Share News

పట్టాలపై కారు.. దూసుకొచ్చిన రైలు.. రెప్పపాటులో తప్పించుకున్న డ్రైవర్‌

ABN , Publish Date - Oct 16 , 2026 | 01:17 PM

మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో రైల్వే క్రాసింగ్ వద్ద పట్టాలపై చిక్కుకున్న కారును రైలు ఢీకొట్టింది. డ్రైవర్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. వివరాల్లోకెళితే...

పట్టాలపై కారు.. దూసుకొచ్చిన రైలు.. రెప్పపాటులో తప్పించుకున్న డ్రైవర్‌
Train hits Car At Railway Crossing

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో రైల్వే క్రాసింగ్‌ వద్ద కారును రైలు ఢీకొన్న షాకింగ్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. రైల్వేట్రాక్ దాటే క్రమంలో కారు పట్టాలపై చిక్కుకోవడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా.. డ్రైవర్‌ అప్రమత్తం కావడంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.


అయితే.. గేట్ తెరిచి ఉండటంతోనే తాను లోపలికి వెళ్లానని, తీరా పట్టాలు దాటకముందే గేటు మూసుకుపోయిందని డ్రైవర్‌ ఆరోపించాడు. సాయం కోసం గేట్‌మన్‌ దగ్గరికి వెళ్లానని.. కానీ మద్యం మత్తులో ఉండటంతో అతడు తన మాటల్ని పట్టించుకోలేదని తెలిపాడు. గేట్‌మన్‌ మద్యం సేవించినట్లు చెబుతున్న వీడియోనూ సదరు కారు యజమాని రికార్డ్ చేశాడు. అయితే ఈ ఆరోపణలు ఇంకా నిర్ధారణ కాలేదు. గేట్‌మెన్‌ బ్లడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం పంపినట్టు తెలుస్తోంది.


రైల్వే అధికారులు, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ సాయంతో దెబ్బతిన్న కారును పట్టాలపై నుంచి తొలగించిన అనంతరం రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. కాగా.. గేటు మూసే సమయంలో క్రాసింగ్‌లోకి ప్రవేశించడంతోనే కారు పట్టాలపై చిక్కుకుందని స్థానిక డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ తెలిపారు. అప్పటికే గ్రీన్‌ సిగ్నల్ పడటంతో రైలును ఆపేందుకు సాధ్యం కాలేదని ఆయన వివరించారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామన్న ఆయన.. ఆరోపణలు నిజమని తేలితే గేట్‌మన్‌పై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.


ఇవీ చదవండి:

‘భారతీయులను చంపుతా’.. హిందూ ఆలయమే లక్ష్యంగా రెండేళ్లుగా కుట్ర.!

‘బౌలర్లనూ పట్టించుకోండి’.. బీసీసీఐకి మాజీ చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ విజ్ఞప్తి

Updated Date - Oct 16 , 2026 | 02:36 PM