క్రిస్ గేల్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు.. చరిత్ర సృష్టించిన ప్రొటీస్ క్రికెటర్
ABN , Publish Date - Oct 03 , 2026 | 09:34 AM
టీ20 క్రికెట్‌లో దక్షిణాఫ్రికా యువ ఓపెనర్ లువాన్ డ్రే ప్రిటోరియస్ సంచలనం సృష్టించాడు. టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 క్రికెట్‌లో దక్షిణాఫ్రికా యువ ఓపెనర్ లువాన్ డ్రే ప్రిటోరియస్ సంచలనం సృష్టించాడు. టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దీంతో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట 13 ఏళ్లుగా కొనసాగుతోన్న రికార్డు బద్దలైంది. సీఎస్ఏ టీ20 ఛాలెంజ్‌లో భాగంగా బ్లూమ్ ఫొంటెయిన్‌లో టైటాన్స్, నైట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 20 ఏళ్ల ప్రిటోరియస్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 79 బంతుల్లోనే అజేయంగా 188 పరుగులు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి.
2013 ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన క్రిస్ గేల్.. పుణే వారియర్స్ ఇండియాపై అజేయంగా 175 పరుగులు చేశాడు. పురుషుల టీ20 క్రికెట్‌లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా 13 ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. తాజాగా ప్రిటోరియస్ 188 పరుగులతో ఆ రికార్డును అధిగమించాడు. ఆరంభం నుంచే బౌలర్లపై విరుచుకుపడిన ప్రొటీస్ స్టార్... కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 40 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తూ 58 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేశాడు.
ఈ ఇన్నింగ్స్‌తో మరో రికార్డును కూడా ప్రిటోరియస్ సమం చేశాడు. పురుషుల టీ20 క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న ఆటగాళ్ల జాబితాలో ఆరోన్ ఫించ్, మార్కస్ స్టోయినిస్‌లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ముగ్గురూ 79 బంతుల చొప్పున ఎదుర్కొన్నారు. ప్రిటోరియస్ వీర విహారంతో టైటాన్స్.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 267 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇది సీఎస్ఏ టీ20 ఛాలెంజ్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు. అంతేకాదు.. సీఎస్ఏ టీ20 ఛాలెంజ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును కూడా ప్రిటోరియస్ తన పేరిట రాసుకున్నాడు. డెవాల్డ్ బ్రెవిస్ చేసిన 162 పరుగుల రికార్డును అధిగమించాడు.
ఇవి కూడా చదవండి:
వన్డే ప్రపంచ కప్ 2027.. గంభీర్ ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే: గంగూలీ
జైస్వాల్ ఆడకపోయినా పర్వాలేదు.. ఆ ఇద్దరినే కొనసాగించాలి: రహానె