రోడ్డు యాక్సిడెంట్‌లో యువతి మరణం.. 26 రోజుల తర్వాత బయటపడ్డ ట్విస్ట్..
ABN , Publish Date - Sep 09 , 2026 | 01:42 PM
26 రోజుల క్రితం ఓ యువతి బైకుపై వెళుతుండగా యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ కారణంగా యువతి తీవ్రగాయాలపాలై ప్రాణాలు కోల్పోయింది. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇంటర్‌నెట్ డెస్క్: 26 రోజుల క్రితం ఓ యువతి బైకుపై వెళుతుండగా యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ కారణంగా యువతి తీవ్రగాయాలపాలై ప్రాణాలు కోల్పోయింది. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ యువతిది యాక్సిడెంట్ కాదని, పక్కా ప్లాన్ ప్రకారం చేసిన మర్డర్ అని తేలింది. పరువు కోసం కన్నతండ్రి, సోదరుడు ఆమెను హత్య చేశారన్న సంగతి వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే..
మూడు నెలల క్రితం అహ్మదాబాద్‌కు చెందిన సోఫియా అనే యువతి ఓ యువకుడితో ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో సోఫియా తండ్రి మహ్మద్ ఫరూఖ్, అన్న మహ్మద్ హాబిల్ దృష్టికి వెళ్లింది. దీంతో వారు సోఫియాపై ఆగ్రహానికి గురయ్యారు. ఆ వీడియో కారణంగా సమాజంలో తలదించుకునే పరిస్థితి వస్తుందని భావించారు. ఈ నేపథ్యంలోనే తండ్రీకొడుకులు సోఫియాను చంపడానికి నిశ్చయించుకున్నారు. ఆగస్టు 12వ తేదీ రాత్రి ఆమెను బైకుపై ఊరి బయటకు తీసుకువెళ్లారు.
గెల్జీపుర గ్రామం దగ్గర బైకును మట్టి మార్గంలోకి తీసుకెళ్లారు. అక్కడ హాబిల్.. సోఫియాపై ఇనుపరాడ్డుతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. తలపై మూడు సార్లు కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ సోఫియాను తండ్రీకొడుకులు మెయిన్ రోడ్డు మీదకు తీసుకువచ్చారు. అక్కడ బైకును ధ్వంసం చేశారు. హాబిల్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. గుర్తు తెలియని వాహనం తమ బైకును ఢీకొట్టిందని చెప్పాడు.
సోఫియా తలకు తీవ్రమైన గాయాలు, తనకు చిన్న చిన్న గాట్లు పడ్డాయని తెలిపాడు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. సోఫియాను సోలా సివిల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరుసటి రోజు సోఫియా ప్రాణాలు కోల్పోయింది. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో సోఫియా తండ్రి, సోదరుడే ఈ దారుణానికి ఒడిగట్టారని తేలింది. పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
మక్కా ఒప్పందాన్ని మర్చిపోయారా? హౌతీలకు పాక్ మంత్రి వార్నింగ్
కేసీఆర్ మరణాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ కోరుకోలేదు: మహేశ్ గౌడ్