వినాయక ఉత్సవాల తర్వాత నిమజ్జనం ఎందుకు?.. అసలు కథ ఇదే..
ABN , Publish Date - Sep 16 , 2026 | 10:25 AM
వినాయక చతుర్థి వేడుకల్లో అత్యంత భావోద్వేగ ఘట్టం నిమజ్జనం. భక్తిశ్రద్ధలతో పూజించిన గణనాథుడికి వీడ్కోలు పలుకుతూ.. వచ్చే ఏడాది మళ్లీ రావాలని భక్తులు కోరుకుంటారు. అసలు నిమజ్జనం ఎందుకు చేస్తారు? దాని వెనుక ఉన్న పురాణ కథ, ఆధ్యాత్మిక విశిష్టత ఏమిటో తెలుసుకుందాం...
ఇంటర్నెట్ డెస్క్: వినాయక చవితి అంటే గణనాథుడి ఆగమనం మాత్రమే కాదు.. నిమజ్జనంతో ముగిసే ఆధ్యాత్మిక వేడుక కూడా. పూజలు, భజనలు, హారతులతో కొలిచిన విఘ్నేశ్వరుడిని అనంత చతుర్దశి రోజున భక్తులు నిమజ్జనం చేస్తారు. ఈ సంప్రదాయం వెనుక పురాణ విశ్వాసాలతోపాటు జీవితం నశ్వరమనే తాత్విక సందేశమూ ఉంది.
వినాయకుడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి కొద్దిరోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అనంతరం నిమజ్జనం ద్వారా ఆ విగ్రహం పంచభూతాల్లో కలిసిపోతుందని విశ్వసిస్తారు. భౌతిక రూపం తాత్కాలికమేనని.. ఆధ్యాత్మిక శక్తి మాత్రం శాశ్వతమనే భావన ఇందులో అంతర్లీనంగా ఉంటుంది. నిమజ్జనం సందర్భంగా 'గణపతి బప్పా మోరియా' అంటూ గణనాథుడికి వీడ్కోలు పలుకుతారు భక్తులు. తమ కష్టాలు, విఘ్నాలను వినాయకుడు తనతో తీసుకెళ్లి.. మళ్లీ వచ్చే ఏడాది శుభాలను తీసుకురావాలని ప్రార్థిస్తారు.
మహాభారతంతో ముడిపడిన కథ
పురాణాల ప్రకారం మహర్షి వేదవ్యాసుడు మహాభారతాన్ని చెబుతుండగా.. వెనకయ్య దానిని నిరంతరం లిఖించడం ప్రారంభించారు. పది రోజులపాటు సాగిన ఈ ప్రక్రియతో గణేశుడి శరీర ఉష్ణోగ్రత పెరిగిందట. మహాభారత రచన పూర్తైన తర్వాత వ్యాసుడు గణేశుణ్ని సరస్సులో స్నానం చేయించడంతో ఆయన శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చిందని విశ్వాసం. ఆ రోజు అనంత చతుర్దశిగా చెబుతారు. అప్పటి నుంచి పది రోజుల పూజ అనంతరం వినాయక నిమజ్జనం చేసే సంప్రదాయం కొనసాగుతోందనే కథనం ప్రాచుర్యంలో ఉంది.
ఎన్ని రోజులకు నిమజ్జనం?
కుటుంబ, ప్రాంతీయ సంప్రదాయాలను అనుసరించి వినాయకుణ్ని వివిధ రోజులపాటు పూజిస్తారు. కొందరు తొలిరోజు, ఇంకొందరు ఒకటిన్నర రోజుకే నిమజ్జనం చేస్తే.. మరికొందరు 3, 5, 9, 10 రోజుల తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే.. పది రోజుల తర్వాత వచ్చే అనంత చతుర్దశి రోజున జరిగే నిమజ్జనానికి మాత్రం పురాణాల్లో ప్రత్యేక ప్రాధాన్యముందట.
బహిరంగ ఉత్సవాలకు బీజం
గణేశ్ చతుర్థికి ప్రాచీనమైన ధార్మిక సంప్రదాయం ఉన్నప్పటికీ.. మహారాష్ట్రలో ఇది భారీ బహిరంగ ఉత్సవంగా రూపుదిద్దుకోవడంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ కీలక పాత్ర పోషించారు. 19వ శతాబ్దం చివర్లో గణేశ్ ఉత్సవాన్ని సామాజిక ఐక్యతకు వేదికగా మలిచారు. దీంతో ఇళ్లలో, ఆలయాల్లో జరిగే వేడుకలు క్రమంగా భారీ మండపాలు, సామూహిక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపులుగా విస్తరించాయి.
వీడ్కోలులోనూ భక్తే..
వినాయక నిమజ్జనం భక్తులకు వీడ్కోలు మాత్రమే కాదు.. వచ్చే ఏడాది మళ్లీ బప్పా రావాలనే ఆకాంక్షకూ ప్రతీక. అందుకే నిమజ్జన వేళ 'గణపతి బప్పా మోరియా' అనే నినాదాలు మార్మోగుతాయి. గణనాథుడి భౌతిక రూపం నీటిలో కలిసిపోయినా.. ఆయనపై భక్తి, విశ్వాసం మాత్రం కొనసాగుతాయని భక్తుల నమ్మకం.
ఇవీ చదవండి:
గణేశుడికి లడ్డూలకు బదులు బోబా టీ.. థాయ్‌లాండ్‌లో వింత ఆచారం!
వినాయకుడి తలను శివుడు ఎందుకు నరికాడు? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?