Share News

తమిళనాడులో విజయ్‌ కూటమికి ‘ఎస్‌ఎస్‌జేవీఏ’గా పేరు

ABN , Publish Date - Sep 09 , 2026 | 09:24 PM

తమిళనాడులో సీఎం సి.విజయ్‌ నేతృత్వంలోని కూటమికి అధికారికంగా ఎస్ఎస్‌జేవీఏ అనే పేరు ఖరారైంది. మొత్తం 5 పార్టీలు ఇందులో భాగమయ్యాయి.

తమిళనాడులో విజయ్‌ కూటమికి ‘ఎస్‌ఎస్‌జేవీఏ’గా పేరు
SSJVA Alliance

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులో సీఎం సి.విజయ్‌ నేతృత్వంలోని కూటమికి అధికారికంగా 'సెక్యులర్‌ సోషల్‌ జస్టిస్‌ విక్టరీ అలయన్స్‌(SSJVA)' అనే పేరు ఖరారైంది. విజయ్‌కు చెందిన తమిళగ వెట్రి కళగం(టీవీకే) సహా కాంగ్రెస్‌, విడుతలై చిరుతైగల్ కట్చి(వీసీకే), వైకోకు చెందిన మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కళగం(ఎండీఎంకే), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) పార్టీలు ఈ కూటమిలో ఉన్నాయి.


ఈ మేరకు బుధవారం చెన్నై పనయూర్‌లోని టీవీకే ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలో కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కూటమి పేరును ఖరారు చేశారు. కాంగ్రెస్‌ నుంచి మాణిక్కం ఠాగూర్‌, థారగై కాథ్‌బర్ట్‌, ప్రవీణ్‌ చక్రవర్తి హాజరుకాగా.. వీసీకే తరఫున ఆ పార్టీ అధినేత తిరుమావళవన్‌, వన్ని అరసు, రవికుమార్‌, సిందనై సెల్వన్‌లు పాల్గొన్నారు. ఇక.. ఎండీఎంకే నుంచి వైకో, దురై వైకో పాల్గొనగా.. ఐయూఎంఎల్‌ నుంచి కేఎం కాదర్‌ మొహిదీన్‌, షాజహాన్‌ తదితరులు హాజరయ్యారు.


అయితే.. ఈ సమావేశానికి సీపీఐ(ఎం), సీపీఐ ప్రతినిధులెవరూ హాజరుకాలేదు. విజయ్‌ నేతృత్వంలోని ప్రభుత్వానికి బయటి నుంచి అంశాల వారీగా మద్దతిస్తామని సీపీఐ(ఎం) ఇప్పటికే స్పష్టం చేసింది. కానీ ప్రభుత్వంలో చేరడం, మంత్రి పదవులు చేపట్టడం తమకు ఇష్టం లేదని పేర్కొంది. తమ స్వతంత్ర రాజకీయ గుర్తింపును కొనసాగిస్తూ.. కార్మికులు, వ్యవసాయం, బడ్జెట్‌ వంటి అంశాలపై ప్రభుత్వ విధానాలను విమర్శించే స్వేచ్ఛ తమకు ఉండాలని వామపక్షాలు భావిస్తున్నాయి. కాగా.. ఈ ఐదు పార్టీలతో ఏర్పడిన కూటమి రానున్న కాలంలో స్థానిక సంస్థలు, 2029 లోక్‌సభ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశమున్నట్టు సమాచారం. అయితే.. వామపక్షాల వైఖరి మాత్రం కూటమికి భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది.


ఇవీ చదవండి:

'మా ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి.. అంత ధైర్యం ఎలా వచ్చింది?'

ఎర్రకోటే లక్ష్యం.. ఏళ్ల ముందే రెక్కీ.. ఎన్‌ఐఏ ఛార్జిషీట్‌లో కీలక వివరాలు

Updated Date - Sep 09 , 2026 | 09:44 PM