Share News

'మా ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి.. అంత ధైర్యం ఎలా వచ్చింది?'

ABN , Publish Date - Sep 09 , 2026 | 03:07 PM

తమ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఓ విద్యార్థికి నోటీసు జారీ చేయడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయమై సంబంధిత మేజిస్ట్రేట్‌ నుంచి వివరణ కోరనున్నట్లు స్పష్టం చేసింది.

'మా ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి.. అంత ధైర్యం ఎలా వచ్చింది?'

ఇంటర్నెట్ డెస్క్: జులైలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనల్లో పాల్గొన్నందుకు ఓ విద్యార్థికి గ్రేటర్ నొయిడా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నోటీసు జారీచేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తాము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. వాటిని ఉల్లంఘించడాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. 'ఓ విద్యార్థికి మేజిస్ట్రేట్ నోటీసు ఎలా ఇస్తారు? విద్యార్థులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని మా ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. అయినప్పటికీ ఓ మేజిస్ట్రేట్‌కు అలా చేయడానికి ఎంత ధైర్యం?' అని సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం మండిపడింది.


సుప్రీంకోర్టు తన అసాధారణ అధికారాలను ఉపయోగిస్తూ జులైలో జరిగిన సీజేపీ ఆందోళనలకు సంబంధించి విద్యార్థులపై నమోదైన అన్ని కేసులనూ కొట్టివేయాలని ఈ నెల 1న ఆదేశాలు జారీ చేసింది. జులై 20 నుంచి 25 మధ్య దేశ వ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఇకపై కొనసాగించరాదని, వాటిని అన్నిరకాలుగా క్లోజ్ చేస్తున్నట్టుగా పరిగణించాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా.. ఆ ఆందోళనలకు సంబంధించి భవిష్యత్తులో ఏ విద్యార్థిపైనా కొత్తగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని పేర్కొంది.


ఈ నేపథ్యంలో గ్రేటర్ నొయిడాకు చెందిన ఓ విద్యార్థి విషయంలో మేజిస్ట్రేట్ నోటీసు జారీచేసిన విషయాన్ని బిశ్వజిత్ భట్టాచార్య అనే సీనియర్ న్యాయవాది సుప్రీం న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనను దేశంలోని విద్యార్థులపై జరుగుతున్న ఓ ప్రయోగంగా అభివర్ణించారు భట్టాచార్య. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ధర్మాసనం జోక్యం చేసుకోవాలని కోరారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ.. గౌతమ్‌బుద్ధ నగర్ జిల్లా మేజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌ల నుంచి వివరణ కోరనున్నట్లు తెలిపారు.


కాగా.. గౌతమ్‌బుద్ధ యూనివర్సిటీలో చదువుతున్న ఓ విద్యార్థికి ఈ నెల 4న ఈ నోటీసు జారీ అయింది. ప్రభుత్వ వ్యతిరేక సమాచారాన్ని ప్రచారం చేయడం సహా జంతర్‌మంతర్ వద్ద జరిగిన సీజేపీ ఆందోళనలో పాల్గొనాలని ఇతర విద్యార్థులను ప్రోత్సహించారంటూ ఆ నోటీసులో ఆరోపించారు. అయితే.. మరుసటి రోజే ఆ నోటీసును ఉపసంహరించుకున్నట్లు కోర్టుకు తెలిపారు.


ఇవీ చదవండి:

పిరికి జడ్జి అనిపించుకోవడం కన్నా చావడం మేలు

టీచర్‌ ఉద్యోగాలకు టెట్‌.. లెక్చరర్‌ పోస్టులకు నెట్‌ తప్పనిసరి

Updated Date - Sep 09 , 2026 | 03:11 PM