ఆసియా క్రీడలు: ప్రణవి శరత్ సంచలనం.. గోల్ఫ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం
ABN , Publish Date - Oct 03 , 2026 | 09:55 AM
భారత గోల్ఫర్ ప్రణవి శరత్ ఉర్స్ ఆసియా క్రీడల్లో అద్భుతం చేసింది. మహిళల వ్యక్తిగత గోల్ఫ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత గోల్ఫర్ ప్రణవి శరత్ ఉర్స్ ఆసియా క్రీడల్లో అద్భుతం చేసింది. మహిళల వ్యక్తిగత గోల్ఫ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఉత్కంఠభరితంగా సాగిన చివరి రౌండ్‌లో ఒత్తిడిని అధిగమించిన ప్రణవి.. 18వ హోల్‌లో కీలకమైన పార్ పుట్‌ను విజయవంతంగా పూర్తి చేసి గోల్డ్ మెడల్‌ను ఖాయం చేసుకుంది. చివరి దశకు చేరుకునే సమయానికి ప్రణవికి సింగపూర్‌కు చెందిన షానన్ జువాన్ యిన్ టాన్, చైనాకు చెందిన రువోనింగ్ యిన్ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. అయితే కీలక సమయంలో ఏమాత్రం తడబడకుండా అద్భుతంగా ఆడి.. ప్రత్యర్థుల కంటే ఒక స్ట్రోక్ ఆధిక్యంతో అగ్రస్థానంలో నిలిచింది.
ఈ విజయంతో ఆసియా క్రీడల్లో గోల్ఫ్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా ప్రణవి చరిత్ర సృష్టించింది. 2002లో శివ్ కపూర్ తర్వాత ఆసియా క్రీడల్లో గోల్ఫ్‌లో భారత్‌కు స్వర్ణ పతకం అందించిన తొలి భారతీయురాలిగా నిలిచింది.
టీమ్ ఈవెంట్‌లోనూ రజతం
వ్యక్తిగత విభాగంలో గోల్డ్ గెలిచిన ప్రణవి.. టీమ్ ఈవెంట్‌లోనూ భారత్‌కు పతకం అందించడంలో కీలక పాత్ర పోషించింది. ప్రణవి, అదితి అశోక్, దీక్షా దాగర్‌ల త్రయం భారత జట్టుకు రజత పతకం అందించింది. భారత్ మొత్తం 14 అండర్ పార్ స్కోరు సాధించింది. 22 అండర్ పార్‌తో చైనా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ప్రణవి సాధించిన ఈ డబుల్ మెడల్ ఘనత భారత మహిళల గోల్ఫ్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోనుంది. ఆసియా క్రీడల్లో మహిళల గోల్ఫ్‌లో భారత్‌కు ఇప్పటివరకు ఉన్న ఏకైక పతకం అదితి అశోక్ సాధించిన రజతమే. తాజాగా ప్రణవి వ్యక్తిగత విభాగంలో స్వర్ణం, టీమ్ ఈవెంట్‌లో రజతం సాధించి భారత గోల్ఫ్‌లో సరికొత్త చరిత్రకు నాంది పలికింది. ఇదిలా ఉంటే, ఆసియా క్రీడలు 2026లో భారత్ ఖాతాలో ఇప్పటి వరకు 79 పతకాలు వచ్చి చేరాయి. ఇందులో 18 స్వర్ణాలు, 26 రజతాలు, 35 కాంస్య పతకాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
వన్డే ప్రపంచ కప్ 2027.. గంభీర్ ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే: గంగూలీ
జైస్వాల్ ఆడకపోయినా పర్వాలేదు.. ఆ ఇద్దరినే కొనసాగించాలి: రహానె