Share News

గణేశుడికి లడ్డూలకు బదులు బోబా టీ.. థాయ్‌లాండ్‌లో వింత ఆచారం!

ABN , Publish Date - Sep 15 , 2026 | 04:12 PM

వినాయకుడికి లడ్డూలు, మోదకాలు సమర్పించడం మన దగ్గర సాధారణంగా కనిపిస్తుంది. అయితే థాయ్‌లాండ్‌లో మాత్రం గణేశుడికి భక్తులు బబుల్ టీని నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఈ ప్రత్యేక ఆచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గణేశుడికి లడ్డూలకు బదులు బోబా టీ.. థాయ్‌లాండ్‌లో వింత ఆచారం!
Thailand Ganesha Temple Boba Tea

ఇంటర్నెట్ డెస్క్: వినాయకుడికి లడ్డూలు, ఉండ్రాళ్లు, కుడుములు వంటి నైవేద్యాలు సమర్పించడం మన దేశంలో సాధారణంగా కనిపిస్తుంది. కానీ థాయ్‌లాండ్‌లో మాత్రం గణేశుడికి మరో రకమైన నైవేద్యం సమర్పిస్తుంటారు. అదే బోబా టీ లేదా బబుల్ టీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


బ్యాంకాక్‌కు చెందిన పియా పింగ్ అనే మహిళ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. యూనియన్ మాల్ వెలుపల ఉన్న వినాయకుడి ఆలయాన్ని ఆమె వీడియోలో చూపించారు. అక్కడ గణేశుడి విగ్రహం ముందు పెద్ద సంఖ్యలో బబుల్ టీ కప్పులు కనిపించాయి. తాను కూడా గణేశుడికి నైవేద్యంగా బబుల్ టీని సమర్పించినట్లు ఆమె తెలిపారు.


భారత్‌లో గణేశుడికి సాధారణంగా లడ్డూలు, మోదకాలు సమర్పిస్తారని.. థాయ్‌లాండ్‌లో మాత్రం స్థానికంగా ప్రజలు ఇష్టపడే బబుల్ టీని నైవేద్యంగా పెడతారని పియా వివరించారు. అక్కడి భక్తులు తమకు నచ్చిన బబుల్ టీ బ్రాండ్‌ను కొనుగోలు చేసి గణేశుడికి సమర్పిస్తారని చెప్పారు. యూనియన్ మాల్‌లో ఏయే అంతస్తుల్లో బబుల్ టీ దుకాణాలు ఉన్నాయో తెలిపే వివరాలు కూడా ఆలయం దగ్గర అందుబాటులో ఉంటాయని ఆమె పేర్కొన్నారు. దీంతో భక్తులు తమకు ఇష్టమైన టీని కొనుగోలు చేసి స్వామికి సమర్పించవచ్చు.


కోరిక తీరితే మరింత బబుల్ టీ సమర్పణ

తమ కోరిక నెరవేరాలని గణేశుడికి భక్తులు బబుల్ టీని నైవేద్యంగా సమర్పిస్తారని పియా తెలిపారు. కోరిక నెరవేరిన తర్వాత మొక్కు చెల్లించేందుకు తిరిగి ఆలయానికి వచ్చి గతంలో సమర్పించిన దానికంటే ఎక్కువ కప్పుల బబుల్ టీని సమర్పిస్తారని చెప్పారు. ఉదాహరణకు మూడు కప్పులతో ప్రారంభించిన మొక్కు.. కోరిక నెరవేరిన తర్వాత 6, 12, చివరకు వందల కప్పులకు కూడా చేరుతుందని ఆమె వివరించారు.

థాయ్‌లాండ్‌లోని ఈ ఆచారం స్థానిక సంస్కృతి, ప్రజల అభిరుచులకు అనుగుణంగా ఏర్పడిన ప్రత్యేక సంప్రదాయంగా పియా పేర్కొన్నారు. ప్రజలకు ఇష్టమైన వస్తువును దేవుడికి సమర్పించడం ద్వారా తమ భక్తిని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. థాయ్‌లాండ్‌లో స్థానికుల అభిరుచికి తగ్గట్టుగా గణేశుడికి బబుల్ టీ సమర్పించడం ఇప్పుడు ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. బోబా టీ అనేది టీ, పాలు, చక్కెర, నమలడానికి వీలుగా ఉండే టాపియోకా ముత్యాలతో తయారు చేసే ఒక ప్రసిద్ధ తీపి పానీయం.


Also Read:

'సకల గణాలకు అధిపతి వినాయకుడు' అని ఎందుకంటారో తెలుసా?

యాంటిల్లాల్లో వినాయక చవితి వేడుకలు.. నీతా, రాధిక కాస్ట్యూ్మ్స్ అదుర్స్..

Updated Date - Sep 15 , 2026 | 04:49 PM