జైస్వాల్ ఆడకపోయినా పర్వాలేదు.. ఆ ఇద్దరినే కొనసాగించాలి: రహానె
ABN , Publish Date - Oct 03 , 2026 | 06:59 AM
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. అయితే వన్డే ప్రపంచ కప్ 2027ను దృష్టిలో పెట్టుకుని ఈ ఆఖరి మ్యాచ్‌లో టీమ్ మేనేజ్‌మెంట్ ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. దీనిపై భారత మాజీ క్రికెటర్ రహానె ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో వన్డే శనివారం జరగనుంది. అయితే వన్డే ప్రపంచ కప్ 2027ను దృష్టిలో పెట్టుకుని ఈ ఆఖరి మ్యాచ్‌లో టీమ్ మేనేజ్‌మెంట్ ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. భిన్నమైన కాంబినేషన్లు ప్రయత్నించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ అజింక్య రహానె జట్టు కూర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘నేను ఒకటి, రెండు మార్పులు చూడాలనుకుంటున్నా. మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే నితీశ్ కుమార్ రెడ్డిని కూడా తిరిగి జట్టులో చూడాలనుకుంటున్నా. నితీశ్ ప్రపంచకప్ ప్రణాళికల్లో ఉంటే.. అతడి పాత్ర కీలకం అవుతుంది. కాబట్టి ఇక్కడే అతడికి ఆత్మవిశ్వాసం కల్పించడం ముఖ్యం. జైస్వాల్ ఇప్పుడు ఆడకపోయినా ఎలాంటి తేడా ఉండదు. జైస్వాల్‌కు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో విజయవంతమైన కాంబినేషన్‌ను మార్చాల్సిన అవసరం లేదు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ ఓపెనర్లుగా చెలరేగి ఆడుతున్నారు. మన బ్యాటింగ్ ఇప్పటికే సెట్ అయింది. ఇప్పుడు ఆల్‌రౌండర్ స్థానాన్ని ఖరారు చేయాలి’ అని రహానె వెల్లడించాడు.
ప్రయోగాలు చేయొచ్చు: దినేశ్ కార్తీక్
భారత మాజీ వికెట్ కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ కూడా మూడో వన్డేలో ఒకటి, రెండు మార్పులు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. ‘మొదటగా నమన్ ధీర్ గాయపడటం వల్ల మార్పు తప్పనిసరి కావచ్చు. అతడు ఫిట్‌గా ఉంటాడో లేదో తెలియదు. పేసర్లలో ఒకరికి విశ్రాంతినిచ్చి సిరాజ్‌ను ఆడించినా ఆశ్చర్యం లేదు. అలాగే నితీశ్ కుమార్ రెడ్డికి కూడా అవకాశం రావచ్చు. సిరీస్ గెలిచారు కాబట్టి ఇప్పుడు ఎవరిని ఆడించాలనేది టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం. యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్‌లను ఒక మ్యాచ్ ఆడించి చూడొచ్చు. లేదా సిరీస్‌ను 3-0తో ముగించాలనే ఉద్దేశంతో అత్యుత్తమ జట్టుతోనే బరిలోకి దిగొచ్చు. అది పూర్తిగా జట్టు నిర్ణయం. అయితే ఒకటి, రెండు మార్పులు జరిగే అవకాశం ఉంది’ అని కార్తీక్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడల ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా నీరూ దాండా
44 ఏళ్ల నిరీక్షణకు తెర.. తొలిసారి హాకీలో గోల్డ్ మెడల్