Share News

ధీరజ్‌ భళా..

ABN , Publish Date - Oct 03 , 2026 | 01:55 AM

తెలుగు ఆర్చర్‌ ధీరజ్‌ బొమ్మదేవర, కుమ్‌కుమ్‌ మొహోద్‌ ద్వయం ఆర్చరీ కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగం ఫైనల్లో 3-5తో చైనా జంట జింగ్‌ యి, మెంగ్‌క్వి లీ చేతిలో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకుంది.

ధీరజ్‌ భళా..

తెలుగు ఆర్చర్‌ ధీరజ్‌ బొమ్మదేవర, కుమ్‌కుమ్‌ మొహోద్‌ ద్వయం ఆర్చరీ కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగం ఫైనల్లో 3-5తో చైనా జంట జింగ్‌ యి, మెంగ్‌క్వి లీ చేతిలో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకుంది. 0-4తో వెనుకంజలో ఉన్న దశలో పోరాడిన ధీరజ్‌ జంట..చివరకు రెండో స్థానానికే పరిమితమైంది. ఆసియాడ్‌ ఈ విభాగంలో భారత్‌కిది తొలి రజత పతకం కావడం విశేషం. ఆపై ధీరజ్‌, సంజయ్‌ భోగె, నీరజ్‌ చౌహాన్‌ త్రయం రికర్వ్‌ టీమ్‌ విభాగం ఫైనల్లో 3-5తో కొరియా చేతిలో పరాజయంతో రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది.


తురుపుముక్క

బొమ్మదేవర ధీరజ్‌. దేశాన్నే కాదు.. ప్రపంచ రికర్వ్‌ ఆర్చరీని ప్రస్తుతం ఊపేస్తున్న పేరు. సరిగ్గా రెండు వారాల కిందట జరిగిన వరల్డ్‌కప్‌ ఫైనల్లో స్వర్ణం నెగ్గిన ఈ విజయవాడ కుర్రాడు.. ప్రస్తుతం ఆసియా క్రీడల్లో మిక్స్‌డ్‌, టీమ్‌ విభాగాల్లో రజతాలు అందుకున్నాడు. ఇక, శనివారం జరిగే వ్యక్తిగత విభాగంలోనూ బరిలోకి దిగుతూ హ్యాట్రిక్‌ పతకంపై గురిపెట్టాడు. మధ్య తరగతి కుటుంబం, ఆర్థిక ఇబ్బందులు, తండ్రి ఆరోగ్య సమస్యలు, ప్రాక్టీసు చేయడానికి సరైన విల్లు, బాణాలు లేకపోయినా.. చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో అంచెలంచెలుగా ఎదుగుతూ ధీరజ్‌ ప్రపంచ టాప్‌-5 ఆర్చర్లలో ఒకడిగా నిలిచాడు. ఒక దశలో కుటుంబ స్థితిగతులు, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టిన తరుణంలో ఆర్చరీ వదిలేద్దామనే ఆలోచన వరకు వెళ్లిన ధీరజ్‌, పట్టుదలతో మరింత కష్టపడి జాతీయ స్థాయిలో సత్తా చాటి, ఇప్పుడు భారత ఆర్చరీ తురుపుముక్కగా మారాడు. ప్రస్తుతం వరల్డ్‌ నెంబర్‌-4గా ఉన్న ధీరజ్‌ ఒక పక్క ఆర్చరీలో రాణిస్తూనే మరో వైపు కుటుంబ పోషణ కోసం భారత ఆర్మీలో సుబేదార్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కష్టాలకు ఎదురీది, దేశం గర్వించే ఆర్చర్‌గా ఎదిగిన ధీరజ్‌ విజయాలపై అతడి తల్లిదండ్రులు రేవతి, శ్రవణ్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి)

Updated Date - Oct 03 , 2026 | 01:56 AM