Share News

ఆసియా క్రీడలు 2026: భారత్, పాక్ ఫైనల్‌కు మోసిన్ నఖ్వీ దూరం

ABN , Publish Date - Oct 02 , 2026 | 07:59 PM

ఆసియా క్రీడలు 2026లో క్రికెట్ విభాగంలో భారత్, పాకిస్థాన్ జట్లు పసిడి పతకం కోసం తలపడనున్నాయి. కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్ వేళ ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఆసియా క్రీడలు 2026: భారత్, పాక్ ఫైనల్‌కు మోసిన్ నఖ్వీ దూరం
India vs Pakistan cricket final

స్పోర్ట్స్ డెస్క్: ఆసియా క్రీడలు 2026లో క్రికెట్ విభాగంలో భారత్, పాకిస్థాన్ జట్లు పసిడి పతకం కోసం తలపడనున్నాయి. కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్ వేళ ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ మోసిన్ నఖ్వీ ఈ మ్యాచ్‌కు హాజరుకావడం లేదని ఏసీసీ అధికారికంగా ప్రకటించింది. ముందస్తు కార్యక్రమాల (Prior commitments) వల్లే ఆయన ఈ ఫైనల్‌కు రాలేకపోతున్నారని వెల్లడించింది.


ఏసీసీ ఛైర్మన్ గానే కాకుండా పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేస్తున్న మోసిన్ నఖ్వీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)తో వివాదాస్పద సంబంధాలను కలిగి ఉన్నారు. గతంలో పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా, భారత సాయుధ బలగాలు చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'కి మద్దతుగా, భారత పురుషుల, మహిళల జట్లు ఏసీసీ ట్రోఫీలను నఖ్వీ చేతుల మీదుగా స్వీకరించడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే.


ఆసియా కప్ విజేతగా నిలిచిన సమయాల్లో ఆయన కాకుండా ఏసీసీ ఉపాధ్యక్షుడి చేతుల మీదుగా పతకాలు లేదా ట్రోఫీలను అందించాలని బీసీసీఐ కోరినప్పటికీ, నఖ్వీ దానికి అంగీకరించలేదు. ఆ క్రమంలో భారత జట్లు ట్రోఫీని తీసుకోకుండానే వేదిక నుంచి నిష్క్రమించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడల క్రికెట్ ఫైనల్‌ అనంతరం అధికారిక పతకాల ప్రదానోత్సవంలో నఖ్వీ పాల్గొంటే మళ్లీ ప్రొటోకాల్ వివాదం తలెత్తుతుందేమోనన్న ఆందోళనలు నెలకొన్నాయి.India vs Pakistan cricket final


ఇప్పుడు నఖ్వీ రావడం లేదని స్పష్టం చేయడంతో ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA), స్థానిక నిర్వాహకులు, భారత ఒలింపిక్ సంఘం (IOA)లపై ఆందోళనల భారం తగ్గింది. ఫైనల్‌‌కు దూరంగా ఉన్నప్పటికీ, పాల్గొంటున్న అన్ని జట్లకు నఖ్వీ శుభాకాంక్షలు తెలిపారు. వరుసగా రెండోసారి ఆసియాడ్‌ స్వర్ణ పతకాన్ని ముద్దాడాలనే పట్టుదలతో ఉన్న భారత జట్టు, ఈ బిగ్ ఫైట్‌లో పాకిస్తాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది.


ఇవి కూడా చదవండి:

ఆసియా క్రీడల ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా నీరూ దాండా

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. తొలిసారి హాకీలో గోల్డ్ మెడల్

Updated Date - Oct 02 , 2026 | 08:27 PM