పైలట్ డ్రెస్‌లో చిన్నారి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగా.!
ABN , Publish Date - Jun 15 , 2026 | 03:46 PM
ఆకాశమే హద్దుగా కలలు కంటున్న ఓ చిన్నారి.. దానిని యూనిఫామ్ రూపంలో మోస్తూ ఓ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టింది. పైలట్ వేషధారణలో కనిపించి అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకుంది. భవిష్యత్తులో ఎలాగైనా పైలట్ కావాలన్న ఆ చిన్నారి ఆశయం.. నూతన విమానాశ్రయం ప్రారంభోత్సవానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశీయ విమానయాన రంగంలో నేడో చారిత్రక రోజుగా నిలిచింది. ఉత్తర్‌ప్రదేశ్ జేవర్‌లోని నొయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో సోమవారం నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. లఖ్‌నవూలోని చౌదరీ చరణ్‌సింగ్ విమానాశ్రయం నుంచి ఉదయం 7:05 గంటలకు బయల్దేరిన తొలి వాణిజ్య విమానం.. 8:05 గంటలకు జేవర్ చేరుకుంది. ఈ చారిత్రక ఘట్టంలో ఓ చిన్నారి అంశమిప్పుడు చర్చనీయాంశమైంది. పైలట్ యూనిఫామ్ ధరించి ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చిన ఆ బుడ్డది.. అక్కడి ప్రయాణికులు సహా సిబ్బంది దృష్టినీ ఆకర్షించింది.
తొలి వాణిజ్య విమానంలో లఖ్‌నవూ నుంచి వచ్చిన ప్రయాణికులలో ఓ చిన్నారి ప్రత్యేకాకర్షణగా నిలిచింది. తలపై టోపీ, వైట్ షర్ట్, టై, లోగోతో అచ్చం పైలట్ వేషధారణలో కనిపించిన ఆ క్యూటీని చూసి అక్కడివారు మురిసిపోయారు. ఆ చిన్నారి ఎంతో ఆత్మవిశ్వాసంగా టెర్మినల్‌లో అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. ఈ క్రమంలో ఆమె తల్లి స్పందిస్తూ.. 'మా అమ్మాయి పెద్దయ్యాక పైలట్ కావాలనేదే మా కోరిక. అందుకే ఈ దుస్తులు వేశాం' అని అన్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చిన్నారిని మెచ్చుకుంటూ నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. 'నీ కల నిజం కావాలి' అని కొందరు.. 'భవిష్యత్తు పైలట్‌కు అభినందనలు' అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇలా.. ఓ చిన్నారి కలను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రుల ఆలోచననూ నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పైలట్ కావాలనే కలతో వచ్చిన ఆ అమ్మాయి.. భావితరాల ఆశయాలకు ప్రతీకగా నిలిచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జేవర్ ఎయిర్‌పోర్ట్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్ కన్నా పైలట్ డ్రెస్‌లో చిరునవ్వుతో అలరించిన ఈ చిన్నారినే ఎక్కువ మంది గుర్తుంచుకునే అవకాశముందంటున్నారు.
ఇవీ చదవండి:
జపాన్ జనాల పద్ధతే వేరు.. ప్రపంచం ఫిదా
ఏంటీ.. మస్క్ ఇంత చిన్న ఇంట్లో ఉంటారా?