Share News

వినాయకుడి తలను శివుడు ఎందుకు నరికాడు? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?

ABN , Publish Date - Sep 14 , 2026 | 05:15 PM

వినాయక చవితి సందర్భంగా గణపతి జన్మకు సంబంధించిన పురాణ కథను భక్తులు గుర్తుచేసుకుంటారు. శివుడు గణేశుడి తలను ఎందుకు నరికాడు? ఆ తర్వాత ఏనుగు తలను ఎలా అమర్చాడు? ఆసక్తికరమైన పురాణ కథను పండితులు వివరిస్తారు.

వినాయకుడి తలను శివుడు ఎందుకు నరికాడు? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?
Lord Ganesh Elephant Head Story

ఇంటర్నెట్ డెస్క్: వినాయక చవితి సందర్భంగా గణపతి జన్మకు సంబంధించిన పురాణ కథను భక్తులు గుర్తుచేసుకుంటారు. గణేశుడు ఎలా జన్మించాడు? శివుడు గణేశుడికి ఏనుగు తలను ఎందుకు అమర్చాడు? వంటి విషయాలను పురాణ కథల ఆధారంగా పండితులు వివరిస్తారు.

గణేశుడిని జ్ఞానం, వివేకం, విద్య, శుభానికి అధిపతిగా భక్తులు కొలుస్తారు. అందుకే ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణేశుడిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. వినాయక చవితి రోజున భక్తిశ్రద్ధలతో గణపతిని పూజిస్తే ఆటంకాలు తొలగిపోయి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం.


గణేశుడు ఎలా జన్మించాడు?

పురాణ కథనం ప్రకారం.. ఒకసారి శివుడు రాక్షసులతో యుద్ధం చేయడానికి వెళ్లాడు. ఆ సమయంలో పార్వతీదేవి కైలాసంలో ఒంటరిగా ఉంది. ఒకరోజు ఆమె స్నానానికి వెళ్లే సమయంలో తనకు కాపలాగా ఎవరూ లేకపోవడంతో.. తన శరీరానికి రాసుకున్న పసుపుతో ఒక బాలుడి రూపాన్ని తయారు చేసింది. ఆ బాలుడికి ప్రాణం పోసి తన కుమారుడిగా భావించింది. అతడే గణేశుడు. తాను స్నానం చేసి వచ్చే వరకు ఎవరినీ లోపలికి అనుమతించవద్దని పార్వతీదేవి గణేశుడికి చెప్పింది. తల్లి మాటను శిరసావహించిన గణేశుడు.. ఆమె చెప్పినట్టే ఇంటి వద్ద కాపలాగా నిలబడ్డాడు.

గణేశుడి తలను శివుడు ఎందుకు నరికాడు?

ఇంతలో యుద్ధం ముగించుకుని శివుడు కైలాసానికి తిరిగి వచ్చాడు. అయితే తన ఇంటి వద్ద ఓ బాలుడు కాపలాగా ఉండటం, తనను లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో శివుడు ఆశ్చర్యపోయాడు. గణేశుడు తన తల్లి ఆదేశాన్ని పాటిస్తూ శివుడిని లోపలికి అనుమతించలేదు. దీంతో కోపోద్రిక్తుడైన శివుడు తన సైన్యాన్ని గణేశుడితో పోరాడమని ఆదేశించాడు. అయితే గణేశుడు వారిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. చివరకు శివుడే స్వయంగా గణేశుడితో యుద్ధం చేశాడు. ఆగ్రహంతో తన ఆయుధంతో గణేశుడి తలను నరికేశాడని పురాణ కథనం. దీంతో గణేశుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.


పార్వతీదేవి ఆగ్రహం

గణేశుడి మరణవార్త తెలుసుకున్న పార్వతీదేవి తీవ్ర ఆగ్రహానికి గురైంది. తన కుమారుడిని తిరిగి బ్రతికించకపోతే సృష్టినే నాశనం చేస్తానని హెచ్చరించిందని పురాణాల్లో కథ ఉంది. దీంతో శివుడు పార్వతీదేవిని శాంతింపజేసి, గణేశుడిని తిరిగి బ్రతికిస్తానని మాట ఇచ్చాడు. అయితే పార్వతీదేవి రెండు షరతులు విధించింది. గణేశుడిని తిరిగి బ్రతికించడంతో పాటు.. దేవతలందరికంటే ముందుగా గణేశుడినే పూజించాలని కోరింది.

గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది?

పార్వతీదేవి షరతులను అంగీకరించిన శివుడు.. ఉత్తరం వైపు తల పెట్టుకుని నిద్రిస్తున్న మొదటి జీవి తలను తీసుకురావాలని బ్రహ్మను ఆదేశించాడు. బ్రహ్మకు ఒక ఏనుగు కనిపించడంతో దాని తలను తీసుకువచ్చాడని పురాణ కథనం. అనంతరం శివుడు ఆ ఏనుగు తలను గణేశుడి శరీరానికి అమర్చాడు. గణేశుడికి తిరిగి ప్రాణం పోశాడు. ఆ తర్వాత గణేశుడిని తన కుమారుడిగా ప్రకటించిన శివుడు.. దేవతలందరికంటే ముందుగా గణేశుడినే పూజించాలని వరమిచ్చాడని పురాణాల్లో పేర్కొంటారు. అప్పటి నుంచి ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణేశుడిని పూజించే సంప్రదాయం కొనసాగుతోందని భక్తుల విశ్వాసం. అందుకే గణేశుడిని విఘ్నేశ్వరుడు, విఘ్నహర్తగా పిలుస్తారు.

Note: ఇందులోని సమాచారం పురాణాలు, మత విశ్వాసాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఈ 4 రాశులపై వినాయకుడి కటాక్షం.. కెరీర్, వ్యాపారంలో ఇక విజయాలే!

వినాయక చవితి 2026.. చంద్రుడిని ఎందుకు చూడకూడదు? ఈ పురాణ కథ తెలుసా?

Updated Date - Sep 14 , 2026 | 05:36 PM