35 వేల అడుగుల ఎత్తులో.. బొజ్జ గణపయ్య దర్శనం!.. వీడియో వైరల్
ABN , Publish Date - Sep 16 , 2026 | 01:15 PM
వినాయక చవితి నాడు బిజీ షెడ్యూల్ కారణంగా కొందరికి కుటుంబంతో కలిసి వినాయకుణ్ని పూజించే అవకాశం దక్కకపోవచ్చు. అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న ఓ ఉద్యోగి.. ఏకంగా ఆకాశంలో గణనాథుణ్ని పూజించి ప్రత్యేక అనుభూతిని పొందారు.
ఇంటర్నెట్ డెస్క్: గణేశ్ చతుర్థి అంటే ఇంటిల్లిపాదీ కలిసి గణనాథుణ్ని పూజించే పండుగ. అయితే ఉద్యోగరీత్యా దూరప్రాంతాల్లో ఉండే కొందరు.. పండుగ రోజున కుటుంబసభ్యులతో కలిసి గణపయ్య పూజలో పాల్గొనే అవకాముండకపోవచ్చు. అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న ఓ ఎయిర్‌ఇండియా హోస్టెస్‌కు అనుకోని విధంగా విమానంలోనే వినాయకుణ్ని పూజించుకునే ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
అనురాధ సోనీ అనే కేబిన్ క్రూ మెంబర్‌కు చివరి నిమిషంలో తన షెడ్యూల్ మారిపోయింది. దీంతో ఇంట్లో నిర్వహించుకునే వినాయకుడి పూజకు ఆమె హాజరుకాలేపోయారు. తీవ్ర నిరాశకు గురైన ఆమెకు.. విమానంలో చోటుచేసుకున్న ఓ అనూహ్య పరిణామం ప్రత్యేకంగా నిలించింది. తాను విధులు నిర్వహిస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు గణేశుడి విగ్రహాన్ని తీసుకురావడంతో.. అనురాధ ఆనందం వ్యక్తం చేశారు. ఏకంగా 35 వేల అడుగుల ఎత్తులో గణపయ్యను పూజించే అవకాశం దక్కించుకున్నారామె. అనంతరం ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'కొన్నిసార్లు మనకు అవసరమైనప్పుడే గణేశుడు తన ఉనికిని తెలియజేస్తారు. నిజానికి ఈ రోజు నేను చాలా బాధపడ్డాను. షెడ్యూల్ మార్పుతో ఇంట్లో పూజకు హాజరుకాలేకపోయా. కానీ గణపయ్య వేరేలా ప్లాన్ చేశారు. అలా ఆ వినాయకుడి ఆశీస్సులు నాకు అందాయి' అని ఆమె చెప్పుకొచ్చారు.
విమానంలో గణపతిని పూజిస్తున్న సమయంలో తనకు ప్రత్యేకమైన అనుభూతి కలిగిందన్నారు అనురాధ. 'నేను ఎక్కడున్నా.. గణనాథుడు నాతోనే ఉన్నారన్న భావన కలిగింది. మనం అనుకున్న దానికంటే వినాయకుడు వేసే ప్రణాళిక చక్కగా ఉంటుందనిపించింది' అని ఆమె భావోద్వేగం చెందారు. ఈ అనుభవాన్ని 'అందమైన ఆశీర్వాదం.. మరచిపోలేని క్షణం'గా అభివర్ణిస్తూ గణపతికి కృతజ్ఞతలు తెలిపారామె. కాగా.. అనురాధ పంచుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విమానంలో ఆమె.. గణపయ్యను పూజించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. కొందరు దీనిని 'అద్భుత అనుభవం' అని కామెంట్ చేయగా, 'ఇంట్లో పూజకు దూరమైనప్పటికీ విమానంలోనే పూజ చేసుకునే అవకాశం లభించడం నిజంగా ప్రత్యేకం' అని మరికొందరు స్పందించారు.
ఇవీ చదవండి:
పాక్ తయారీ ఫెయిర్‌నెస్ క్రీములపై కేంద్రం హెచ్చరిక
మోదీని కలిసిన స్కూల్‌మేట్‌కు తిరిగొచ్చిన భూమి.. స్థలాన్ని వదులుకున్న బీజేపీ ఎమ్మెల్యే