BRS Election Strategy: టార్గెట్ మున్సిపోల్స్.. బీఆర్ఎస్ ప్రత్యేక కార్యాచరణ..
ABN , Publish Date - Jan 10 , 2026 | 10:38 AM
తెలంగాణలో రానున్న మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. ఎన్నికలపై సీరియస్‌గా దృష్టి సారించిన పార్టీ, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఉమ్మడి జిల్లాల వారీగా వరుసగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీని సంస్థాగతంగాా బలోపేతం చేయడం, స్థానిక సమస్యలు, ఎన్నికల వ్యూహాలపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది..
హైదరాబాద్, జనవరి10(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల (Telangana Municipal Elections) వేళ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) జిల్లాల వారీగా వరుస సమీక్షలతో కేడర్‌లో జోష్ నింపుతున్నారు. ఈ క్రమంలోనే పట్టణ ప్రాంతాల్లో తన పట్టును నిరూపించుకోవడానికి బీఆర్ఎస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. కేటీఆర్ పర్యటనలతో గులాబీ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
టార్గెట్ మున్సిపోల్స్..
మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తోంది. కేటీఆర్ వరుస సమీక్షా సమావేశాలు మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో తిరిగి పట్టు సాధించాలని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా కేటీఆర్ నేరుగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయి నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
సన్నాహక సమావేశాలు..
తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. స్థానిక సమస్యలు, పార్టీ బలాబలాలపై కేటీఆర్ చర్చిస్తున్నారు. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఇప్పటికే కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలతో సమావేశమై ఎన్నికల వ్యూహాలను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో ఇవాళ (శనివారం) సమావేశం కానున్నారు. కీలక నేతలకు మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచార శైలిపై కీలక సూచనలు ఇవ్వనున్నారు.
కాంగ్రెస్ పాలనపై అస్త్రాలు..
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించుకుంది. గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో పట్టణాల్లో ఒక్క రూపాయి కూడా అభివృద్ధి పనులకు ఖర్చు చేయలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన మిషన్ భగీరథ, పలు పథకాల నిర్వహణను కాంగ్రెస్ గాలికొదిలేసిందని విమర్శిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల స్ఫూర్తితో..
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తమ మద్దతుదారులు మంచి ఫలితాలు సాధించారని, అదే ఊపును మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగిస్తామని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. పట్టణ ఓటర్లు ఎప్పుడూ అభివృద్ధిని కోరుకుంటారని తమవైపే ఉంటారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు.
బీఆర్ఎస్ వ్యూహం..
కేటీఆర్ నేతృత్వంలో మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గెలిచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఆయా జిల్లాల స్థాయి సమీక్షలు, ప్రచారాస్త్రం , కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల వైఫల్యాలను బలంగా తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. ఈ మేరకు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ కేడర్‌కు బీఆర్ఎస్ హైకమాండ్ పిలుపునిచ్చింది. సోషల్ మీడియా ద్వారా రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా ఎండగట్టాలని సూచించింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా పరిగణించాలని బీఆర్ఎస్ హైకమాండ్ దిశానిర్దేశం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అంబర్‌పేట్ ఎస్ఐ భానుప్రకాశ్‌రెడ్డి అరెస్ట్.. ఏమైందంటే..
మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Read Latest Telangana News And Telugu News