గోల్డెన్ సిక్స్
ABN , Publish Date - Oct 03 , 2026 | 02:09 AM
ఆసియా క్రీడలకు మరొక్క రోజే మిగిలుండగా భారత క్రీడాకారుల ప్రదర్శన మిన్నంటింది..స్వర్ణాల సునామీ వెల్లువెత్తింది.. మహిళల హాకీ జట్టు 44 ఏళ్ల సుదీర్ఘ ఎదురు చూపులకు..
ఒకేరోజు ఆరు పసిడి పతకాలు
బాక్సింగ్‌లో మూడు.. హాకీ, ఆర్చరీ, రెజ్లింగ్‌లో ఒక్కోటి
హాకీ అమ్మాయిల 44 ఏళ్ల నిరీక్షణకు తెర
ఒలింపిక్స్ బెర్త్ కైవసం
లవ్లీనా, పర్వీన్, అంకుశ్ అదరహో
ధీరజ్‌కు రెండు రజతాలు
ఆసియా క్రీడలకు మరొక్క రోజే మిగిలుండగా భారత క్రీడాకారుల ప్రదర్శన మిన్నంటింది..స్వర్ణాల సునామీ వెల్లువెత్తింది.. మహిళల హాకీ జట్టు 44 ఏళ్ల సుదీర్ఘ ఎదురు చూపులకు తెరదించుతూ పసిడి పతకం కొల్ల గొట్టింది..అంతేకాదు లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్ బెర్త్‌ను కూడా పట్టేసింది..బాక్సర్ల పంచ్ కనక వర్షం కురిపించింది.. రికర్వ్ ఆర్చరీ మహిళల జట్టు స్వర్ణంతో చరిత్ర సృష్టించింది..రెజ్లర్ సుజీత్ కల్కల్ పసిడి పట్టు అదిరింది.. తెలుగు ఆర్చర్ ధీరజ్ రెండు రజతాలతో భళా అనిపించగా, సెపక్‌తక్రా, సెయిలింగ్‌లో కంచు మోత మోగింది.. మొత్తంగా పతకాల పట్టికలో భారత్ ఏకంగా ఐదో స్థానానికి దూసుకొచ్చింది.
నగోయ: ఆసియా క్రీడల్లో శుక్రవారం భారత అథ్లెట్ల ప్రదర్శన అంబరాన్నంటింది. 13వ రోజు ఏకంగా ఆరు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో మొత్తం పది పతకాలు సొంతం చేసుకున్నారు.
హాకీలో 1982 తర్వాత..
మహిళల హాకీ జట్టు ఏకంగా 44 సంవత్సరాల స్వర్ణ పతక స్వప్నాన్ని సాకారం చేసుకుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఫైనల్లో మన అమ్మాయిలు 1-0తో డిఫెండింగ్ చాంపియన్ చైనాకు షాకిచ్చి ఆసియా చాంపియన్లుగా నిలిచారు. 10వ నిమిషంలో లాల్‌రెమ్ సియామి విజయానికి అవసరమైన గోల్ అందించింది. ఇక.. ఆ తర్వాత గోల్‌కీపర్ బిచూ దేవితోపాటు భారత డిఫెండర్లు మిగిలిన 50 నిమిషాలు గోల్ చేయకుండా చైనాను నిలువరించిన తీరు అమోఘం..అద్భుతం. 1982 న్యూఢిల్లీ ఆసియా క్రీడల తర్వాత భారత్ ఖాతాలో మళ్లీ మహిళల హాకీ పసిడి పతకం చేరింది. అంతేకాదు.. 2028 విశ్వ క్రీడలకు మన అమ్మాయిలకు నేరుగా బెర్త్ లభించింది. కాగా..ట్రాఫిక్ జామ్‌లో భారత్, చైనా జట్లు ఇరుక్కుపోవడంతో మ్యాచ్ నిర్ణీత సమయం కంటే గంట ఆలస్యంగా ప్రారంభమైంది.
హాకీ జట్టుకు సీఎం అభినందన
స్వర్ణం నెగ్గిన భారత హాకీ జట్టును సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. వారి విజయం క్రీడాకారులందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.
10సార్లు ఒలింపిక్ చాంపియన్‌కు షాకిచ్చి..
ఆసియాడ్‌లో భారత ఆర్చర్ల జోరు కొనసాగుతోంది. ఇక, కాంపౌండ్ మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో ఆసియా చాంపియన్‌గా అవతరించింది. హోరాహోరీగా జరిగిన టీమ్ విభాగం ఫైనల్లో అంకిత భకత్, కీర్తీశర్మ, కుంకుమ్ మొహోద్‌లతో కూడిన భారత త్రయం 5-3తో పదిసార్లు ఒలింపిక్ చాంపియన్, గత ఆసియాడ్ విజేత దక్షిణ కొరియాపై సంచలన విజయం సాధించింది. తద్వారా ఆసియా క్రీడల రికర్వ్ ఆర్చరీ మహిళల టీమ్ విభాగంలో భారత్‌కు తొలి పసిడి పతకం అందించింది.

