్ గేల్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు.. చరిత్ర సృష్టించిన ప్రొటీస్ క్రికెటర్

Updated Date - Oct 03 , 2026 | 12:02 PM