వన్డే ప్రపంచ కప్ 2027.. గంభీర్ ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే: గంగూలీ
ABN , Publish Date - Oct 03 , 2026 | 07:35 AM
వన్డే ప్రపంచకప్ 2027పై భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న మెగా టోర్నీలో టీమిండియా సమతూకం సరిగ్గా ఉండాలంటే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య చాలా ముఖ్యమని పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్ 2027పై భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న మెగా టోర్నీలో టీమిండియా సమతూకం సరిగ్గా ఉండాలంటే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య చాలా ముఖ్యమని పేర్కొన్నాడు. హార్దిక్‌ను పూర్తి ఫిట్‌నెస్‌తో మ్యాచ్‌లకు సిద్ధంగా ఉంచడం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, టీమ్ మేనేజ్‌మెంట్‌కు అతిపెద్ద సవాల్‌గా మారుతుందని అభిప్రాయపడ్డాడు. హార్దిక్ పాండ్య ఇప్పటికే 2019, 2023 ప్రపంచకప్‌లలో భారత్ తరఫున ఆడాడు. అయితే 2023 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా చీలమండ గాయానికి గురై టోర్నీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
‘ప్రపంచ కప్‌లో భారత జట్టు సమతూకానికి హార్దిక్ పాండ్య చాలా ముఖ్యమైన ఆటగాడు. అతడిని పూర్తి ఫిట్‌గా బరిలోకి దించడం గంభీర్, టీమ్‌కు అతిపెద్ద సవాళ్లలో ఒకటి. హార్దిక్ తగినన్ని మ్యాచ్‌లు ఆడటం లేదు. కానీ భారత్‌కు జట్టు సమతూకం సరిగ్గా ఉండాలి. ఒకవేళ హార్దిక్ గాయపడితే అతడికి తదుపరి ప్రత్యామ్నాయం నితీశ్ కుమార్ రెడ్డి. అయితే హార్దిక్‌కు రెండో ఆప్షన్‌గా నితీశ్‌ను పరిగణిస్తే.. ప్రపంచకప్ వరకు అతడిని వరుసగా ఆడించాలి. రానున్న వన్డే ప్రపంచకప్‌లో సీమింగ్ ఆల్‌రౌండర్ అవసరం ఉంటుంది. భారత టాప్-5 బ్యాటర్లలో ఎవరూ బౌలింగ్ చేయరు. కాబట్టి ఐదు లేదా ఆరో బౌలింగ్ ఆప్షన్‌ను ఎక్కడి నుంచైనా తీసుకురావాలి. అందుకే సరైన ఆటగాడిని గుర్తించడం భారత్‌కు కీలకం. ఈ కారణంగానే హార్దిక్ చాలా ముఖ్యమని చెబుతున్నా’ అని గంగూలీ వివరించాడు.
ఆ మ్యాచ్‌పైనే ఆసక్తి..
ప్రపంచకప్ షెడ్యూల్‌పైనా గంగూలీ స్పందించాడు. భారత్ తన తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడనుండటం మంచిదేనని పేర్కొన్నాడు. 2023 ప్రపంచకప్ ఫైనల్‌లో తలపడిన ఈ రెండు జట్లు మరోసారి తలపడనున్నాయి. ‘భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌తో టోర్నీని ప్రారంభించడం బాగుంది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌తో టోర్నీని ప్రారంభించడానికి మనం అలవాటు పడ్డాం. అయితే ఎప్పుడైనా రెండు బలమైన జట్లతో ఆడాల్సిందే. అది తొలి దశలో అయినా, తర్వాత అయినా పెద్దగా తేడా లేదు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉన్న స్థాయి పోటీ ఇప్పుడు అంతగా లేదని ఐసీసీ కూడా గుర్తించినట్లు అనిపిస్తోంది. పాకిస్థాన్ బలహీనంగా ఉంది. భారత్ చాలా కాలంగా వారిపై విజయం సాధిస్తోంది. నిజానికి భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ కోసం నేను ఎదురు చూస్తున్నా. బహుశా రెండో రౌండ్‌లో ఆ మ్యాచ్ జరుగుతుంది. దక్షిణాఫ్రికా అద్భుతమైన జట్టు’ అని గంగూలీ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడల ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా నీరూ దాండా
44 ఏళ్ల నిరీక్షణకు తెర.. తొలిసారి హాకీలో గోల్డ్ మెడల్