హ్యాట్రిక్ పంచ్
లవ్లీనా బోర్గోహైన్ (మహిళల 75 కిలోలు), పర్వీన్ హుడా (మహిళల 65 కిలోలు), అంకుశ్ పంఘల్ (పురుషుల 80 కిలోలు) పంచ్‌లకు మూడు స్వర్ణాలు వెల్లువెత్తాయి. మహిళల 75 కి. కేటగిరీ ఫైనల్లో లవ్లీనా 5-0తో చైనాకు చెందిన ఝియి బావోను చిత్తు చేసి ఆసియా క్రీడల్లో తొలి పసిడి పతకం ముద్దాడింది. అంతేకాదు శుక్రవారంనాటి తన 29వ పుట్టిన రోజును మరింత మురిపెం చేసుకుంది. గత హాంగ్జౌ ఆసియా క్రీడల్లో లవ్లీనా రజత పతకం గెలుపొందింది. నువ్వా..నేనా..అనేలా సాగిన మహిళల 65కి. టైటిల్ పోరులో పర్వీన్ 3-2తో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత చెన్ నీన్ (తైపీ)ని కంగుతినిపించింది. పర్వీన్ కూడా గత ఆసియాడ్ రజత పతకాన్ని మెరుగుపరుచుకుంది. ఏకపక్షంగా జరిగిన పురుషుల 80కి. విభాగం టైటిల్ ఫైట్‌లో అంకుశ్ పంగల్ 5-0తో మిన్‌సియాంగ్ కిమ్ (దక్షిణకొరియా)ను మట్టికరిపించి స్వర్ణం చేజిక్కించుకున్నాడు. అమిత్ పంఘల్ (2018 ఆసియాడ్) తర్వాత ఈ మెగా ఈవెంట్‌లో పసిడి పతకం సాధించిన తొలి భారత పురుష బాక్సర్‌గా అంకుశ్ నిలిచాడు. ఇక ఈసారి ఆసియా క్రీడలను మన బాక్సర్లు మూడు స్వర్ణాలు, మూడు కాంస్యాలతో మొత్తం ఆరు పతకాలతో ముగించారు. ప్రియ (మహిళల 60కి.), కపిల్ పొఖారియా (పురుషుల 90కి.), నరేందర్ బేర్వల్ (పురుషుల +90కి.) కాంస్య పతకాలు నెగ్గిన సంగతి తెలిసిందే.

రెజ్లర్ సునీల్ సంచలనం
రెజ్లింగ్ పురుషుల 65 కిలోల విభాగం ఫైనల్లో సుజిత్ కల్కల్ సంచలన ప్రదర్శన చేశాడు. అబ్దుల్‌మాజిద్ కుదియేవ్ (తజకిస్థాన్)తో జరిగిన ఫైనల్లో మరో 40 సెకన్ల సమయమే ఉండగా.. సుజిత్ 2-9తో వెనుకంజలో నిలిచాడు. మరొకరైతే బౌట్‌ను వదిలేసుకునేవారే. కానీ పోరాటానికి మారుపేరైన సునీల్ ఒక్కసారిగా జూలు విదిల్చాడు. వరుస ‘టేక్‌డౌన్’లతో అబ్దుల్‌మాజిద్‌ను మట్టికరిపించాడు. ఎనిమిది వరుస పాయింట్లు సాధించి 10-9తో విజయం అందుకొన్నాడు. పసిడి పతకం తన ఖాతాలో వేసుకున్నాడు.

ఆసియాడ్‌లో నేటి భారత షెడ్యూల్
పురుషుల హాకీ ఫైనల్: భారత్ గీ మలేసియా (మ. 3.30);
పురుషుల క్రికెట్ ఫైనల్: భారత్‌గీ పాకిస్థాన్ (ఉ. 10.30);
ఆర్చరీ: మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగం క్వార్టర్స్ - కుమ్‌కుమ్ (ఉ. 5.30, మెడల్ రౌండ్లు ఉ. 7.05), పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగం క్వార్టర్స్ - ధీరజ్, నీరజ్ (ఉ.9.30, మెడల్ రౌండ్లు ఉ. 11.05);
రెజ్లింగ్: పురుషుల ఫ్రీస్టయిల్ ప్రీక్వార్టర్స్ - సాగర్ జగ్లాన్ (74 కిలోలు), దీపక్ పూనియా (97 కి.), అమన్ (57 కి.) (ఉ. 7.23.. క్వాలిఫై అయితే ఫైనల్స్ మ. 2), మహిళల ఫ్రీస్టయిల్ ప్రీక్వార్టర్స్ - మనీషా (57 కి.), అంతిమ్ (53 కి.) (ఉ. 8.55, క్వాలిఫై అయితే ఫైనల్స్ సా. 4.02);
గోల్ఫ్: మహిళల వ్యక్తిగత విభాగం- అదితి అశోక్, ప్రణవి, దీక్షా సాగర్ (ఉ. 3.30), మహిళల టీమ్ రౌండ్ 4- భారత్ (ఉ. 3.30), పురుషుల వ్యక్తిగత విభాగం - వీర్ అహ్లావత్, సాప్తక్ తల్వార్, యువ్‌రాజ్ సంధు (ఉ. 4.25), పురుషుల టీమ్ రౌండ్ 4 - భారత్ (ఉ. 4.25); రగ్బీ సెవెన్స్: మహిళల టీమ్ క్లాసిఫికేషన్ మ్యాచ్‌లు - భారత్ గీ సింగపూర్ (ఉ. 6.20);
సెయిలింగ్: మహిళల డింగీ ఓపెనింగ్ సిరీస్ రేస్ - మహీ వర్మ (ఉ. 7.10), మహిళల విండ్‌సర్ఫింగ్ ఓపెనింగ్ సిరీస్ రేస్ - కాత్యా (ఉ. 8.05);
తైక్వాండో: మహిళల ప్రీక్వార్టర్స్ - కాశిష్ మాలిక్, జ్యోతి యాదవ్ (ఉ. 5.42);
పురుషుల వాలీబాల్: క్లాసిఫికేషన్ మ్యాచ్ - భారత్‌గీ థాయ్‌లాండ్ (ఉ. 7.23);